ఆ గ్రామం కేన్సర్‌ నిలయంగా ఎందుకు మారింది?

1 Nov, 2023 09:44 IST|Sakshi

ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌).. దేశంలోని ఇతర ప్రాంతాలకు మించిన మౌలిక సదుపాయాలు కలిగినదిగా పరిగణిస్తారు. వాస్తవానికి ఇక్కడున్న మౌలిక సదుపాయాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం ఈ ప్రాంతంలోని గురుగ్రామ్ జిల్లాలోని బంధ్‌వాడి గ్రామం గురించి తెలుసుకోబోతున్నాం. 

ఇది గురుగ్రామ్-ఫరీదాబాద్ హైవేపై, ఆరావళి పర్వతాల దిగువన ఉంది. ఇక్కడకు రాగానే దూరం నుంచే ఒక చెత్త కొండ కనిపిస్తుంది. దీని పరిష్కారానికి కసరత్తు జరుగుతున్నప్పటికీ, మరోవైపు దీనికారణంగా స్థానికుల ప్రాణాలు పోతున్నాయి. దాదాపు నాలుగున్నర వేల జనాభా కలిగిన ఈ గ్రామంలో ప్రతి మూడో ఇంటిలో ఒక కేన్సర్ బాధితుడు ఉన్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం అవుతుంది. 

క్యాన్సర్‌తో బాధపడుతున్న సత్పాల్‌ మాట్లాడుతూ ‘చెత్త కొండపై నుంచి ప్రవహించే ‘లీచెట్‌’​ ​కారణంగా క్యాన్సర్‌ బారిన పడ్డాను. నేను ఎదుర్కొంటున్న పరిస్థితి ఎవరికీ రాకూడదని అనుకుంటున్నాను’ అని అన్నాడు. ‘లీచెట్’ అంటే  తడి చెత్త నుండి వెలువడే ద్రవ విష పదార్థం. అది భూమిలో ఇంకిపోతే ఆ నీరు తాగడానికి లేదా స్నానానికి సైతం పనికిరానిదిగా మారుతుంది. ఇక్కడ సుమారు రెండున్నరేళ్ల క్రితం పల్లపు స్థలంలో నిర్మించిన సరిహద్దు గోడ వర్షాలకు కూలిపోవడంతో ఆ స్థలంలో నిరంతరం చెత్త పేరుకుపోతూవచ్చింది. ఈ చెత్తను తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరసనలు చేపట్టారు. 

గౌహతిలోని ఐఐటి బృందం తన సర్వేలో ఇక్కడ 22 లక్షల టన్నుల చెత్త ఉందని వెల్లడించింది. ఈ చెత్తనంతటినీ 2024, ఏప్రిల్ నాటికి తొలగించగలమని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. బంధ్‌వాడి భూగర్భ జలాల పరీక్షలో నీటిలో సీసం ఉండవలసిన పరిమితి కంటే 120 రెట్లు, కాడ్మియం 10 రెట్లు అధికంగా ఉందని తేలింది. ఇది ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. 
ఇది కూడా చదవండి: ఏ రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించవచ్చు? నియమనిబంధనలేమిటి?

మరిన్ని వార్తలు