పెళ్లై ఐదేళ్లయినా ఇంకా సంతానం లేదు తగిన సలహా ఇవ్వండి!

20 Jul, 2015 00:55 IST|Sakshi

ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
నా వయసు 23. నాకు పెళ్లయి ఐదేళ్లు అవుతోంది. ఇంకా సంతానం కలగలేదు. మాకు సంతానం పొందే అవకాశం ఉందా? సంతానం కలగడానికి ఉన్న వివిధ మార్గాలు చెప్పండి.
- ఒక సోదరి, హైదరాబాద్


ఇప్పుడు సంతానం పొందడానికి చాలా రకాల చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అయితే లోపం ఎవరిలో ఉందో తెలుసుకోడానికి చేయించాల్సిన వివిధ పరీక్షలు చేయించారో లేదో రాయలేదు. లోపం ఎలాంటిదైనా, ఎవరిలో ఉన్నా దాన్ని అధిగమించడానికి ఇప్పుడు ఆధునిక వైద్యశాస్త్రంలో అనేక మార్గాలున్నాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వంటి చాలా చిన్న చిన్న సమస్యలు కూడా సంతానలేమికి కారణం కావచ్చు. ఇక తీవ్రమైన సమస్యలూ, ఆటంకాలూ, అవరోధాలూ ఉన్నా సంతానలేమి ఈ రోజుల్లో ఒక సమస్య కాదు. వాటికోసమూ తగిన చికిత్స ప్రక్రియలు ఉన్నాయి. మహిళల్లో అండం ఉత్పత్తి మొదటి సమస్య.

ఏదైనా కారణాల వల్ల అండం సరిగా ఉత్పత్తి కానివారికి అండోత్పత్తికి తగిన చికిత్సలు ఉన్నాయి. అండం వరకు శుక్రకణాలును తీసుకెళ్లే ఫెలోపియన్ ట్యూబ్స్‌లో ఏవైనా అడ్డంకులు ఉన్నా, నీటి తిత్తులు (ఒవేరియన్ సిస్ట్స్)  ఉన్నా  వాటిని తొలగించడానికీ శస్త్రచికిత్సలున్నాయి. ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలకూ, గర్భాశయంలో అదనపు కండ పెరగడం (పాలిప్స్) ఉన్నా  ఇవి మహిళల్లో గర్భధారణకు అడ్డంకులవుతాయి. ఇక పురుషుల్లో సివియర్ గ్రేడ్ వేరికోస్ వెయిన్స్, బ్లాక్స్ వంటి సమస్య కూడా గర్భధారణకు అవరోధమే. ఈ సమస్యలన్నింటినీ తగిన శస్త్రచికిత్సల ద్వారా సరిదిద్ది, గర్భధారణకు ఎలాంటి అవరోధమూ లేకుండా చేయవచ్చు. ఒకవేళ కొందరిలో ఎలాంటి అవరోధమూ, ఆటంకాలూ లేకపోయినా సరే... ఏవో తెలియని కారణాల వల్ల గర్భధారణ జరగకపోవచ్చు. అలాంటివారిలోనూ అనేక ఆధునిక ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఇంట్రాయుటెరైన్ ఇన్‌సెమినేషన్ (ఐయూఐ), ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్), ఐసీఎస్‌ఐ (ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్... వంటి అనేక ప్రక్రియల ద్వారా గర్భధారణ జరిగేలా చూడవచ్చు. గర్భధారణ జరగడానికి ఈ కింది అంశాలు అవరోధమవుతాయి. కాబట్టి వాటిని సాధ్యమైనంతవరకు నివారించండి.  వయసు పెరుగుతున్న కొద్దీ గర్భధారణ రిస్క్ అవుతుంది. కాబట్టి త్వరగా చేసుకోండి. ఇటీవల కొందరు మహిళలు తమ కెరియర్ కోసం గర్భధారణను వాయిదా వేసుకుంటున్నారు. కెరియర్‌నూ, గర్భధారణనూ సరిగా ప్లాన్ చేసుకోండి.   స్థూలకాయంతో ఉండటం గర్భధారణకు కొంత అవరోధం. మీ బరువును తగ్గించుకోండి. ఉండాల్సిన బరువు మాత్రమే ఉండేలా చూసుకోండి.  ఒత్తిడిని పూర్తిగా నివారించుకోండి. ఒత్తిడి గర్భధారణకు అడ్డుపడటమే కాకుండా, ఒక్కోసారి గర్భస్రావానికీ దారి తీయవచ్చు. అందుకే ఒత్తిడి నుంచి పూర్తిగా దూరంగా ఉండండి.  మీకు పెళ్లయి ఐదేళ్లు నిండాయంటున్నారు కాబట్టి సంతానసాఫల్యం కోసం డాక్టర్‌ను కలిసి, తగిన చికిత్స తీసుకోండి.
 
డాక్టర్ కె. సరోజ
సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్,
నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్,
రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు