క్రీస్తుపూర్వమే సెన్సార్‌షిప్

1 Nov, 2015 03:57 IST|Sakshi
క్రీస్తుపూర్వమే సెన్సార్‌షిప్

ప్రజలు ఏది చూడాలో, ఏది చదవాలో, ఏది వినాలో ప్రభుత్వాలు నిర్ణయించే పద్ధతి ఈనాటిది. రోమన్ సామ్రాజ్యంలో క్రీస్తుకు శతాబ్దాల పూర్వమే ఇలాంటి పద్ధతి ఉండేది. ప్రజల నైతిక వర్తనను నియంత్రించేందుకు రోమన్ ప్రభుత్వం సెన్సార్ అధికారులను నియమించేది. వారికి ఒక ప్రత్యేక విభాగమే ఉండేది. రోమన్ రాజ్యంలో ఆ విభాగం క్రీస్తుపూర్వం 443 నుంచి క్రీస్తుపూర్వం 22 వరకు పనిచేసినట్లు ఆధారాలు ఉన్నాయి. రోమన్ రాజ్యానికి చేరువలోనే ఉన్న గ్రీకు సామ్రాజ్యంలోనూ క్రీస్తుపూర్వం 399 నాటి నుంచి సెన్సార్‌షిప్ అమలులోకి వచ్చింది.

యువకులను చెడగొడుతున్నాడనే నెపంతో సోక్రటీసును విషమిచ్చి చంపేసిన తర్వాత, సాక్షాత్తు సోక్రటీసు శిష్యుడైన ప్లాటోనే సెన్సార్‌షిప్‌కు సానుకూల సిద్ధాంతాన్ని తెర మీదకు తెచ్చాడు. పిల్లలు ఏది చూడాలో, ఏది వినాలో, ఏది చదవాలో నియంత్రించడం సమాజానికి గల నైతిక బాధ్యత అని తన గ్రంథం ‘ద రిపబ్లిక్’లో ప్రకటించాడు. ఇక క్రీస్తుపూర్వం 213లో చైనా చక్రవర్తి కిన్ షి హువాంగ్ కఠినాతి కఠినమైన సెన్సార్‌షిప్‌ను అమలులోకి తెచ్చాడు.

వ్యవసాయం, వైద్యం, మతబోధనలు మినహా మరే రకమైన పుస్తకాలను ప్రజలు చదవరాదని శాసించాడు. అంతటితో ఆగకుండా మిగిలిన పుస్తకాలన్నింటినీ వెతికించి మరీ తగులబెట్టించాడు. అంతటి దారుణమైన పరిస్థితుల్లోనూ కన్ఫూషియస్ అనుయాయులు కొందరు వీలైనంత వరకు ఆయన రచనలు నాశనం కాకుండా కాపాడగలిగారు. దురదృష్టమేమిటంటే, ప్రజాస్వామిక యుగం ఆవిర్భవించిన తర్వాత కూడా చాలా దేశాల్లో సర్కారీ సెన్సార్‌షిప్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

కూర్పు: పన్యాల జగన్నాథ దాసు

మరిన్ని వార్తలు