‘నాకోసం’ కాదు, ‘మనకోసం’ అంటే చాలు...

19 Aug, 2018 01:09 IST|Sakshi

ఆయన ఈ దేశం గురించి ఆలోచించాడు. అసలు ఈ దేశంలో ఇన్ని నేరాలు జరగడానికి, ప్రజలు ఇన్ని కష్టాలు ఎదుర్కోవడానికి, చాలామంది ఆకలి దప్పికలతో అలమటించడానికి కారణం– అందరికీ ఉండవలసినంత భూమి లేకపోవడం. అది ఉంటే ఇన్ని నేరాలు జరగవు, ప్రతివాడు కష్టపడి ఆ భూమిని సాగుచేసుకుని ధార్మికంగా, న్యాయంగా బతుకుతాడుగదా...అని అనిపించింది ఆయనకు.అలా భూమి అందరికీ దక్కకుండా ఎవరో కొద్దిమంది ఐశ్వర్యవంతుల చేతిలో ఉండిపోతే అందరూ సంతోషంగా ఉండలేక పోతున్నారు. దీనిని చక్కదిద్దాలంటే కొంతమందివద్ద కాకుండా ముఖ్యంగా పేదలందరికీ భూమి దక్కాలిగదా...అని కూడా ఆయనకు అనిపించింది. మరి అలా జరిగేటట్లు చేయాలంటే ‘‘నాచేతిలో అధికారమయినా ఉండాలి, లేదా కేంద్రమంత్రి పదవో, ప్రధానమంత్రి పదవో ఉండాలి. కనీసంలో కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అయినా ఉండాలి’’ అని మాత్రం ఆయన అనుకోలేదు, అలా కోరుకోలేదు కూడా....

మరెలా !!! ఓం ప్రథమంగా...తెలంగాణ ప్రాంతంలోని పోచంపల్లి అనే ఊరెళ్ళాడు. తన హృదయాన్ని ఓ చిన్న ప్రసంగం రూపంలో అందరిముందు ఆవిష్కరించాడు. ఏదో ఒక పని చేసుకుని బతకలేకపోతే సామాన్యుడు ఎలా దారి తప్పుతాడో, ఎలా నేరాలు చేస్తాడో, అందరికీ భూమి ఉండాల్సిన అవసరం ఏమిటో, కొద్దిమంది చేతిలోనే ఎక్కువ భూమి ఎందుకు ఉండకూడదో చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్లు వివరించి చెప్పాడు. అది వింటున్నవారిలో ఒక చిన్న కదలిక మొదలయింది. వారిలో ఒక ఐశ్వర్యవంతుడు కూడా ఉన్నాడు. ఆయన దగ్గర కొన్ని వేల ఎకరాల భూమి ఉంది. ఆయనలో కదలిక మరీ ఎక్కువయి లేచి నిలబడ్డాడు. ‘అయ్యా! నాకున్న భూమిలోనుంచి వంద ఎకరాల భూమిని మీకు దానం చేస్తున్నాను. మీరు వాటిని పేదరైతులకు ఇచ్చేయండి’ అని సవినయంగా విన్నవించుకున్నాడు. ఆ దాత పేరు రామచంద్రా రెడ్డి.

అంతే...ఆ ఊరికి వచ్చిన ఆ పెద్ద మనిషి ఆ ఒక్క ముక్కకే పొంగిపోయాడు. వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఏకంగా 14 సంవత్సరాలు భారతదేశమంతటా కాలికి బలపం కట్టుకుని ఊళ్ళన్నీ ... 70వేల కిలోమీటర్ల మేర తిరిగాడు.12 భాషలు నేర్చుకుని ఎక్కడికక్కడ వారి ఊరి భాషలో మాట్లాడాడు...మనం అన్నదమ్ములమని గొంతు చించుకుంటే సరిపోదు..లేని తమ్ముడి గురించి అన్న ఆలోచించాలన్నాడు...ఇలా చాల తక్కువగానే మాట్లాడినా, ఎక్కువగా అర్థమయ్యేట్లు చెప్పాడు...అక్షరాలా 42 లక్షల ఎకరాల భూమిని దానంగా పుచ్చుకున్నాడు... పుచ్చుకున్నదంతా ఎక్కడికక్కడ పేదలందరికీ పంచిపెట్టేసాడు.

మీరు నమ్మలేరు...మీరే కాదు ప్రపంచ చరిత్ర అప్పటివరకు ఎరుగని ఈ అద్భుతం ఆ తరువాత కాలంలో ‘భూదానోద్యమం’గా ఖ్యాతికెక్కింది. దాన్ని నడిపినవాడు ఆచార్య వినోబా భావే. మహాత్మాగాంధీ మాటలతో స్ఫూర్తిపొంది ఆయన సన్నిహిత అనుచరుడిగా చాలా కాలం గడిపాడు. మీరు కూడా ఆలోచించండి. సమగ్రతతో... అంటే పవిత్రమైన లక్ష్యంతో ‘నేను చేసే పని అందరికీ పనికొచ్చేదై ఉండాలి. నా చుట్టూ ఉన్నవాళ్ళందరూ సంతోషించాలి. అలా మసలుకుంటాను’’ అని చెప్పి మీరే పనయినా చేయడం మొదలుపెడితే... ఎవర్నీ పిలవవలసిన అవసరం లేదు, మీ వెనుక ఎన్ని లక్షలమంది నడుస్తారో, ఎన్ని అనితరసాధ్యమయిన కార్యాలు సాధించవచ్చో చూపడానికి ఆచార్య వినోబా భావే ఉద్యమం ఒక మంచి స్ఫూర్తిమంతమైన ఉదాహరణ.


- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు