అక్షయ

18 Apr, 2018 00:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెట్టు నీడ

చిన్నారులు, బాలికలు, మహిళలపై మునుపెన్నడూ లేనంత‘అక్షయం’గా అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి క్షయం అయిపోవాలి. వారి  రక్షణ అక్షయం కావాలి.

ఇవాళ అక్షయ తృతీయ! ఈ అక్షయ తృతీయ తిథి తెల్లవారుజామున 3.45కి మొదలైంది. రేపు రాత్రి 1.29కి ముగుస్తుంది. అక్షయ తృతీయ నాడు ఏదైనా తలపెడితే లాభం, శుభం అంటారు పండితులు. చాలా పవిత్రమైన రోజు. శక్తిమంతమైన రోజు. కుబేరుడు పోగొట్టుకున్న సంపదంతా ఇదే రోజున మళ్లీ ఆయన్ని చేరింది. శ్రీకృష్ణపరమాత్ముడు ఇదే రోజున కుచేలునికి సమృద్ధిగా ధనప్రాప్తిని కలిగించాడు. అన్నపూర్ణమ్మ పుట్టింది ఇవాళే. వేదవ్యాసుడు భారతాన్ని రాయడం ప్రారంభించిందీ ఈ రోజునే. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కనుకనే శుభ సంకల్పానికి అక్షయ తృతీయ తిరుగులేదని భారతీయుల భావన. అక్షయం అంటే ఎన్నటికీ తరిగిపోనిది. ఎప్పటికీ పొంగిపొర్లుతూ ఉండేది.
 

ధనం అక్షయం అయితే సంపన్నం. ధాన్యం అక్షయం అయితే సుభిక్షం. కనకం అక్షయం అయితే మహాభాగ్యం. మంచితనం అక్షయం అయితే అభయం. మానవత్వం అక్షయం అయితే దైవత్వం. ఇవన్నీ అక్షయంగా ఉండేందుకే అక్షయ తృతీయ రోజు మనం చేసే లక్ష్మీపూజ. అయితే మంచి మాత్రమే సమాజంలో అక్షయంగా ఉండాలి. మంచిది కానిది అక్షయంగా ఉండిపోడానికి లేదు. చిన్నారులు, బాలికలు, మహిళలపై మునుపెన్నడూ లేనంత ‘అక్షయం’గా అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి క్షయం అయిపోవాలి. వారి రక్షణ అక్షయం కావాలి. లక్షీదేవికి ప్రతిరూపాలైన స్త్రీల రక్షణకు గట్టి సంకల్పం చెప్పుకోడానికి కూడా అక్షయ తృతీయను తగిన సందర్భంగా భావించడం ఒక మంచి ఆలోచన.  

మరిన్ని వార్తలు