విహారి గారి వసుధైక కుటుంబం

30 Dec, 2019 00:41 IST|Sakshi

పురస్కారం

విహారి గారి కథలన్నీ చదివాక, ప్రత్యేకంగా ఆయన వ్యక్తిత్వాన్ని పట్టిచ్చే కథేమిటని ప్రశ్నించుకుంటే, అందుకు సమాధానంలా, ‘వలయం’ నాముందు నిటారుగా నిలబడింది. తాను ఎన్నికచేసిన కథల సంపుటికి, ఆ కథనే మొదటి కథగా తీసుకోవడం వెనక, ఆ కథ తన సాహితీ జీవనానికి ముందుమాటగానో, భూమికగానో ఆయన భావించినట్టుగా తోచింది.

కొడుకు జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడల్లా వాడికి తోడ్పడటం తండ్రి బాధ్యత. కొడుకు సమస్యల్ని తండ్రి పరిష్కరించడంలో ఆశ్చర్యమేముంటుంది? ‘వలయం’లోని కథకుడు దూరపు బంధువుల ఇబ్బందులకే గాదు, పరిచితులైన వాళ్ళెవరడిగినా, వాళ్ళకు తోడ్పడటం తన బాధ్యతగా భావిస్తారు. తన సహాయం వల్ల సుఖపడ్డవాళ్ళు, తనపట్ల కృతజ్ఞతల్ని వెల్లడించబోతే, అందులో తాను చేసిన పనేమీ పెద్దదిగాదని నమ్ముతాడు. ఎదుటి మనిషి మనస్సుకు నొప్పి కలగకుండా జాగ్రత్తపడుతూ, అతను అప్పజెప్పిన బాధ్యతను చిరునవ్వుతో, ఆత్మవిమర్శ చేసుకుంటూనే, చేసుకుపోతాడు. ఈ బాధ్యతల వలయం నుంచి ఆ కథకుడు బయటపడాలని ఎప్పుడూ అనుకోడు.

కథకుడుగా విహారి బాధ్యత గుర్తెరిగిన రచయిత అనీ, ఆ కర్తవ్య నిర్వహణ నుంచీ తప్పుకోవడం ఆయనకు అసాధ్యమనీ చెప్పడానికి అయిదు దశాబ్దాల  ఆయన రచనలే పెద్ద సాక్ష్యం. 1970, 80ల మధ్యలో ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రప్రభ, యువ, జ్యోతి వంటి పత్రికల్లో మధ్య తరగతికి చెందిన రచయితలే పుంఖానుపుంఖాలుగా కథలు రాశారు. వాళ్ళందరిలోనూ ఇప్పటి వరకూ ఆపకుండా రాస్తున్న కథకులు విహారిగారొక్కరే! 

కథ చెప్పడంలో ఆయనది ప్రసన్నకథా కవితార్థయుక్తే! స్నేహంగా, ఆర్ద్రంగా, భుజంపైన చెయ్యేసుకుని నడుస్తున్న స్నేహితుడు కథ చెప్తున్నట్టుగా ఉంటాయి ఆయన కథలు. తొలినాటి కథకులందరిలాగే ఆయనది కూడా మౌఖిక ధోరణి. చాలా కథల్లో కథ చెప్పేవ్యక్తి కథలోని పాత్రే అయివుంటాడు. కొన్ని సార్లు ప్రధాన పాత్రగానూ, మరికొన్నిసార్లు చిన్న పాత్రగానూ ఉంటాడు. సర్వసాక్షి కథనం ఉన్న కథల్లో, రచయిత స్వభావం, వ్యక్తిత్వం, కథనంతా తీర్చిదిద్దుతుంది.

అలా ఆయన కథలన్నింటిలోనూ పరుచుకున్న విహారి వ్యక్తిత్వం ‘వలయం’ కథలోని కథకుడి స్వభావానికి దగ్గరగా ఉంటుంది. తన ప్రేమను తన కుటుంబానికి పంచినంత నిబద్ధతతోనే మొత్తం సమాజానికీ పంచుతాడు. మధ్యతరగతి పునాదులపైన విస్తరిల్లిన మన దేశపు సౌభాగ్యానికి, మధ్య తరగతి వాళ్ళ మానవీయ విలువలే ఆధారమని చాటిస్తాడు. మధ్యతరగతిలో ఉండే కుహనా విలువల్ని వదులుకునే మార్గాల కోసం అన్వేషిస్తాడు. విహారిగారి స్వాభావికమైన ఈ జీవన విధానానికి పెరిగిన కొమ్మలూ, ఆకులూ, పువ్వులూ, పళ్లే ఆయన రచనలు.

విహారి కథా ప్రపంచంలోకి అడుగుపెట్టడమంటే అది సమకాలీన సమాజపు కోణాలన్నింటినీ పరామర్శించడమే. కథకుడుగా ఆయన చాలా అప్రమత్తంగా ఉంటాడు. తన తరువాతి తరాలనూ సానుభూతితో అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తాడు. అధో జగత్‌ సోదరులనూ, కింది మధ్య తరగతి వాళ్లనూ ‘డబ్బు’ ఎంతగా వేధిస్తుందో ఆయనకు బాగా తెలుసు. మధ్య తరగతి మనుషుల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్న వ్యాపార సంబంధాల్ని నిరసిస్తున్న కథల్లో గూడా ఆయన మానవ సంబంధాల మాధుర్యాన్ని నొక్కి చెప్పడం మరిచిపోరు.

ఎదిగిన కూతుర్ని రాబందుల బారి నుంచీ తప్పించడం కోసం నానా బాధలు పడే తల్లులూ, పుస్తకాన్ని కొనగలిగే అయిదు రూపాయల కోసం ప్రమాదకరమైన పందెపు బరిలో దిగే కుర్రాళ్ళూ, బతుకు బరువు మోయడానికి ఇష్టంలేని పాతరోత పనులలోనే ముడుచుకుపోవడానికి సిద్ధపడే నిర్భాగ్యులూ, కూతుళ్ళకు పెళ్ళి చేయాల్సిన వయస్సులో గూడా నిస్సిగ్గుగా బిడ్డల్ని కనే తండ్రులూ, ఈ మధ్య తరగతి విలాపాలూ, విలాసాలూ విహారి సాహిత్య ప్రపంచంలో మనకెదురౌతారు. విహారి గారికి ధర్మాగ్రహం. పీడనలోంచి పీడనే పుడుతుందని ఆయన హెచ్చరిస్తారు. సమాజంలో ఇంత దుర్మార్గముండడానికున్న కారణాలను ఆయన కథలన్నీ తరచి చూస్తాయి. ఈ లోకాన్ని మరింత అందంగా తయారుచేయడమెలాగో సూచిస్తాయి.
-మధురాంతకం నరేంద్ర

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు