తోకచుక్క

24 May, 2016 22:45 IST|Sakshi
తోకచుక్క

అమ్మ ముద్ద.. నాన్న ముద్దలా... ఈ అమ్మాయికి తాత చుక్క, అవ్వ చుక్క అలవాటైంది! తెలివైన అమ్మాయి. బ్రైట్ స్టార్. ఏం చెప్పినా ఇట్టే చేసేస్తుంది. రెండు సీసాల కల్లు తెమ్మన్నా... రయ్యిన వెళ్లి రివ్వున వస్తుంది. అలా.. వస్తూ వస్తూ.. తెస్తూ తెస్తూ.. కల్లుకు బానిస అయింది. చాలా విచిత్రంగా ఉంది కదూ! ఈ వార్త చదువుతూ మేమూ అలాగే అనుకున్నాం. కానీ, మీకు చెప్పకపోతే మన ఇళ్లల్లో కూడా అనర్థం జరుగుతుందేమోనన్న భయం కలిగింది. అందుకే ఈ కథనం.మన పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం.పాసివ్ స్మోకింగ్  వల్ల పిల్లల ఆరోగ్యంపాడవుతుందని తెలుసు. మన ప్రవర్తన వల్ల కూడా పిల్లలపై.. దుష్ర్పభావం పడుతుందని తెలుసుకోవాలి. మనం ఇచ్చే స్వేచ్ఛను పిల్లలు ఎలా వాడుకుంటున్నారో తెలుసుకోకపోవడం కూడా కరెక్ట్ కాదు. మన పిల్లలకు మనం అన్నీ ఇస్తాం.. రైజింగ్ స్టార్‌లు కావాలని.  తోకచుక్కలు కావాలని కాదు.

 

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా... పరిగిమండలం.. గొల్లపల్లి.  ఓ అమ్మాయి.. వీధుల్లో పరిగెడుతోంది. స్కూటర్.. బైక్.. ఆటో.. ఏది వెళ్తున్నా దానికి అడ్డంగా వెళ్లి వాటిని ఆపుతోంది. ‘అన్నా... ఆకలి.. ఒక పాతిక రూపాయలివ్వవా?’ అంటూ చేయి చాస్తోంది. ‘లేవ్’ అని సమాధానమొస్తే.. పాతికనుంచి క్రమంగా అయిదు రూపాయల వరకు తగ్గించుకొని కాళ్లావేళ్లా పడుతోంది. మొత్తానికి ఎంతో కొంత డబ్బు తీసుకోందే వాళ్లను కదలనివ్వడంలేదు.

 
అలా ఆ డబ్బు కొంత పోగవగానే హిందుపురం బస్ ఎక్కింది. అక్కడ బస్టాండ్‌లో దిగి, దగ్గర్లో ఉన్న మద్యం దుకాణానికి వెళ్లింది. చవకబారు మందు కొనుక్కొని బాటిల్ మూత తీసి మంచినీళ్లు తాగినట్లు గటగటా తాగేసి సీసాను అవతల పారేసి తూలుతూ తూగుతూ మళ్లీ ఇంకో వాహనం ఆపడానికి పరిగెత్తింది. రోడ్డు మీద ఈ అమ్మాయిని చూసి ఆమె గురించి వాకబుచేసి ఓ ఆటోను మాట్లాడి అందులో కూర్చోబెట్టి గొల్లపల్లికి పంపించారు అక్కడివారు. అలా ఇంటికొచ్చిన పిల్లను ఆమె తల్లిదండ్రులు ఇనుపసంకెళ్లతో బంధించి ఇంటికి తాళం వేసి పనుల్లోకి వెళ్లిపోయారు! ఇది తరచు జరిగే తంతు.

  

ఆ అమ్మాయి పేరు అమరావతి. వయసు పధ్నాలుగేళ్లు! ఆ పిల్ల ఇలా ఎందుకైంది? అని వాళ్ల నాన్న నాగరాజును అడిగితే తన ఆవేదనను కన్నీటితో వెళ్లగక్కాడు. అమరావతి.. ఆ తల్లిదండ్రులకు ఏకైక బిడ్డ. తండ్రి పేరు నాగరాజు. నిరుపేద. ఆయన, ఆయన భార్య కూలి చేస్తే కానీ ఆ కుటుంబానికి తిండి దొరకదు. కూలికి వెళ్లాలంటే అమరావతిని ఒంటరిగా వదిలివెళ్లలేని పరిస్థితి. అందుకే అలా ఇనుపసంకెళ్లతో ఇంట్లో బంధించి పనికి వెళ్తారు. వాళ్లు అటు వెళ్లగానే ఇటు ఈ అమ్మాయి పెద్ద పెద్ద అరుపులు, కేకలతో చుట్టుపక్కలవాళ్ల దృష్టి ఆ ఇంటిమీదకు మళ్లేలా చేస్తుంది. దగ్గరకు వచ్చిన వాళ్లతో బాత్రూమ్‌కు వెళ్లాలనో లేక కడుపునొప్పనో .. ఇంకోటనో.. ఇంకోటనో సాకులు చెప్పి మొత్తానికి వాళ్లు ఆ సంకెళ్లు విప్పేలా చేస్తుంది. విప్పగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా రివ్వున రోడ్డుమీదకు పరిగెత్తి.. వస్తున్న వాహనాలను అడ్డగించి  వారిని డబ్బులు అడగడం మొదలుపెడ్తుంది. ‘ఏంచేయాలో.. ఈ పిల్ల చేత తాగుడు ఎలా మాన్పించాలో.. ఎలా కట్టడిచేయాలో అర్థంకావట్లేదు’ అంటూ బాధపడ్డాడు నాగరాజు.

 
ఎలా అలవాటైంది?

ముందునుంచీ నాగరాజు దంపతులకు కూలే ఆధారం. అందుకే తమ చంటిబిడ్డను తన తల్లిదండ్రుల దగ్గర పెట్టాడు నాగరాజు. అక్కడే పెరిగింది. అవ్వ, తాతయ్యలకు మద్యం అలవాటు. అమరావతికి కొంచెం ఊహరాగానే ఆ పిల్లచేతే మద్యం తెప్పించుకోవడం మొదలుపెట్టారు. అలా అవ్వ, తాతలకు మద్యం తెస్తూ తెస్తూ ఒకరోజు తనకూ మద్యం రుచి చూడాలనిపించింది. దొంగచాటుగా సీసా మూత తీసి గుక్కెడు మందు తాగింది. ఆ తాగడం క్రమంగా అలవాటుగా మారింది. ఆ అలవాటు వ్యసనమైంది. పధ్నాలుగేళ్లు వచ్చేసరికి ఇదిగో అలా తయారైంది అమరావతి.

 

అంతకుముందు...
మద్యానికి పూర్తిగా బానిసకాక ముందు అమరావతి చక్కగా స్కూల్‌కి వెళ్లేది. ఎనిమిదవ తరగతి వరకు చదివింది. చురుకైన విద్యార్థి కాకపోయినా... ఓ మోస్తరుగా ఉండేది. ప్రతిరోజూ దినపత్రికలు చదివేది. ఇంటికి వచ్చిన అతిథులను సాదరంగా ఆహ్వానించేది. చక్కగా పలకరించేది. ఇప్పుడు? పరిస్థితి పూర్తిగా భిన్నం! ఇంటికి వచ్చిన వాళ్లను కూడా డబ్బులు అడుగుతోంది. మందుతోపాటు పాన్, వక్కపొడి, పొగాకు కూడా అలవాటైంది. ఓ వైపు మందు, ఇంకో వైపు ఇవి తింటూ మత్తులో తూలుతూ ఉంటుంది. అమరావతి చేత తాగుడు మాన్పించడానికి నాగరాజు దంపతులు చేయని ప్రయత్నంలేదు. చివరకు నాగరాజు తమ్ముడు అమరావతిని బెంగుళూరులోని డీ అడిక్షన్ సెంటర్‌లో చేర్పించాడు. అక్కడికి వెళ్లాక ఓ రెండు రోజులుగా ఆ అమ్మాయి తాగకుండా ... మామూలుగా ఉండడంతో జబ్బులేదని నిర్ధారించి ఇంటికి పంపించేశారు. కానీ వచ్చాక పరిస్థితి మళ్లీ ఎప్పటిలాగే ఉంది. - రాజేశ్, సాక్షి, హిందూపురం అర్బన్

 

మామూలు మనిషిని చేస్తే అదే పదివేలు
మాకున్నదే ఒక్కతే కూతురు. కూలీ చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి మాది. అమరావతికి మంచి వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేని వాళ్లం. పిల్లనేమో రోజురోజుకి మందుకోసం పిచ్చిదానిలా అవుతోంది. ఏం చేయాలో తెలియట్లేదు. దాతలు. అధికారులు మా మీద దయుంచి మా పిల్లకు వైద్యంతోపాటు చదువుచెప్పించి కాపాడాలని కోరుతున్నాం. మా బిడ్డను ఈ ఊరికి దూరంగా ఉన్న హాస్టల్లో ఉంచి విద్యాబుద్ధులు నేర్పించే వాళ్లొస్తే అంతకన్నా మాకు కావల్సిందేముంది? వాళ్లకు జన్మజన్మలకు రుణపడి ఉంటాం. ఇప్పటికే చేయిదాటి పోయింది.. ఇట్లాగే వదిలేస్తే పిల్ల జీవితం ఏమైపోతుందో అనే బెంగతోనే  సగం చచ్చిపోతున్నాం!  - నాగరాజు, అమరావతి తండ్రి

 

బిహార్‌ను  ఆదర్శంగా తీసుకోవాలి
మద్యం ప్రవాహం ఆగితే ఎన్ని జీవితాలు.. ఇంకెన్ని కుటుంబాలు బాగుపడ్తాయో అన్నదానికి బిహార్‌లో జరుగుతున్న ఆరోగ్యకరమైన మార్పే మంచి ఉదాహరణ! మద్యం మత్తులో ఇల్లు, వాకిలి, భార్యాపిల్లల్ని వదిలివెళ్లిన ఓ భర్త.. దాదాపు పన్నెండేళ్ల తర్వాత  ఆ మత్తు వదిలించుకొని భార్యాపిల్లల్ని గుర్తుకు తెచ్చుకొని దాదాపు మళ్లీ ఇంటికి చేరాడు. కుటుంబ సభ్యులకు సంభ్రమాశ్చర్యాలను పంచాడు! ఇది మద్య నిషేధం వల్ల కలిగిన శుభపరిణామం! ప్రస్తుతం బిహార్ ప్రజలు ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తుంటే.. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మద్యంమాయలో తమ జీవితాలనే కాదు పిల్లల జీవితాలనూ నాశనం చేస్తున్నారు! దీనికి ఉదాహరణ.. అనంతపూర్‌జిల్లాలోని  ఈ సంఘటనే! అమరావతి అనే ఈ అమ్మాయి దుస్థితికి కారణమైన ఆమె అవ్వ, తాతలు పశ్చాత్తాప పడ్డారో లేదో తెలియదు కాని ప్రభుత్వాలు మాత్రం ఆలోచనలో పడాలి. ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించే బాధ్యతను తీసుకోవాలి!

 

మరిన్ని వార్తలు