స్వై...ప్ విహారం

12 Dec, 2016 13:54 IST|Sakshi
స్వై...ప్ విహారం

క్యాషు పోయి... కార్డు వచ్చె... ఢామ్ ఢామ్ ఢామ్!
నోటు పోయి... స్వైప్ వచ్చె... ఢామ్ ఢామ్ ఢామ్!
బెంజికైనా... గంజికైనా... స్వైపేనోయ్... ఢామ్ ఢామ్ ఢామ్!!

రెండు వారాల క్రితం... నవంబర్ 8వ తేదీ... రాత్రి... చెన్నైలోని ఓ పేరున్న రెస్టారెంట్‌లో కూర్చొన్న సురేశ్ తన ఫ్రెండ్‌తో మాట్లాడుతుండగా, టీవీలో వార్త బ్రేక్ అయింది... పెద్ద నోట్ల రద్దు అని! అర్ధరాత్రి 12 గంటలకి ఇంకా కొద్ది గంటలుంది. కాసేపయ్యాక బిల్ పే చేయడానికి ఖరీదైన రెండు వెయ్యి నోట్లు ఇచ్చిన సురేశ్‌తో, వెయిటర్ చాలా వినయంగానే చెప్పాడు... ఆ నోట్లు ఇక చెల్లవని! సర్కారు వారి కొత్త నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపబోతోందో సురేశ్‌కు ఆ క్షణం నుంచి క్రమక్రమంగా అర్థమవసాగింది. పన్నెండు రోజుల తరువాత రోజూ బ్యాంకులు, ఏ.టి.ఎం.లు, స్వైప్ మిషన్ మాత్రమే ఉన్న షాపుల చుట్టూ తిరగడాలతో... ఇప్పుడు సురేశ్ జీవితమే మారిపోయింది. ఇప్పటి దాకా వద్దనుకుంటూ వచ్చిన క్రెడిట్ కార్డుకు కొత్తగా అప్లై చేశాడు... పే టి.ఎం. లాంటి మొబైల్ వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు ఎలా జరపాలో తెలుసుకుంటున్నాడు. 120 కోట్ల మంది భారతీయుల్లోని అధికశాతం సగటు భారతీయుల పరిస్థితికి సురేశ్ ఒక మచ్చుతునక.

కార్డ్ ఈజ్ కింగ్!
చలామణీలో ఉన్న పెద్ద నోట్లను ఉపసంహరిస్తూ, కొత్త నోట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ఇప్పుడు ఏ బ్యాంకు చూసినా కిటకిటలాడే జనం. పాత నోట్లు మార్చుకోవడానికీ, కొత్త నోట్లు తెచ్చుకోవడానికీ గంటల కొద్దీ క్యూల్లోనే జీవితం గడిచిపోతోంది. పేపర్ మనీ నుంచి ప్లాస్టిక్ మనీ (డెబిట్ కార్డు, క్రెడిట్‌కార్డు) వైపు జనాన్ని నెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఇదీ ఒకటి. అందుకు తగ్గట్లే చేతిలో డబ్బులు, చిల్లర లేక ఇప్పుడు కార్డులు పట్టుకొని షాపులకూ, ఏ.టి.ఎం.లకూ వెళుతున్నవారు పెరుగుతున్నారు.

పెట్రోల్ పోయించుకోవడం నుంచి ప్రతి కొనుగోలుకీ ఇప్పుడు కార్డులు స్వైప్ చేయడం, ‘పే టి.ఎమ్’ లాంటి మొబైల్ వ్యాలెట్లతో చెల్లించడం లేటెస్ట్ ట్రెండ్. ఒకప్పుడు ‘క్యాష్ ఈజ్ కింగ్’. కానీ, ఇప్పుడు మాత్రం ఇండియాలో ‘కార్డ్ ఈజ్ కింగ్’. ప్రభుత్వం దెబ్బతో ప్లాస్టిక్ మనీయే ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ముద్దు అవుతోంది. ఇప్పుడంతా స్వై...ప్ విహారమే!

క్యాష్ నై! నాన్-క్యాష్‌కే జై!
నిన్నటి దాకా వారం వారం సంతలోనో, రైతుబజారుకో వెళ్ళి కూరలు కొనుక్కోవడం లలిత, కృష్ణకుమార్ దంపతులకు అలవాటు. కానీ, ఇప్పుడు చేతిలో ‘క్యాష్’ లేని ఈ దంపతులు ‘కార్డ్‌లు’ పట్టుకొని, స్పెన్సర్స్ వాళ్ళ ‘రిటైల్’, రిలయన్స్ వాళ్ళ ‘మోర్’ లాంటి సూపర్ మార్కెట్లలో కూరలు కొనుక్కోవాల్సి వస్తోంది. సరుకులకూ అదే పని చేయాల్సి వస్తోంది. ఇంటి నుంచి బయటకు రావడానికి వీలు లేకపోతే - ఆన్‌లైన్‌లో పచారీ సామాన్లు విక్రయించే ‘బిగ్ బాస్కెట్’ లాంటివి ఈ కరెన్సీ కష్టాల కాలంలో ఆపద్బంధువులయ్యాయి. విజయవాడ దగ్గర గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చి మీడియా రంగంలో స్థిరపడ్డ 32 ఏళ్ళ కుమార్‌కు ఎప్పుడూ పచారీ కొట్టు నుంచి సరుకులు కొనుక్కోవడమే అలవాటు. కానీ, ఈ నవంబర్ మొదటి వారం నుంచి ‘కరెన్సీ కష్టాలు’ వెంటాడడంతో, ‘‘తొలిసారిగా నేను ఆండ్రాయిడ్ ఫోన్‌లో ‘బిగ్ బాస్కెట్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నా. రూ. 2 వేల పైగా విలువైన నెలవారీ సరుకుల్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి, కరెన్సీతో పని లేకుండా ఆన్‌లైన్‌లోనే వాళ్ళకు చెల్లింపు జరిపా’’ అని తన ఫోన్‌లో ఆ లావాదేవీ వివరాలు చూపించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ‘మొబైల్ బాస్కెట్’లో లావాదేవీలు గత నెలతో పోలిస్తే 20 నుంచి 22 శాతం పెరిగినట్లు ఆ సంస్థ అధిపతే స్వయంగా ప్రకటించారు.

అన్ని చోట్లా కార్డ్ స్వైప్ మిషన్లే!
ఒకప్పుడు కార్డ్ స్వైప్ మిషన్ల ద్వారా నగదు చెల్లింపులు నగరాల్లో, అదీ కొన్ని చోట్లే ఎక్కువగా కనిపించేది. కానీ, ‘పెద్ద నోట్ల కష్టా’లతో ఇప్పుడు కాలేజీ క్యాంటీన్లు, చిన్న స్థాయి వర్తకులు, టోకు వ్యాపారులు కూడా కొత్తగా కార్డ్ స్వైప్ మిషన్లు పెట్టుకుంటున్నారు. చివరకు నిన్నటి దాకా లావాదేవీలన్నీ కరెన్సీలోనే జరిగే తిరుచునాపల్లి, బొకారో, సింధుదుర్గ్, బీడ్ లాంటి చిన్నా చితకా టౌనుల్లో కూడా ఇప్పుడు ప్లాస్టిక్ మనీ లావాదేవీలకు వీలిచ్చే ఈ యంత్రాల కోసం క్యూ కడుతున్నాయి. ఇదే అదనుగా తీసుకొని ‘ఎల్.జి’ లాంటి కొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థలైతే ఈ మిషన్లను తక్కువ వడ్డీకి, నెలసరి వాయిదాల్లో అమ్ముతామంటూ ఆఫర్లు ప్రకటించాయి. అందుకే, ఇప్పుడు పెట్రోల్ బంకుల లాంటి చోట్లే కాదు... కాస్తంత పెద్ద పాన్ షాపుల్లోనూ మిషన్లు కొత్తగా ప్రత్యక్షమవుతున్నాయి.

ఇది డిజిటల్ ‘పే’ టైమ్!
మారిన పరిస్థితులు, కస్టమర్లు ఖర్చుపెట్టే రీతిలో వస్తున్న మార్పులకు తగ్గట్లు మారుతున్న వినూత్న వ్యాపారులూ ఉన్నారు. చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో కార్డ్ స్వైపింగ్ మిషన్ల ద్వారా కూరలకు డబ్బు చెల్లించే ఏర్పాట్లు వెలిశాయి. కేవలం కార్డులే కాదు... మొబైల్ వ్యాలెట్లతో నడుస్తున్న లావాదేవీలూ బోలెడు. ఢిల్లీలోని ‘డిజిటల్ ఛాయ్‌వాలా’ దగ్గర అయితే, 7 రూపాయల బిల్లు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించే వసతి పెట్టారు. ఢిల్లీ ఆర్.కె. పురంలోని సెక్టార్ 9లో టీ స్టాల్ నడుపుతున్న రామ్ ప్రవేశ్ దగ్గరకు అక్టోబర్‌లో ‘పే టి.ఎం’ వాళ్ళు వచ్చారు. అప్పుడు ఆ వసతి వద్దన్న ఈ టీ స్టాల్ ఓనర్ పెద్ద నోట్ల రద్దు దెబ్బకి చిల్లర కటకట ఏర్పడడంతో, పిలిచి మరీ ‘పే టి.ఎం’ తీసుకున్నారు. ఆ షాపు ముందు డిజిటల్ వ్యాలెట్ ‘పే టి.ఎం’ కోసం ‘క్విక్ రెస్పాన్స్’ (క్యూ.ఆర్) కోడ్ అతికించారు. ఈ కొత్త వసతితో మొబైల్ వ్యాలెట్లు ఉన్న కాలేజీ కుర్రకారు సహా అందరూ పది రోజులుగా ఆ షాప్‌కి వెళుతున్నారు.

డిజిటల్ విధానంలో చెల్లింపులకు వీలు కల్పించే స్టార్టప్‌ల సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగింది. మన దేశంలో అతి పెద్ద మొబైల్ పేమెంట్స్ కంపెనీ, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ‘పే టి.ఎం’లో రద్దీ ఉన్నట్టుండి పెరిగింది. పెద్దనోట్ల రద్దు తర్వాత అందులో లావాదేవీల సంఖ్య ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 50 లక్షలకు చేరింది. తాజా మార్పుకు ఇదో పెద్ద నిదర్శనం. డబ్బులు దొరకడం, అందులోనూ చిల్లర దొరకడం మరీ కష్టంగా మారిపోయిన పరిస్థితుల్లో - ఇలా టెక్నాలజీ మీద పట్టున్న వర్గాలన్నీ ఇప్పుడు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులు, పే టి.ఎం. వ్యాలెట్లే శరణ్యం అంటున్నాయి.

కానీ, డబ్బు మూలుగుతున్న బడా బాబులకు ఎలాగూ కష్టం లేదు. ఈ డిజిటల్ లావాదేవీలు తెలిసిన చదువుకున్నవారికీ ఓకే. మరి, దేశంలోని 6 లక్షల పైగా గ్రామాల్లో బ్యాంకింగ్ వసతులు, ఏ.టి.ఎం.లు లేని, ఇంటర్నెట్ అంటే తెలియని సామాన్యులు, రైతులు, వృద్ధులు, బీదాబిక్కీ పరిస్థితి ఏమిటి? సర్కారు తీసుకొనే అనాలోచిత నిర్ణయాల స్వైరవిహారంలో వీళ్ళ గోడు వినేదెవ్వరు?

చేతిలో డబ్బులు ఆడకపోవడంతో అందరూ ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌లోని అవకాశాల వైపు చూస్తున్నారు. దాంతో, పేమెంట్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం రెట్టింపు అయింది. కిరాణా షాపులు కూడా డిజిటల్ వ్యాలెట్ స్టార్టప్ సంస్థలతో చేతులు కలుపుతున్నాయి.‘పే టి.ఎం’, ‘మొబీ క్విక్’, ‘ఫ్రీ ఛార్జ్’ లాంటి మొబైల్ పేమెంట్ వ్యాలెట్‌లు, ‘చిల్లర్’ లాంటి మొబైల్ పేమెంట్ యాప్‌లకు ఆదరణ పెరుగుతోంది. ‘పే టి.ఎం’కు మొన్నటి దాకా 10 కోట్ల మంది యూజర్లు, రోజుకు 20 లక్షల లావాదేవీలే ఉండేవి. ఇప్పుడు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నవాళ్ళ సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఒకే రోజు 50 లక్షల లావాదేవీలు జరిగాయి.

{పతి డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ సంస్థా ఇప్పుడు ఆన్‌లైన్ కొనుగోళ్ళ కోసమే కాకుండా, ఆఫ్‌లైన్ లావాదేవీలకు కూడా జనం తమని వినియోగించేలా దృష్టి పెడుతున్నాయి. ‘ఓలా’, ‘ఉబర్’ లాంటి ట్యాక్సీ వసతుల అనుసంధాన సంస్థల్లో కూడా ఇప్పుడెక్కువగా నాన్-క్యాష్ లావాదేవీలే జరుగుతున్నాయి. ‘ఓలా’లో డిజిటల్ రీఛార్జ్‌లు కూడా 15% పెరిగాయి.

కార్డుల భారతం! కోట్లలో...
72.8   ప్రస్తుతం మన దేశంలో ఉన్న డెబిట్ కార్డ్‌ల సంఖ్య.
2.7   ఇప్పుడు ఇండియాలో ఉన్న క్రెడిట్ కార్డ్‌ల సంఖ్య.
ఈ కార్డుల్లో అత్యధిక భాగం మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాలవే!
దిగువ వర్గాల్లో పాస్టిక్ మనీ వాడకం చాలా అరుదు.

జనాభా ఎక్కువ! ఏ.టి.ఎం.లు తక్కువ!!
2.2 లక్షలు ఇవాళ మన దేశంలో ఉన్న ఏ.టి.ఎం.ల సంఖ్య
ప్రతి 10 లక్షల మందికీ అమెరికాలో అయితే 1500 ఏ.టి.ఎం.లున్నాయి.
చైనాలో అయితే, 350 ఏ.టి.ఎం.లున్నాయి.
కానీ, మన దేశంలో దాదాపు 130 ఏ.టి.ఎం.లే ఉన్నాయి.

రాష్ట్రాల సంగతి వివరంగా చూస్తే...
►   తమిళనాడు, గోవా లాంటి చోట్ల ప్రతి 2 వేల మందికీ ఒక ఏ.టి.ఎం. ఉంది. కానీ, బీహార్, ఉత్తర ప్రదేశ్ లాంటి
చోట్ల ప్రతి 11 వేల మందికి కానీ ఒక ఏ.టి.ఎం. లేదు.

కొత్త నోటు పెట్టాలంటే..!

30 వేలు  ఇది ఇప్పటి దాకా కొత్త 2 వేల నోటుకు తగ్గట్లు
మార్చిన ఏ.టి.ఎం.ల సంఖ్య.
12 వేలు ఇది ప్రతిరోజూ కొత్త నోటుకి తగ్గట్లు  మారుస్తున్న ఏ.టి.ఎం.ల సంఖ్య.
రూ. 10 వేలు ఒక్కో ఏ.టి.ఎం.ను ఇలా కొత్త నోటుకు తగ్గట్లు మార్చడానికయ్యే ఖర్చు.
రూ. 200 + కోట్లు మొత్తం ఏ.టి.ఎం.లను ఇలా మార్చడానికి  అవుతున్న ఖర్చు.

- రెంటాల జయదేవ

>
మరిన్ని వార్తలు