చర్మసౌందర్యం

27 Oct, 2016 22:18 IST|Sakshi
చర్మసౌందర్యం

బ్యూటిప్స్


సౌందర్యాన్ని పెంచడంలో పెదవుల నుంచి పాదాల వరకు అన్నీ తమ పాత్ర పోషిస్తాయి. దేనిని నిర్లక్ష్యం చేసినా ఆ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తూంటుంది. అరగంట సమయం వీటి కోసం కేటాయిస్తే ఆరోగ్యవంతమైన ఆకర్షణీయమైన చర్మం  సొంతమవుతుంది.   పెదవులు మృదువుగా, కాంతిమంతంగా ఉండాలంటే పచ్చికొబ్బరి తురిమి పాలు తీసి పెదవులకు పట్టించాలి. ఇలా రెండు- మూడు వారాలు చేస్తే ఫలితం ఉంటుంది. పొడి చర్మానికి పది టీ స్పూన్ల గోధుమ పిండిలో ఎనిమిదవ వంతు పసుపు, ఒక టీ స్పూను బాదం నూనె, పాలు వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి మాస్కులా వేసుకోవాలి. ఆరిన తర్వాత మెల్లగా చేత్తో రుద్దుతూ తొలగించి గోరువెచ్చటి నీటితో ముఖం కడగాలి. ఈ ప్యాక్‌ను మూడు నాలుగురోజులకొకసారి వేయవచ్చు. ఈ ప్యాక్ వేసిన తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి సబ్బు వాడకూడదు. కావాలనుకుంటే సున్నిపిండి వాడవచ్చు. ఏ ప్యాక్‌లోనయినా, ఏ చర్మతత్త్వానికైనా తేనె కలుపుకుంటే చర్మలావణ్యం పెరుగుతుంది. క్రమం తప్పకుండా తేనె వాడితే స్కిన్‌ఎలర్జీలు రావు.

     
పొడి చర్మానికి మూడు టేబుల్ స్పూన్ల అవొకాడో ఆయిల్, మూడు టేబుల్ స్పూన్ల కెమిలియా ఆయిల్, మూడు టేబుల్ స్పూన్ల ‘ఇ’ విటమిన్ ఆయిల్, రెండు మూడు చుక్కల రోజ్‌హిప్ సీడ్ ఆయిల్, రెండు చుక్కల క్యారట్ సీడ్ ఆయిల్, ఒక చుక్క లావెండర్ ఆయిల్, ఒక చుక్క ఫ్రాకింసెన్స్ ఎసెన్షియల్ ఆయిల్‌లను బాగా కలిపి గాలి చొరని సీసాలో నింపి వెలుతురు లేని చోట నిలవ ఉంచాలి. ఈ మిశ్రమాన్ని రోజూ రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి పట్టిస్తే ముడతలు రావు. ఉన్నప్పటికీ త్వరగా తగ్గుతాయి. పైన చెప్పిన నూనెలన్నీ మార్కెట్‌లో దొరుకుతాయి.

 

మరిన్ని వార్తలు