ఈ మహిళ బిల్‌ గేట్స్‌ చేత కన్నీరు పెట్టించింది..

1 Dec, 2018 18:42 IST|Sakshi

నిశబ్దంగా ఉన్న ఆ గదిలో ఓ విదేశీ జంటకు ఎదురుగా కొం‍దరు మహిళలు కింద కూర్చున్నారు. వారిలో ఓ మహిళ మాట్లాడటం ప్రారంభించింది. ‘ఒంటరిదాన్ని.. నాకో కూతురు. తనను పోషించాలి. తనకు మంచి జీవితం ఇవ్వాలి.. గొప్ప చదువులు  చదివించాలి. వీటన్నింటిని ఎలా నెరవేర్చాలి.. నాకు చదువు లేదు.. పది ఇళ్లలో పాచి పని చేస్తే.. నాకు వచ్చే మొత్తం చాలా తక్కువ. దొంగతనాలు, దోపిడీలు నాకు చేతకావు. కానీ కళ్ల ముందు నా కూతురి ఉజ్వల భవిష్యత్ నాకు కనిపిస్తోంది. అది నిజమవ్వాలంటే నాకు డబ్బు కావాలి. అలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి.. ఓ మార్గం కనిపించింది. తప్పని తెలుసు.. కానీ తప్పదు. నాకు బురదంటుకున్న పర్వాలేదు.. నా కూతురి జీవితం వికసించాలి. అంతే.. ఆ ముళ్ల బాటలోనే నడవడం ప్రారంభించాను. నా కూతురి కోసం నా శరీరాన్ని అమ్ముకుంటున్నాను’.

‘కానీ మనసులో ఓ భయం. ఈ విషయం నా కూతురికి తెలిసిన రోజు నా పరిస్థితి ఎలా ఉంటుంది. ఈ ఊహ కూడా నాకు చాలా భయంకరంగా తోచేది. అలా భయపడుతూనే.. నా కూతురికి తెలియకుండా జాగ్రత్త పడుతూనే.. ఈ వృత్తిలో కొనసాగాను. కానీ ఈ రహస్యాన్ని ఎక్కువ కాలం దాచలేపోయాను. నా కూతురి స్నేహితులకు నేను చేసే పని గురించి తెలిసింది. దాంతో వారు తనను సూటిపోటి మాటాలతో వేధించడం ప్రారంభించారు. హైస్కూల్‌ చదువులు చదువుతున్న నా చిట్టితల్లి.. ఈ పాడు తల్లి మూలంగా ఎదరవుతోన్న అవమానాల్ని తట్టుకోలేకపోయింది. చివరకూ ఓ రోజు ఇంట్లో తన శవాన్ని చూడాల్సి వచ్చింది. నా బంగారు తల్లి ఉన్నతంగా ఎదగాలని ఈ రొంపిలోకి దిగాను. కానీ నేడు నా చిట్టి తల్లి ఎవరికి అందనంత దూరం వెళ్లింది. నాకు ఈ జన్మకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇందుకు నేను ఎవరిని నిందించాలి’ అంటూ విలపిస్తుంది.

ఆ మహిళ కష్టం అక్కడ ఉన్న వారితో కూడా కంటతడి పెట్టించింది. అలా ఏడ్చిన వారిలో ప్రపంచ కుబేరుడు బిల్‌ గేట్స​ కూడా ఉన్నారంటున్నారు అశోక్‌ అలెగ్జాండర్‌. సదరు మహిళల ముందు కూర్చున్న విదేశీ జంట మరేవరో కాదు ప్రపంచ కుబేరుడు బిల్‌ - మిలిందా గేట్స్‌ దంపతులు. గేట్స్‌ ఫౌండేషన్‌ ‘హెచ్ఐవీ / ఎయిడ్స్‌’ ప్రివెన్షన్‌ కోసం ప్రారంభించిన ‘అవహాన్‌’ ప్రోగ్రాం హెడ్‌గా పదేళ్లుగా పని చేస్తున్నారు అశోక్‌. ఈ 10 ఏళ్లలో తాను చూసిన సెక్స్‌ వర్కర్ల గురించి, వారి నేపథ్యాలు, జీవన విధానాల గురించి తెలుపుతూ ‘ఏ స్ట్రేంజ్‌ ట్రూత్‌ : లెసన్స్‌ ఇన్‌ లవ్‌.. లీడర్‌షిప్‌ అండ్‌ కరేజ్‌ ఫ్రమ్‌ ఇండియన్‌ సెక్స్‌ వర్కర్స్‌’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు అశోక్‌. అంతేకాక ఈ ఎయిడ్స్‌ మహమ్మారి నివారణ విషయంలో భారత్‌ ఎలా విజయాన్ని సాధించిందో తెలపడమే కాక బాధితుల జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు గురించి కూడా అశోక్‌ ఈ పుస్తకంలో వివరించారు. ఈ బుక్‌ ఆవిష్కరణ సందర్భంగా ఇందులోని పలు అంశాల గురించి ఆయన మాట్లాడారు.

ఈ క్రమంలో బిల్‌ గేట్స్‌ చేత కంటతడి పెట్టించిన మహిళ దీన గాధను కూడా ఈ పుస్తకంలో పొందు పరిచినట్లు తెలిపారు అశోక్‌. ఆ నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ.. సదరు మహిళ చెప్పినదాన్ని విన్న తర్వాత మిలిందా గేట్‌ అక్కడ ఉన్న మిగతా మహిళలను ఒక ప్రశ్న అడిగింది. ‘ఇందులో ఎంత మంది జీవితాల్లో ఇలాంటి కష్టాలు ఉన్నా‍య’ని ప్రశ్నించింది. దానికి వారు ‘మా అందరివి ఇలాంటి గాధలేనని’ తెలిపారు. అప్పుడు పక్కనే ఉన్న బిల్‌గేట్స్‌ తల కిందకు దించుకుని కన్నీరు పెట్టడం తాను చూశానని అశోక్‌ తెలిపారు. 2000 సంవత్సరంలో బిల్‌ - మిలిందా గేట్స్‌ దంపతులు ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు జరిగింది ఈ సంఘటన.

ఇక అశోక్‌ గురించి వస్తే ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని ‘అవహాన్‌’తో పనిచేయడానికి ముందుకు వచ్చారు. గత పదేళ్లగా దీనికి హెడ్‌గా పనిచేస్తున్నారు. తన పూర్తి జీవితాన్ని వీరి కోసమే కేటాయించాడు. ఈ సమస్య గురించి అశోక్‌ ‘ఇది జీవితాలను పిండి చేసే ప్రదేశం.. ఇక్కడ మహిళలు రూ. 50 కోసం తమను తాము అమ్ముకుంటారు.. ఇక్కడ 14 ఏళ్ల వారికి డ్రగ్స్‌ ఇంజక్షన్‌లు ఇచ్చి బలి పశువులుగా మారుస్తారు. ఇదో చీకటి ప్రపంచం. ఇక్కడ ట్రాన్స్‌జెండర్‌లుగా పుట్టడంం.. గేల మధ్య ప్రేమ మహా పాపం.  మర్చిపోయిన రహదారుల వెంట ప్రయాణం చేసే ట్రక్కుల వింత ప్రపంచం ఇది. ఇవే కాక  గౌరవప్రదమైన జీవితం కోసం నిత్యం యుద్దం జరిగే ప్రదేశం. వారందరికిదే జీవనం.. జీవితం. శరీరం పావుగా మారే వేళ ఇక్కడ ఆత్మ పవిత్రత కోసం పరితపిస్తింటుంది’ అంటూ సెక్స్‌ వర్కర్ల దయనీయ జీవితాల గురించి ఈ పుస్తకంలో చెప్పుకొచ్చారు అశోక్‌.

>
మరిన్ని వార్తలు