సినారేకి సినీ ప్రముఖుల నివాళి

12 Jun, 2017 23:59 IST|Sakshi
సినారేకి సినీ ప్రముఖుల నివాళి

నారాయణరెడ్డిగారు చనిపోయారని విని, షాక్‌ అయ్యా. నా భర్త రమణారావుగారు, నారాయణరెడ్డిగారు ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్స్, కొలీగ్స్‌. ఒక విధంగా ఆయనతో మాకు దగ్గరి అనుబంధం ఉంది. కవులలో తెలంగాణలో ఉత్తమోత్తమమైన కవి. మహా జ్ఞాని కూడా. నారాయణరెడ్డిగారి ‘కర్పూర వసంత రాయలు’ ఆయన కవితా ధోరణికి గొప్ప నిదర్శనం. ఆయన తొలి చిత్రం ‘గులేబకావళి కథ’లో నేనే హీరోయిన్‌ కావడం నాకు ఒక మధుర జ్ఞాపకం. సినారేగారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలు చిరంజీవులు.
– జమున, నటి

దాసరిగారు దూరమై ఎన్నో రోజులు కాలేదు. ఇప్పుడు నారాయణరెడ్డిగారు. చాలా బాధగా ఉంది. నా హిట్‌ సాంగ్స్‌లో సినారేగారు రాసిన ‘వస్తాడు నా రాజు ఈరోజు..’ ఒకటి. అప్పట్లో నేను ఎక్కడికెళ్లినా ‘అల్లూరి సీతారామరాజు’లోని ఈ పాట గురించే చాలామంది మాట్లాడేవాళ్లు. నాకూ ఇష్టమైన పాట. నాకోసమే రాసినట్లుగా ఉంటుంది. విశేషం ఏంటంటే.. ఈ  ప్రేమ పాట ఎంత అద్భుతంగా రాశారో.. అన్నాచెల్లెళ్ల అనుబంధం తెలిపే ‘అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి..’ (‘బంగారు గాజులు’) పాటను కూడా అంతే అద్భుతంగా రాశారు. అలాగే, ‘కురుక్షేత్రం’లోని ‘మ్రోగింది కల్యాణ వీణ...’ పాట కూడా రాశారు. నేను డైరెక్షన్‌ చేసిన సినిమాలక్కూడా సినారేగారు పాటలు రాశారు. పాట సందర్భం గురించి వివరించినప్పుడు ఎంతో ఓపికగా వినేవారు. త్వరగా రాసిచ్చేవారు. గొప్ప రచయితను కోల్పోయాం.
– విజయనిర్మల, నటి–దర్శకురాలు

నాకేం చెప్పాలో తెలియడం లేదు. నారాయణరెడ్డిగారు లేరంటే ఒక అధ్యాయం ముగిసినట్టే. చరిత్ర ఉన్నంత కాలం ఆయన పాటలు, రచనలు ఉంటాయి. అటువంటి మహా కవి లేకపోవడం అనేది చిత్రపరిశ్రమకే కాదు.. తెలుగు జాతికే లోటు. ఆయనతో నాది 30 ఏళ్ల అనుబంధం. ‘కృష్ణవేణి’ సినిమాలో ‘కృష్ణవేణి...’ పాట రాయడానికి ముప్ఫై నలభై పుస్తకాలు తెప్పించి, రెండు నెలలు అధ్యయనం చేసి పాట రాశారు. ‘మన ఊరి పాండవులు’కి గంటన్నరలో ఓ పాట రాశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహా భాగవతం అంత చరిత్ర ఉంది. ఆయనలా రచనలు చేసి, చరిత్ర సృష్టించే వారు రావాలని కోరుకుంటున్నా.
– కృష్ణంరాజు, నటుడు

మా గురువుగారి (దాసరి) దర్శకత్వంలో చేసిన ‘స్వర్గం–నరకం’ టైమ్‌లో సినారేగారితో నాకు పరిచయమైంది. నాకు మొదటిసారి ఆయన పాట రాసింది అందులోనే. తర్వాత మా సంస్థలో నిర్మించిన ఎన్నో సినిమాలకు పాటలు రాశారు. ఆయన రచించి, పాడిన ‘కర్పూర వసంత రాయగన్‌’ను సినిమాగా తీయమని నాకు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఓ గొప్ప కవి, రచయితను మనం కోల్పోయాం. మళ్లీ ఈతరంలో ఇటువంటి గొప్ప వ్యక్తి ఉన్నారేమో నాకు తెలీదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
– మోహన్‌బాబు, నటుడు

సాహిత్య లోకంలో ఒక కురువృద్ధుడు సినారేగారు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. నా మనసు కలచివేస్తోంది. చెన్నైలో (1980) ఉన్నప్పట్నుంచి ఆయనతో నాకు సత్సంబంధాలున్నాయి. నేనెప్పుడు కనిపించినా చాలా ఆప్యాయంగా పలకరించేవారు. నా సినిమాలకు ఎన్నో పాటలు రాశారు. అలాంటి నారాయణరెడ్డిగారు లేరు అనడమనేది వ్యక్తిగతంగా నాలాంటివాళ్లకు, సాహిత్య లోకానికి, సినిమా లోకానికి తీరని లోటు. ఈ వార్త అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎవరూ తీర్చలేనటువంటి, పూడ్చలేనటువంటి లోటు ఇది.

– చిరంజీవి, నటుడు


తెలుగు భాషకు సినారేగారు చేసిన సేవలు చిరస్మరణీయం. మా నాన్నగారు స్వర్గీయ ఎన్టీఆర్‌గారి ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన, నాన్నగారి ద్వారానే సాంస్కృతికంగా పలు శాఖలకు సారథ్యం వహించి తెలుగు భాషకు పలు సేవలందించారు. పండితుల నుంచి పామరుల వరకు అందర్నీ ఏకకాలంలో మెప్పించగలిగే సాహిత్యాన్ని అందించి, తెలుగు సినిమా పాట గౌరవాన్ని ఇనుమడింపజేశారు. నా సినిమాల్లో ఆయన ఎన్నో పాటలు రాశారు. పోర్చుగల్‌లో ఉన్న నాకు ఆయన కన్నుమూశారని తెలిసింది. తీరని బాధ కలిగింది. సాహితీ లోకానికి సినారేగారు లేని లోటు తీర్చలేనిది.
– నందమూరి బాలకృష్ణ, నటుడు

మా నాన్నగారి (రామానాయుడు)కి సినారేగారు సన్నిహితులు. మా సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలో పలు చిత్రాలకు పని చేశారాయన. వెరీ వెరీ క్లోజ్‌ ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఆయన మరణం మాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.
– వెంకటేశ్, నటుడు

‘‘తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, జ్ఞానపీuŠ‡ అవార్డు గ్రహీత సినారేగారి మరణం తెలుగుజాతికే కాక యావత్‌ సాహితీ లోకానికి తీరని లోటు. తెలుగు సినిమా పాటను కావ్య స్థాయికి తీసుకెళ్లిన ఆ మహానుభావుని స్థానం భర్తీ చేయలేనిది. పురస్కారాలు, పదవులు ఆయనలో వినమ్రతను మరింత పెంచాయి. తండ్రి వ్యవసాయం చేస్తే, సినారేగారు సాహితీ వ్యవసాయం చేసి, తెలుగు వారికి సాహిత్య ఫలాలను అందించారు. ఇంతటి సాహితీ స్రష్ట మరణించారని తెలిసి ఆవేదన చెందాను. భౌతికంగా సినారేగారు మన మధ్య లేకపోయినా ఆయన వెదజల్లిన సాహిత్య సౌరభాలు చిరంతనంగా పరిమళిస్తూనే ఉంటాయి.
– పవన్‌కల్యాణ్, నటుడు

నాకు అక్షర భిక్ష పెట్టిన మహానుభావుడు నారాయణరెడ్డిగారు. నేను కంఠం విప్పిన తర్వాత అందరి దృష్టిలో పడటానికి ఆయన పాటలే ఎక్కువ కారణం. ఘంటసాలగారి తర్వాత సినారేగారి పాటలు ఎక్కువగా పాడింది నేనే అనుకుంటున్నా. ఆయన మనసు ఎంత లలితమైనదో, ఆయన మరణం కూడా అంత అనాయాసంగా జరిగింది. ఇటువంటి సందర్భంలో నేను ఎక్కువ మాట్లాడలేను. అక్షరాన్ని ప్రేమించే వారందరూ ఆయన్ని ప్రేమిస్తారు.
– ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గాయకుడు

సినారేగారి గురించి మాట్లాడాలంటే నాలాంటి వాళ్లకు వారం పడుతుంది. గొప్ప మానవతావాది. ఆయన పొందనటువంటి బిరుదులు, సత్కారాలు లేవంటే నేను నమ్మను. తెలుగు సినీ రంగానికి ఇలాంటి మహానుభావుల నిష్క్రమణ చాలా నష్టం. అది ఇప్పుడున్న జనరేషన్‌ వారందరికీ తెలుసు. ఆయన అన్ని రకాల పాటలు రాశారు. ఆయన పాటల్లో నాకు బాగా నచ్చేది ‘మత్తు వదలరా.. నిద్దుర మత్తు వదలరా’. ఆయనలాంటి వారి గురించి చెప్పడానికి నాలాంటి వాడు సరిపోడు.
– కోట శ్రీనివాసరావు, నటుడు

తెలుగు చిత్రపరిశ్రమ, సాహిత్య పరిశ్రమను కుదిపేసినటువంటి వార్త ఇది. పద్మభూషణ్, జ్ఞానపీuŠ‡ అవార్డు గ్రహీత, చివరి వరకూ తన శ్వాసను సాహిత్యానికి అంకితం చేసిన సినారే మనవాడు, మన తెలుగువాడు అని చెప్పుకోవడం మనకెంతో గర్వకారణం. అలాంటి మహనీయుణ్ణి కోల్పోవడం మన దురదృష్టం. నేను నటుడు కాకముందు, చిత్రసీమకు రాక ముందు, మిమిక్రీ చేస్తున్న రోజుల నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. నన్ను ఎంతో ఆప్యాయతగా పలకరించేవారు.
– బ్రహ్మానందం, హాస్యనటుడు

సినారేగారి మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, తెలుగు సాహిత్యానికి మాత్రమే కాకుండా ప్రపంచ సాహిత్యానికి తీరని లోటు. ఓ ధ్రువతార రాలిపోయింది. నవరసాలను చక్కటి సాహిత్యంతో మేళవించి గొప్ప పాటలు రాసిన మహనీయుడు. ఆయన గొప్పతనం అది. తన పాటల్లో మత సామరస్యాన్ని చాటి చెప్పారు. నేను చేసిన ‘స్వతంత్ర భారతం, లాల్‌ సలామ్‌’ సినిమాలకు ఆయనతో పాటలు రాయించుకున్నా.
– ఆర్‌. నారాయణమూర్తి, దర్శకనిర్మాత–నటుడు–రచయిత

తెలుగు సాహితీ వనంలో సినారే ఓ వటవృక్షం. ఆయన మరణం సినీ, రాజకీయ, సాహితీ రంగాలకు తీరని లోటు. నాకు గురుతుల్యులు, స్ఫూర్తిప్రదాత అయినటువంటి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.
– టి. సుబ్బరామిరెడ్డి, కళాబంధువు

కళామతల్లి కీర్తి కిరీటంలో కలికితురాయి వంటి సినారేగారు శాశ్వత విశ్రాంతి కోసం వెళ్లారు. దర్శక–నిర్మాతగా ఆయనతో పనిచేసే భాగ్యం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా. ‘సీతయ్య’ సినిమాలో ‘ఎవరి మాటా వినడు సీతయ్య...’, ‘ఇదిగో రాయలసీమ గడ్డ. దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డా...’, ‘రావయ్య రావయ్య రామసక్కని సీతయ్య...’ పాటలను ఆయనే రాశారు. ముఖ్యంగా ‘ఇదిగో రాయలసీమ గడ్డ..’ పాటకు అప్పటి ఏపీ ప్రభుత్వం నుంచి నంది (2003) పురస్కారాన్ని అందుకోవడం నాకూ, మా ‘బొమ్మరిల్లు వారి’ సంస్థకు గర్వకారణం.
– వైవీయస్‌ చౌదరి, దర్శకుడు

నారాయణరెడ్డిగారి మరణంతో తెలుగుజాతి మూగబోయింది. తెలుగు భాషకి తీరని లోటు. ఆయనకూ, మా తండ్రి (ఎన్టీఆర్‌)కి, నాకూ అనుబంధం ఉంది.  ‘గులేబకావళి కథ’ చిత్రంలో ‘నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని...’ పాటతో ఆయన సినీ జీవితం ఆరంభమైంది. మా నాన్నగారు, కాంతారావుగారు నటించిన ‘ఏకవీర’ సినిమాకి సినారేగారు డైలాగులు రాశారు. ‘అక్బర్‌ సలీం అనార్కలి’ చిత్రానికి మాటలు, పాటలు రాశారు.
– హరికృష్ణ, నటుడు

ఉస్మానియా యూనివర్శిటీలో నేను ఎంఏ తెలుగు చదువుతున్నప్పుడు సినారేగారు నా గురువు. ఆయన అడుగుజాడల్లో సినీరంగంలోకి వచ్చిన శిష్యుణ్ణి నేను. రామానాయుడుగారి ‘సర్పయాగం’ సినిమాకు దర్శకత్వం వహించినప్పుడు పాటలన్నీ గురువుగారితోనే రాయించుకున్నా. ‘ఏంటయ్యా... నన్ను అంత నమ్మేస్తున్నావ్‌’ అన్నారు. ‘గురువును కాక ఎవర్ని నమ్ముతాం సార్‌’ అన్నా. నాకు అక్షరాలు నేర్పిన గురువు మాత్రమే కాదు... అక్షర జ్ఞానం నేర్పిన గురువు. అద్భుతమైన కావ్యాలు వారి వద్ద మేం చదువుకున్నాం.
– పరుచూరి గోపాలకృష్ణ, సినీరచయిత

‘‘నారాయణరెడ్డిగారి మాట ఒక పాట. ఆయన పాటల్లోని పదాలు ఆణిముత్యాల్లాంటివి. తెలుగు జాతికి గర్వకారణమైన కవి. నన్నయ, ఎర్రన, తిక్కన వంటి కవుల గురించి మనం వినుంటాం. కానీ, చూడలేదు. ఈ రోజు అంత గొప్ప స్థాయిలో ఉన్న గొప్ప కవి, గేయ రచయిత, సాహితీ పిపాసకులు నారాయణరెడ్డిగారు. ఆయన నన్ను, నా పాటలను ఎంతో ప్రోత్సహించారు.
– రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు

మరిన్ని వార్తలు