ఇంకు మార్కు.. చూపుడు వేలిపై

26 Mar, 2014 04:03 IST|Sakshi

విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : త్వరలో నిర్వహించనున్న మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటువేసే వారికి ఎడమచేతి చూపుడు వేలిపై ఇంకు మార్కు వేయాలని రాష్ట ఎన్నికల అధికారి పి.రమాకాంతరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు ఇచ్చారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమాస్యాత్మక ప్రాంతాలను గుర్తించేందుకు పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణ అధికారులు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు భారీ బందోబస్తు నిర్వహించాలన్నారు. మద్యం అమ్మకాలపై దృష్టి సారించి, అధిక మద్యం అమ్మకాలపై నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు.

 పోలింగ్‌కు సర్వం సిద్ధం : కలెక్టర్
 జిల్లాలో పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు రమాకాంతరెడ్డికి వివరించారు. మున్సిపల్, జెడ్పీపీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 49 మండలాల పరిధిలో 2,667 పోలింగ్ కే ంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 4,347 పెద్ద, 2,217 చిన్న బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇవిగాక తమిళనాడు నుంచి మరో 700 బ్యాలెట్ బాక్సులు వచ్చాయన్నారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ నగర పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో చీఫ్ సెక్రటరీ ఏకే మహంతి, సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్, రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అధికారి కౌముది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు