డౌట్‌ ఉంటే చెప్పేస్తుంది

12 Sep, 2019 00:54 IST|Sakshi

బెస్ట్‌ చెకప్‌

బీపీ సొంతంగా చెక్‌ చేసుకోవచ్చు. సుగర్‌ను కూడా. అలాగే గర్భధారణ జరిగిందీ లేనిదీ తెలిపే ఉపకరణం అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఎవరికి వారు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పరీక్షను చేసుకునే పరికరం కూడా రాబోతోంది!

కొత్తపరికరం
దుర్గాపూర్‌ (కోల్‌కతా)లోని ‘నిట్‌’ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) విద్యార్థులు కనిపెట్టిన ఈ వినూత్న పరికరంలో చెకప్‌ స్ట్రిప్‌ ఉంటుంది.  స్ట్రిప్‌ ధర 150 నుంచి 200 రూపాయల వరకు ఉండే అవకాశాలున్నాయి. వేలినుంచి ఒక రక్తపు చుక్కను తీసి పేపర్‌తో తయారై ఉండే ఆ స్ట్రిప్‌ మీద ఉంచి, దానికి చిన్న చుక్క ‘రీజెంట్‌’ను (పరీక్షక పదార్థం) కలిపి విశ్లేషించినప్పుడు వచ్చే ఫలితాన్ని బట్టి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉన్నదీ, లేనిదీ, భవిష్యత్తులో రాబోయే అవకాశం ఏమైనా ఉందా అన్నదీ తెలిసిపోతుంది. స్త్రీ దేహంలో క్యాన్సర్‌ కారకాలను గుర్తించే ‘హర్‌2’ అనే యాంటిజెన్‌ పరిమాణాన్ని ఈ పరికరం గుర్తిస్తుంది. ఆరోగ్యంగా ఉన్న స్త్రీ దేహంలో ఈ ‘హర్‌2’ మోతాదు 15 నానో గ్రాములు/ఎం.ఎల్‌. కన్నా తక్కువగా ఉంటుంది.

అది కనుక 15 నానో గ్రాముల్ని మించి ఉంటే తక్షణం వెళ్లి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పరీక్షను చేయించుకోవడం అవసరం. కచ్చితమైన ఫలితాలను ఇస్తున్న ఈ పరికరాన్ని ‘నిట్‌’లోని బయోటెక్నాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మోనీదీప ఘోష్‌ నేతృత్వంలో ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులు రూపొందించారు. దుర్గాపూర్‌లోని సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కూడా వీళ్లకు సహకారం అందించింది.పరికరం ఉత్పత్తి వ్యయం పదివేల రూపాయల వరకు ఉండగా, ఎక్కువ సంఖ్యలో మార్కెట్‌లోకి వస్తే కనుక ఒక్కో స్ట్రిప్‌ను 50 రూపాయలకు కూడా అందించే వీలుంటుందని మోనీదీప చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా పదిలక్షల యాభై వేల మందిలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బయపడుతోందని ఆమె తెలిపారు. అన్నట్లు ఆ పరికరానికి ఇంకా పేరు పెట్టలేదు.

మరిన్ని వార్తలు