ఓటీపీలతో రూ.6.90 లక్షలకు కుచ్చుటోపీ

18 Dec, 2023 03:43 IST|Sakshi

ప్రభుత్వం నుంచి డబ్బులొస్తాయని ఆశచూపి దోచుకున్న మోసగాళ్లు 

ఐనముక్కలలో సైబర్‌ మోసానికి గురైన సోదరులు  

పెద్దదోర్నాల: ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం మీ అకౌంట్లోకి జమ చేస్తామని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు బ్యాంక్‌ అకౌంట్‌లోని నగదు మొత్తాన్ని కాజేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఐనముక్కలలో ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘరానా మోసంలో గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు నగదు పోగొట్టుకున్నారు. ఎస్సై అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన గ్రామానికి చెందిన చిట్యాల ఆంజనేయరెడ్డి అనే యువకుడికి గుర్తు తెలియని నంబర్‌ నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది.

ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం ఒక్కసారే అకౌంట్‌లో పడుతుందని, ఫోన్‌ పే ఉన్న ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి మాట్లాడాలని సూచించాడు. తొలుత అకౌంట్‌ నుంచి కొంత మొత్తం కట్‌ అయి తిరిగి పడుతుందని మోసగాళ్లు నమ్మబలికారు. తనది ఆండ్రాయిడ్‌ ఫోన్‌ కాకపోవడంతో ఆ యువకుడు గ్రామానికి చెందిన లింగాల శ్రీను నంబర్‌ నుంచి గుర్తు తెలియని నంబర్‌కు కాన్ఫరెన్స్‌ కాల్‌ మాట్లాడాడు. అయితే.. శ్రీను అకౌంట్‌లో అమౌంట్‌ తక్కువగా ఉందని చెప్పడంతో శ్రీను తమ్ముడు లింగాల రమేష్‌ నంబర్‌ నుంచి ఫోన్‌చేసి కాన్ఫరెన్స్‌  కాల్‌ కలిపి ముగ్గురూ సైబర్‌ నేరగాళ్లతో మాట్లాడారు.

అతని మాటలు నమ్మిన రమేష్‌ తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌లతో పాటు ఫోన్‌పేకు సంబంధించిన పాస్‌వర్డ్‌ను చెప్పటంతో లింగాల రమేష్‌ అకౌంట్‌లోని రూ.6.90 లక్షల నగదు మాయమైంది. అయితే.. మాయమైన డబ్బు నుంచి రూ.79 వేల నగదు తిరిగి బాధితుడి అకౌంట్‌కు జమ అయినట్లు ఎస్సై తెలిపారు. తమకు వచ్చిన ఫోన్‌ నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా అది స్విచ్చాఫ్‌ వస్తుండటంతో తాము మోసపోయినట్టు సోదరులు గ్రహించారు.

హుటాహుటిన పోలీస్‌ స్టేషన్‌తో పాటు స్థానిక బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ నుంచి ఫోన్లు వచ్చాయని, ఏ రాష్ట్రానికి ఫోన్‌ చేయాలనుకుంటే అదే భాషలతో మాట్లాడే వాళ్లతో ఫోను చేయిస్తారని, డబ్బులు వస్తాయని నమ్మకంగా ఆశ చూపి అకౌంట్లలోని డబ్బులు మాయం చేస్తారని ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.  

>
మరిన్ని వార్తలు