గ్రేట్‌ సునీతా!

20 Oct, 2019 08:39 IST|Sakshi

ఇన్నర్‌వ్యూ సండే స్పెషల్‌

‘‘గాంధీజీ వంటి ఒక వ్యక్తి ఈ భూమండలంపై రక్తమాంసాలతో నడయాడారా.. అని భావితరాల వాళ్లు విస్మయం చెందుతారు’’ అని ఐన్‌స్టీన్‌ అన్నారు. ఇప్పుడు ఇంచుమించు అదే టోన్‌లో సునీతా కృష్ణన్‌ గురించి, బాలీవుడ్‌ నటి అనుష్కా శర్మ గురించి అన్నారు! సునీత స్టోరీ చాలావరకు ప్రపంచానికి తెలుసు. సునీత స్వస్థలం బెంగళూరు. పదిహేనేళ్ల వయసులో ఆమెపై ఎనిమిదిమంది సామూహికంగా లైంగిక దాడి చేశారు. ఆ పీడకల నుంచి తనకు తానుగా బయటపడి, అత్యాచార బాధితుల కోసం; బాలికలు, మహిళల అక్రమ రవాణాను నివారించడం కోసం ఆమె గత ముప్పై ఏళ్లుగా కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 వేల మందికి పైగా బాధితుల్ని కాపాడారు. వారికి పునరావాసం కూడా కల్పించారు. అంతేనా! ప్రభుత్వాలను కదలించి చట్టాలు కచ్చితంగా అమలయ్యేలా ఒత్తిడి తెస్తున్నారు.

తాజాగా ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ ఎపిసోడ్‌లో అమితాబ్‌ బచన్‌ సునీతను ఈ దేశానికి పరిచయం చేశారు. టీవీలో తొలిసారిగా సనీతా కృష్ణన్‌ చూసి, ఆమె చెప్పిన విషయాలు విన్న అనుష్క.. వెంటనే తన ట్విట్టర్‌ అకౌంట్‌లోకి వెళ్లి,  ‘‘ఇలాంటి మనిషి మనమధ్య ఉన్నందుకు మనమంతా ఆమెకు కృతజ్ఞతలు తెలియజెయ్యాలి’’ అని కామెంట్‌ పెట్టారు. సునీతను పరిచయం చేసినందుకు అమితాబ్‌కీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘నాకు చావంటే భయం లేదు. స్త్రీలకు సహాయపడేందుకే నేను నా జీవితాన్ని అంకితం చేశాను’’ అని సునీతా కృష్ణన్‌ అనడం కూడా అనుష్కను ఉత్తేజపరిచినట్లు కనిపిస్తోంది. ‘‘ఘోరమైన జీవిత వాస్తవాల మధ్య ఒక పోరాట యోధురాలు’’ అని కూడా సునీతను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు అనుష్క.
 

మరిన్ని వార్తలు