కాంగ్రెస్‌ నేతలపై దాడి.. జ్యోతి పటేల్‌ సంచలన ఆరోపణలు

19 Nov, 2023 10:35 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా 76 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల కాంగ్రెస్‌-బీజేపీ నేతలు బాహాబాహీకి దిగారు. ఇక, తాజాగా బీజేపీ మంత్రి గోపాల్‌ భార్గవపై కాంగ్రెస్‌ అభ్యర్థి జ్యోతి పటేల్‌ సంచలన ఆరోపణలు చేశారు. తన మద్దతుదారుల వాహనాలపై దాడి చేసి వారిని చంపే ప్లాన్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. 

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత పలు చోట్ల ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకుంది. సాగర్‌ జిల్లాలోని గఢకోట్ల వద్ద కాంగ్రెస్‌ మద్దతుదారులపై శుక్రవారం అర్ధరాత్రి దాడి జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ అభ్యర్థి జ్యోతి పటేల్‌ మాట్లాడుతూ..‘బీజేపీ మంత్రి గోపాల్‌ భార్గవ, ఆయన కుమారుడు అభిషేక్‌ భార్గవ కలిసి కాంగ్రెస్‌ నేతలపై దాడులకు పాల్పడ్డారు. నాపై, నా మద్దతుదారులపై దాడులకు వారు ప్లాన్‌ చేశారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ నేతల వాహనాలపై రాళ్లతో దాడులు చేశారు. కాల్పులకు తెగబడ్డారు. బీజేపీ నేతల దాడుల్లో నేను చనిపోయినా, గాయపడినా వారిద్దరే బాధ్యులు’ అంటూ కామెంట్స్‌ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ మద్దతుదారులు దాడులు చేస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

మరోవైపు.. కాంగ్రెస్‌ నేతల వాహనాలపై రాళ్ల దాడులు జరగడంతో హస్తం పార్టీ నేతలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో, బీజేపీ-కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రెండు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఘర్షణ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా  అడిషనల్ ఎస్పీ లోకేష్ సిన్హా స్పందించారు. రెండు పార్టీల నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు