టెన్షన్.. టెన్షన్

11 May, 2014 03:40 IST|Sakshi
టెన్షన్.. టెన్షన్

నేతలు గెలుపోటముల అంచనాల్లో మునిగిపోయారు.. సమస్మాత్మక గ్రామాల ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నెల 12 నుంచి 16 వరకూ వరుసగా మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధాన పార్టీల నేతలు, గ్రామస్థాయి నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం పోటీపడ్డారు. పలుచోట్ల ఘర్షణలకు దిగారు. ఫలితాల ప్రభావం తమను ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తుందోనని సామాన్యులు భయపడుతున్నారు.
 
 సాక్షి, కడప: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిశాక అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపై ఉంది. ఈనెల 12 నుంచి 16 వరకు వరుసగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఓటమి పాలైన అభ్యర్థులు గొడవలకు ఆజ్యం పోస్తారేమోననే అనుమానం వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కడప లోక్‌సభ పరిధిలోనే ఎక్కువగా సమస్మాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలో పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.
 
 పోలీసుల తీరుపై అనుమానాలు:

 జిల్లాలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ విజయం సాధించారు. అయినా పలుచోట్ల గొడవలు జరిగాయి. కిందిస్థాయిలోని కొందరు అధికారులు సమర్థంగా పనిచేస్తుంటే, ఇంకొందరు ఏకపక్షంగా వ్యవహరించి ఓ వర్గానికి అండగా నిలుస్తున్నారనే విమర్శలున్నాయి. ఎన్నికలకు ముందు సమస్మాత్మక వ్యక్తులను ముందస్తుగా అరెస్టు చేయకపోవడం, కోట్ల రూపాయలు ఇంటింటికి వెళ్లి పంచుతున్నా అదుపు చేయకపోవడం, దాడులకు పాల్పడుతున్నా షాడోపార్టీలు అడ్డుకోకపోవడం వంటి ఘటనలు పోలీసుల పనితీరుపై అనుమానాలకు తావిస్తున్నాయి. కొందరు భారీగా డబ్బులు తీసుకుని ఓ వర్గానికి వత్తాసు పలికారని కొందరు పోలీసులే బాహాటంగా చర్చించుకుంటున్నారు.
 
 మైదుకూరుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందే:
 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అత్యధికంగా గొడవలు జరిగింది మైదుకూరు నియోజకవర్గంలోనే. మైదుకూరు మండలంలో టీడీపీ అరాచకాలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమాయ్యరు. ఓ అధికారి టీడీపీ నేత నుంచి భారీగా ముడుపులు తీసుకోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ అనుమతి లేకుండా నాలుగు వాహనాల్లో రౌడీలను వేసుకుని హల్‌చల్ చేశారు. ఎన్. ఎర్రబల్లి, నాగసానిపల్లి, నంద్యాలంపేటతో పాటు చాలా గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడి చేసి రిగ్గింగ్‌కు యత్నించారు. అయినా పుట్టా అరాచకాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించలేదు. నిజాయితీ, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారుల్లో కొందరు ఇలా వ్యవహరించడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ముం దస్తు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది.

మరిన్ని వార్తలు