విలువైన భోజనం

16 Sep, 2019 04:51 IST|Sakshi

చెట్టు నీడ

ఒకసారి ఛత్రపతి శివాజీ ఆగ్రాపై దండయాత్ర అనంతరం తిరిగి తన రాజ్యానికి వెళుతున్నాడు. మార్గమధ్యంలో తన రాజ్యంలోని ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకున్నాడు. తీవ్రమైన అలసటతో, ఆకలితో ఉండడం వల్ల దగ్గరలోని ఒక ఇంటికి వెళ్లి ఆ గృహిణిని ఆహారం పెట్టమని కోరాడు శివాజీ. సాధువు వేషంలో ఉన్న శివాజీని ఆ ఇల్లాలు గుర్తించలేదు. కాసేపు ఆగితే వంట చేసి భోజనం వడ్డిస్తానని చెప్పింది ఆదరంగా. ఎదురు చూస్తూ కూర్చున్నాడు శివాజీ. కాసేపటికి శివాజీని పిలిచి అరటి ఆకు వేసి అందులో అన్నం వడ్డించింది. పాత్రలో పప్పు పెట్టింది. కుంభంలా ఉన్న అన్నం మీద పప్పు పోసుకున్నాడు శివాజీ. అరటి ఆకుకు అంచులు లేనందున అన్నం మీద నుండి పప్పు ఆకు బయటకు పారింది.

ఆ దృశ్యం చూసిన గృహిణి ‘‘నువ్వూ మన రాజుగారు శివాజీ లానే చేస్తున్నావే! అరటి ఆకు మీద నుండి పప్పు బయటకు పోకుండా చుట్టూ అన్నంతో కట్టుకట్టాలని తెలియదా?’’ అని అడిగింది. శివాజీ ఉలిక్కిపడ్డాడు. తరువాత సంతృప్తిగా భోజనం ముగించి గృహిణికి కృతజ్ఞతలు చెప్పుకుని బయల్దేరాడు. శివాజీ రాజ్యాన్ని అయితే విస్తరించాడు కానీ రాజ్యం చుట్టూ సరైన ఎల్లలు నిర్మించి కట్టుదిట్టం చేయకపోవడం వలన తరచూ శత్రువులు రాజ్యంలో సులువుగా ప్రవేశించి దాడులు జరిపేవారు. తనకు ఆతిథ్యం ఇచ్చిన ఆమె పలికిన మాటలు శివాజీ పొరపాటుని ఎత్తి చూపించడమే కాకుండా కర్తవ్యాన్ని బోధించాయి. కొన్నిసార్లు విలువైన పాఠాలు కూడా మామూలు సందర్భాలలోనే జనించి ఊహించని మేలు చేస్తాయని మనసులో అనుకున్నాడు శివాజీ.
– అమ్మాజీ గుడ్ల

మరిన్ని వార్తలు