సాహిత్య దర్జీలు

30 Dec, 2019 00:35 IST|Sakshi

సాహిత్య మరమరాలు

బీ.ఏ.సుబ్బారావు దర్శకత్వం వహించి నిర్మించిన ‘భీష్మ’ చలనచిత్రం 1962లో విడుదలైంది. ఆ సినిమాకు మాటలను తాపీ ధర్మారావు, పాటలను ఆరుద్ర రచించారు. తాపీవారిని ఆరుద్ర గురుభావంతో గౌరవిస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఒకరోజున కుంతీ– కర్ణ సంవాదం షూటింగ్‌ మొదలు కాబోతూ ఉన్నది. జి.వరలక్ష్మి – కుంతి. గుమ్మడి వేంకటేశ్వరరావు –  కర్ణుడు. సెట్‌లో తాపీవారు లేరు. ఏదో పని మీద బయటకు వెళ్లారు. ఆరుద్ర ఉన్నారు. వరలక్ష్మి డైలాగ్‌ పేపరును చూసి ‘డైలాగ్‌ పెద్దదైంది. తగ్గిస్తే బాగుంటుంది’ అన్నారు. ఆరుద్ర ‘వీల్లేదండి. అది తాపీవారి స్క్రిప్టు. దానికి తిరుగు లేదు’ అన్నారు.

‘తగ్గించవలసిందే’ అని ఆవిడ. ‘వీలు లేదు’ అని ఈయన. ఇంతలో తాపీవారు వచ్చారు. విషయాన్ని తెలుసుకొన్నారు. ఆరుద్రను ఇవతలకు పిలిచారు. ‘నాయనా! దర్జీ ఏమి చేస్తాడు? చొక్కా వదులైతే బిర్రు చేస్తాడు. బిర్రయితే వదులు చేస్తాడు కదా! మనం సాహిత్య దర్జీలం. అవతలివారు డైలాగు పెద్దదైందంటే రెండు వాక్యాలు తీసివేసి చిన్నదిగా చేస్తాం. చిన్నదైందంటే రెండు వాక్యాలు కలిపి పెద్దదిగా చేస్తాం. వరలక్ష్మిగారు గొప్పనటి. వారి మాటను మనం కాదనట మెందుకు? డైలాగును తగ్గించు’ అన్నారు. ఆరుద్ర ‘సరే!’ అన్నారు.
-డాక్టర్‌ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి

మరిన్ని వార్తలు