నువ్వు నా కుటుంబం

17 Dec, 2018 00:05 IST|Sakshi

కొత్త బంగారం 

2011. పదిహేడేళ్ల మోలీ, అమెరికా– మయామిలో, పెంపుడు తల్లిదండ్రులైన డీనా, రాల్ఫ్‌తో ఉంటుంది. తన తొమ్మిదేళ్ళప్పటినుంచీ, పన్నెండు పెంపుడు ఇళ్ళు మారిన పిల్ల ఆమె.

91 ఏళ్ళ వివియన్‌ ధనికురాలు. మోలీకి స్కూల్‌ ప్రాజెక్ట్‌ కోసం తన సహాయం కావాలని తప్ప మిగతా వివరాలేవీ ఆమెకు తెలియవు. ఇంటి అటక మీద, ట్రంకు పెట్టెల్లో ఉన్న తన జ్ఞాపకార్థమైన సామాను సర్దమని మోలీకి చెబుతుంది.

మోలీ 8వ పుట్టినరోజు తరువాతే తండ్రి కారు ప్రమాదంలో చనిపోతాడు. తల్లి ఆ మరణాన్ని తట్టుకోలేక– డ్రగ్స్, మద్యానికి అలవాటు పడుతుంది. మోలీ పెంపుడిళ్ళల్లో ఉండటం మొదలయ్యేది అప్పుడే. ‘ఇతరులు జీవితాంతం భయపడే మోసం, హృదయ విచ్ఛేదనం గురించి నేను ఎప్పుడో నేర్చుకున్నాను. అయినా– నేనింకా ఊపిరి తీస్తూ, నిద్రపోతూ, పొడుగవుతున్నాను’ అంటుంది మోలీ. 

ఒకసారి పోట్లాటయినప్పుడు, మోలీని ఇంట్లోంచి పొమ్మంటుంది డీనా. అప్పటికే వివియన్‌ మీద నమ్మకం ఏర్పడిన మోలీ, తన వివరాలు చెబుతుంది. వివియన్‌ విస్మయపడినప్పటికీ, మోలీతో తనకున్న సారూప్యతను గుర్తించి, ఆమెను తనింట్లోనే ఉండనిస్తుంది. ఇద్దరూ పెంపుడు ఇళ్ళల్లో పెరిగినవారే. 

వివియన్‌ కథ 1929లో మొదలవుతుంది. న్యూయార్కులో, ఒక రాత్రి అగ్నిప్రమాదంలో ఆమె పూర్తి కుటుంబం మరణిస్తుంది. అప్పటి ఆమె పేరు ‘నీమ్‌’. ప్రభుత్వం ఆమెను వందలాది పిల్లలతో సహా ‘ఆర్ఫన్‌ ట్రైన్‌’లో మధ్య పశ్చిమ రాష్ట్రాలకి పంపుతుంది. ఆ కాలంలో, అది పిల్లల్ని పెంచుకునే కుటుంబాలను వెతికే రైలు వ్యవస్థే అయినప్పటికీ– ప్రభుత్వం నుండి డబ్బు పుచ్చుకుంటూ కూడా, పెంపుడు తల్లిదండ్రులు అనాథలను పనిపిల్లలుగా వాడుకునేవారు. ‘మమ్మల్ని తెలియని చోటుకి తీసుకెళ్ళారు. నిశ్శబ్దంగా ప్రయాణించడం తప్ప మేము చేయగలిగినదేదీ లేదు’ అంటుంది వివియన్‌. అక్కడ టీనేజర్‌ అయిన డచ్ఛీ కనిపిస్తాడు. ఇద్దరూ ఒకరికొకరు అందుబాటులో ఉంటామన్న ఒప్పందం చేసుకుంటారు. 

నీమ్, పెంపుడు కుటుంబాలు మారుతూ నీయల్సన్‌ కుటుంబానికి చేరినపుడు, వారామె పేరు మార్చి, వివియన్‌ అన్న తమ చనిపోయిన కూతురి పేరు పెట్టి, దత్తత చేసుకుంటారు. పెద్దయ్యాక, ఒక రాత్రి యాదృచ్ఛికంగా డచ్ఛీ కనబడినప్పుడు, వివియన్‌ అతన్ని పెళ్ళి చేసుకుంటుంది. అతను రెండవ ప్రపంచ యుద్ధంలో మరణిస్తాడు. వివియన్‌ తనకు పుట్టిన కూతుర్ని దత్తతకిచ్చేసి, మరిచిపోతుంది. డచ్ఛీ స్నేహితుడైన జిమ్‌ను పెళ్ళి చేసుకుంటుంది. ఇద్దరూ ఒక దుకాణం నడుపుతూ డబ్బు గడిస్తారు. జిమ్‌ కూడా చనిపోతాడు.

వివియన్‌ కథ విన్న మోలీ, ‘అయితే, జరిగే ప్రతీ సంఘటనకీ ఒక కారణం ఉంటుందని నమ్మడం మానవ స్వభావమా! చెడు అనుభవాలకి కూడా ఏదో అర్థం ఉంటుందా?’ అని అడుగుతుంది. ‘చేజిక్కనివీ, అశాశ్వతమైనవీ అయినప్పటికీ, ప్రహేళిక ముక్కలని కలిపితేనే కానీ శాంతి ఉండదు’ అన్న మోలీ సలహా పాటించి, వివియన్‌ తన కూతురు ఎక్కడుందో కనుక్కుంటుంది. ఆమె మయామి వచ్చే ఏర్పాట్లు చేస్తారిద్దరూ.

లోకంలో ఒంటరిగా ఉండటం అంటే ఏమిటో అన్న ఒకే అవగాహన ద్వారా స్నేహం పెంచుకుంటారు వాళ్లు. జీవితపు కష్టాలు విజయాలుగా ఎలా మారగలవో మోలీ నేర్చుకుంటుంది. తను వదులుకున్న కూతురితో సంబంధం ఏర్పరచుకునే ధైర్యాన్ని వివియన్‌ సమకూర్చుకుంటుంది. ఇంత నిరాశాజనకంగా అనిపించే పుస్తకంలో విషాదం కనబడదు. క్రిస్టీనా బేకర్‌ క్లైన్‌ రాసిన యీ పుస్తకంలో ఆర్ఫన్‌ ట్రైన్‌ యుగపు ప్రాచీన ఫొటోలుంటాయి. నవలను ‘విలియమ్‌ మోరో’ 2013లో ప్రచురించింది.
కృష్ణ వేణి

మరిన్ని వార్తలు