అంకుల్‌.. నా పేరెందుకు ‍స్మరిస్తున్నారంటూ రేణు దేశాయ్‌ కామెంట్లు

9 Dec, 2023 12:15 IST|Sakshi

సినీ నటి రేణు దేశాయ్ సుదీర్ఘ విరామం తర్వాత 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రం ద్వారా ఇటీవలే వెండితెరపై కనిపించారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రతో ఆమె మెప్పించారు. చాలాకాలం తర్వాత మళ్లీ మేకప్‌ వేసుకుని  ప్రేక్షకులను పలకరించారు. ఆమె రీ ఎంట్రీతో పాటు మరో పెళ్లి అంశంపై  ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ మధ్య వైరల్‌ అయ్యాయి.  ఆమె వ్యక్తిగత విషయాలపైనా ఆయన చేసిన కామెంట్స్‌ క్లిప్పింగ్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సందించారు రేణు. సమాజంలో మహిళలను తక్కువగా చూడడం తగదని ఆమె సూచించారు.

ఇదే వీడియోను షేర్ చేస్తూ, ఆ జర్నలిస్టును ఉద్దేశించి రేణు దేశాయ్ ఇలా అన్నారు. 'నా పేరు పదే పదే స్మరించి యూట్యూబ్‌లో కొన్ని వ్యూస్‌ సంపాదిస్తున్నారు. ఇలా నా పేరు ద్వారా మీరు డబ్బులు సంపాదించుకుంటున్నందుకు నాకు కూడా సంతోషమే.. కానీ ఇలా కుర్చీలో కూర్చొని సినీ నటులపై నాలుగు గాసిప్స్‌ చెప్పడం కంటే మీ టాలెంట్‌తో డబ్బు సంపాదిస్తే బాగుండేది. మీకు ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. మీ జీవిత అనుభం నేర్పింది ఇదేనా.. ఇలా మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తోంది.

నా పేరును వదిలేసి దైవ నామస్మరణ చేయండి. నేను మిమ్మల్ని ఎక్కడా కలవలేదు. కాబట్టి నా గురించి నీకు ఏం తెలుసు..? మహిళలను దుర్గాదేవిగా, కాళీమాతగా చూడటం మన సాంస్కృతిక ప్రాముఖ్యత అని మరిచిపోవద్దు. మగవారి పేరు, ప్రోత్సాహం లేకుండా మహిళలు ఏం చేయలేరని మీలాంటి వారు మాట్లాడుతుంటారు.' అని రేణు తెలిపింది. ఈ వ్యాఖ్యలు కేవలం తన గురించి మాత్రమే కాదని, సమాజంలో మహిళలపై కొందరు మగవారికి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలిపేందుకే ఈ పోస్ట్‌ చేశానని రేణు దేశాయ్‌ తెలిపారు.

చివరిగా రేణు ఈ వ్యాఖ్యలను కూడా జోడించింది. 'ఈ పోస్ట్‌కి నా మాజీ భర్తకు ఎలాంటి సంబంధం లేదు. ఇది మా కుమార్తెలు, మనవరాలు మంచి భవిష్యత్తు కోసం చర్చను సృష్టించడం కోసం మాత్రమే.' అని తెలిపారు. రేణు దేశాయ్‌ మరో పెళ్లి అంశాన్ని సదరు జర్నలిస్ట్‌ తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా మగవారు అయితే మరో పెళ్లి చేసుకోవచ్చని తెలిపాడు. అదే సమయంలో స్త్రీల గురించి తక్కువగా చేసి మాట్లాడటం ఆమె తప్పుబట్టింది.

A post shared by renu desai (@renuudesai)

>
మరిన్ని వార్తలు