నేడే తెర

16 May, 2014 02:07 IST|Sakshi

ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు
 
 అసెంబ్లీ నియోజకవర్గాలు :     14
 పార్లమెంట్ నియోజకవర్గాలు: 2
 పోటీ పడిన అభ్యర్థులు:     205
 లెక్కింపు కేంద్రాలు    5
 కౌంటింగ్ సిబ్బంది:    1,512 మంది
 మొత్తం రౌండ్లు: 14 నుంచి 20 వరకు
 
 ఒక్కో రౌండ్‌కు పట్టే సమయం:
 15 నిమిషాలు
 మొదటి ఫలితం:
 శ్రీశైలం లేదా
 మంత్రాలయం
 
 సాక్షి, కర్నూలు: సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. సరిగ్గా శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకాబోతోంది. మధ్యాహ్నానికల్లా ఫలితాలపై స్పష్టత వచ్చేస్తుంది. ఏ నియోజక వర్గంలో ఏ పార్టీ పాగా వేసింది.. రాష్ట్రాన్ని ఏలబోయే పార్టీకి జిల్లాలో ఎన్ని స్థానాలు వచ్చాయనేది కూడా తేలనుంది. ఇంతకీ విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది. ఇదే ఇప్పుడు అందరిలో టెన్షన్..! లెక్కింపు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అటు అభ్యర్థుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ టెన్షన్ పెరుగుతోంది. ఇప్పటి వరకు పురపాలిక, పరిషత్తు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తమకు అనుకూలంగా ఉండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.
 
 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లోనూ తమకు తిరుగేలేదన్న ధీమా వారిలో కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని చెబుతోంది. ప్రాదేశిక పోరులో స్వతంత్ర అభ్యర్థులతో కూడా సమానంగా ఓట్లు సాధించలేని కాంగ్రెస్ పరువు కోసం పాకులాడుతోంది. పూజా కార్యక్రమాలు, విహార యాత్రలు ముగించుకుని నియోజకవర్గాలకు చేరుకున్న అభ్యర్థులు గురువారమే వారి మద్దతుదారులతో కలిసి కౌంటింగ్ కేంద్రాలున్న కర్నూలు, నంద్యాలకు చేరుకున్నారు. మొత్తం మీద రెండు పార్లమెంటు స్థానాల్లో బరిలో నిలిచిన 26 మంది, 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్న 179 మంది అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది.
 
 పకడ్బందీ ఏర్పాట్లు..
 సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జిల్లాలో ఐదు కేంద్రాల్లో జరగనుంది. కర్నూలు లోక్‌సభ స్థానంతోపాటు, దీని పరిధిలోని కర్నూలు, పత్తికొండ, కోడుమూరు శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతుంది.  రవీంద్ర మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నంద్యాల పార్లమెంట్ స్థానంతోపాటు దాని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పాణ్యం సమీపంలోని ఆర్‌జీఎం క్యాంపస్‌లో జరుగుతుంది.
 
 అలాగే ఆళ్లగడ్డ, శ్రీశైలం శాసనసభ స్థానాల ఓట్ల లెక్కింపు నెరవాడలోని శాంతిరామ్ ఫార్మసీ కళాశాలలోను, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, డోన్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఆర్‌జీఎం ఇంజినీరింగ్ కళాశాలలోను, నంద్యాల నియోజకవర్గం ఓట్ల లెక్కింపు శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లను, రిటర్నింగ్ అధికారికి, పరిశీలకుడికి చేరొక టేబుల్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రోఅబ్జర్వర్ ఉంటారు. ఈ విధంగా ప్రతి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గానికి రిజర్వరు సిబ్బందితో కలిపి 108 మంది విధులు నిర్వర్తిస్తారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ కొనసాగిస్తున్నారు.

 మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు... సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించే 8 గంటలలోపు మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ నియోజకవర్గానికి 2 నుంచి 3 టేబుళ్లను ఏర్పాటు చేయగా.. పార్లమెంటు నియోజకవర్గాలకు ఇందుకు భిన్నంగా ఏర్పాటు చేశారు. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపునకు 8 టేబుళ్లను ఏర్పాటు చేశారు. నంద్యాల పార్లమెంటు స్థానానికి 9 టేబుళ్లను సిద్ధంగా ఉంచారు. వీటి తర్వాతే ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు.
 
 ఎవరి ధీమా వారిదే..
 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలతో వాళ్లు ఉన్నారు. జిల్లాలో పురపాలక, పరిషత్తు ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా రావడం, వివిధ సర్వేలు కూడా తమకే అనుకూలంగా ఉండడంతో సార్వత్రిక ఎన్నికల్లోనూ తిరుగులేని అధిపత్యం సాధించగలమని వైఎస్సార్‌సీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.
 
 జిల్లాలోని 8 పురపాలక సంఘాలకుగాను 5 చోట్ల  విజయబావుటా ఎగురవేయడం, 53 జెడ్పీటీసీలకుగాను 30 గెలుచుకుని తిరుగులేని అధిపత్యం సాధించడం, 23 మండల పరిషత్‌లను కూడా కైవసం చేసుకోవడం వైఎస్సార్‌సీపీ శ్రేణులకు కొండంత బలాన్నిస్తోంది. మరోవైపు టీడీపీ పుర, పరిషత్తు ఎన్నికల ఫలితాలతో ఇప్పటికే డీలా పడింది. టీడీపీ నాయకులు, శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతింది. ఎవరూ కిమ్మనకుండా.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామన్న నమ్మకం కాంగ్రెస్ నాయకుల్లో కొరవడింది.
 
 ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
 లోక్‌సభ, శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. 16వ తేదీన ఉదయం 6 గంటలకే ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం వద్దకు రావాలన్నారు. పాస్‌లు పొందిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. లోపలికి వెళ్లిన ఏజెంట్లు బయటకు వస్తే మళ్లీ తిరిగి లోపలికి అనుమతించబోమన్నారు. ఐదు కేంద్రాల్లో చేపట్టే లెక్కింపు కార్యక్రమంలో 1512 మంది సిబ్బంది పని చేస్తారని చెప్పారు. మొత్తం 14 నుంచి 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రారంభమవుతుందని.. దాదాపు 12 గంటలలోపు అన్ని ఫలితాలు వెల్లడవుతాయన్నారు. ఒక్కో రౌండ్ 15 నిమషాల్లోపు పూర్తవుతుందని, ఆదోని లేదా శ్రీశైలం, మంత్రాలయం నియోజకవర్గాలకు సంబంధించి మొదటి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అత్యధిక పోలింగ్ కేంద్రాలు ఉన్న పాణ్యం నియోజకవర్గం ఫలితం వెలువడే సరికి కొంత ఆలస్యం కావచ్చని పేర్కొన్నారు.  
 
 కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యధికంగా అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఫలితం కొంత ఆలస్యం కానుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వేర్వేరుగా మీడియా సెంటర్లు ఉంటాయని చెప్పారు. ప్రతి రౌండులో టేబుల్ వారీగా అభ్యర్థులకు వచ్చిన వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తారని, వీటి జిరాక్స్ కాపీలు రౌండు వారీగా మీడియా సెంటర్లకు పంపుతామని పేర్కొన్నారు.  రౌండ్ల వారీగా ఫలితాలు ఎప్పటికప్పుడు ఎన్నికల వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించేందుకు పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించాలని కోరారు.
 

మరిన్ని వార్తలు