రే బ్రాడ్బరీ

18 Jun, 2018 00:48 IST|Sakshi

గ్రేట్‌ రైటర్‌

ఏడవడానికి గనక నీకు సమ్మతి లేకపోతే జీవితాన్ని సంపూర్ణంగా జీవించలేవు, అంటాడు రే బ్రాడ్బరీ. ఇంగ్లిష్‌ మూలాలున్న తండ్రికీ, స్వీడన్‌ మూలాలున్న తల్లికీ జన్మించిన అమెరికన్‌ రచయిత బ్రాడ్బరీ (1920–2012). చిన్నప్పటినుంచీ బాగా చదివేవాడు. బొమ్మలు వేసేవాడు. మేజిక్‌ మీద కూడా ఆసక్తి ఉండేది. భవిష్యత్తులో ఏదో ఒక కళలోకి ప్రవేశిస్తానని అతడికి ‘ముందే తెలుసు’. పన్నెండేళ్లప్పుడే ఎడ్గార్‌ అలెన్‌ పోను అనుకరిస్తూ హారర్‌ కథలు రాశాడు. కౌమార దశలోనే సైన్స్‌ పిక్షన్‌ రచయితల సమగ్ర సాహిత్యం చదివాడు. కాలేజీలు, యూనివర్సిటీల మీద ఆయనకు విశ్వాసం లేదు. తనను లైబ్రరీలు పెద్ద చేశాయంటాడు. వారంలో మూడు రోజులు లైబ్రరీకి వెళ్లి కూర్చునేవాడు. ఇరవై నాలుగేళ్ల కల్లా పూర్తి స్థాయి రచయితగా స్థిరపడ్డాడు. సైన్స్‌ ఫిక్షన్‌ సాహిత్యాన్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చిన రచయితగా తర్వాత పేరు తెచ్చుకున్నాడు. తనను తాను సైన్స్‌ ఫిక్షన్‌ రచయితగా చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఫాంటసీ, హారర్, మిస్టరీ జాన్రల్లో కూడా అంతే ప్రతిభ కనబరిచాడు. ‘ఫారెన్‌హీట్‌ 451’ నవల, ‘ద మార్షియన్‌ క్రానికల్స్‌’, ‘ది ఇలస్ట్రేటెడ్‌ మేన్‌’, ‘ఐ సింగ్‌ ద బాడీ ఎలెక్ట్రిక్‌’ కథా సంకలనాలు వెలువరించాడు. సినిమాలకు రచయితగా పనిచేశాడు. ఆయన రచనలు సినిమా, టీవీ తెరలకెక్కాయి.
 

మరిన్ని వార్తలు