టీడీపీలో వణుకు

22 Apr, 2014 01:31 IST|Sakshi
టీడీపీలో వణుకు

సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో ఒకవైపు రెబల్స్ గుబులు పుట్టిస్తుండగా.. మరొకవైపు టికెట్లు రాని నేతలు పార్టీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానాన్ని వణికిస్తున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులతో టీడీపీ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి కనబడుతోంది. మరో మూడు నియోజకవర్గాల్లో అసంతృప్త నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లిసత్యనారాయణమూర్తి (బాబ్జి) తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగిన విషయం విదితమే. తాను ఎట్టి పరిస్థితుల్లోను నామినేషన్‌ను ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని ఆయన తెగేసి చెబుతున్నారు.
 
 సోమవారం ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమై పోటీలోనే ఉండాలని నిర్ణయించారు. ఆయనను వెన్నంటి ఉన్న నాయకులు, శ్రేణులు అవసరమైతే చందాలు వేసుకుని మరీ బాబ్జిని గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. దీంతో అక్కడి టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సీటు వచ్చిందనే ఆనందం కంటే సీనియర్ నేత బాబ్జి రంగంలో ఉండటం ఆయనకు అగ్నిపరీక్షగా మారింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న రామానాయుడు పరిస్థితి బాబ్జి తిరుగుబాటుతో మరింత దిగజారింది. రాష్ట్ర నేతలు మాట్లాడినా బాబ్జి పోటీనుంచి విరమించుకోవడానికి ఒప్పుకోవడం లేదు. కొవ్వూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావు తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీని ఓడిస్తానని సవాల్ చేస్తున్నారు.
 
 ఆయన కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి జవహర్‌కు కంటిమీద కునుకులేకుండా చేయడంతోపాటు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మాగంటి మురళీమోహన్ ఓటమే తన ధ్యేయమని ఇప్పటికే ప్రకటించారు. చంద్రబాబును గౌరవిస్తానని చెబుతూనే పార్టీ అభ్యర్థులను ఓడిస్తానని స్పష్టం చేస్తున్నారు. చింతలపూడిలో ఆ పార్టీ నేత రాయల రాజారావు భార్య సుమలతను రెబల్‌గా పోటీ చేస్తూ టీడీపీని దెబ్బతీయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అసలే నాన్‌లోకల్ ఇబ్బందులతో సతమతమవుతూ ఏంచేయాలో తెలియక దిక్కులు చూస్తున్న ఆ పార్టీ అభ్యర్థి పీతల సుజాత రాజారావు తీరుతో మరింత బెంబేలెత్తుతున్నారు. తాడేపల్లిగూడెం సీటును పొత్తులో భాగంగా బీజేపీకి వదిలేశారనే కోపంతో ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ వ్యవహార శైలి టీడీపీకి ఇరకాటంగా మారింది. పోటీనుంచి విరమిస్తానని కాసేపు, వెనకడుగు వేసేది లేదని కాసేపు ఆయన చెబుతుండటంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి.
 
 భీమవరం, ఆచంట నియోజకవర్గాల్లో వలస నేతలైన పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), పితాని సత్యనారాయణకు టికెట్లు ఇవ్వడంతో ఇన్నాళ్లూ పార్టీని మోసినవారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. భీమవరంలో మెంటే పార్థసారథి వర్గానికి సర్ధిచెప్పడం ఎవరి తరమూ కావడం లేదు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఎన్నివిధాలుగా సారథి వర్గాన్ని బుజ్జగించేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో మిన్నకుండిపోయారు. అంజిబాబుపై అన్ని వైపులనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆచంటలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు సీటివ్వడంతో ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నేత గుబ్బల తమ్మయ్య ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీ నేతలు పితానికి సహకరించేందుకు ఇష్టపడటం లేదు. దీంతో పితాని సొంత నియోజకవర్గంలో ఎదురీదుతున్నారు. గోపాలపురం నియోజకవర్గంలోనూ కీలక నేతలు పార్టీ అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ పరిస్థితి ఒక్కసారిగా తిరోగమనంలో పడినట్లయింది.
 

మరిన్ని వార్తలు