కోరుకున్నది దేవుడిచ్చేశాడు!

18 Nov, 2014 23:15 IST|Sakshi
కోరుకున్నది దేవుడిచ్చేశాడు!

అంతర్వీక్షణం: సంపూర్ణేశ్ బాబు
తెలుగు సినిమా పరిశ్రమలో ఓ విలక్షణత సంపూర్ణేశ్‌బాబు. తెలుగు సినిమాలపై వ్యంగ్యాస్త్రంగా ఆయన సంధించిన ‘హృదయ కాలేయం’ చిత్రం ఆ మధ్య అందరి దృష్టినీ ఆకర్షించింది. ఒక్క సినిమాతో అందరికీ సుపరిచితుణ్ణి చేసింది. ఒక్క సినిమాతో వంద సినిమాల ఆదరణ చూపిన ప్రేక్షకులకు వందనమనే ‘సంపూ’తో కొన్ని ముచ్చట్లు...
 
ఎక్కడ పుట్టారు?...
మెదక్ జిల్లాలోని సిద్ధిపేట పక్కన మిట్టపల్లి

అమ్మానాన్నలు?...నాన్న మహాదేవ్, అమ్మ కౌసల్య

ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు?
ఇలా, అలా అని లేదు. అందరినీ ఇష్టపడతాను.

ఎదుటి వారిని చూసే దృష్టి కోణం ఎలా ఉంటుంది ?
ఒక్కసారి చూడగానే అంచనా వేసేటంత  గొప్ప వాడిని కాదు, అందరితో స్నేహంగా ఉంటాను. అందరిలో స్నేహితులనే చూస్తాను.
 
మీలో మీకు నచ్చే లక్షణం ఏది?

ఫలానా అంటూ ఏ ఒక్కటో కాదు. నాకు నేను చాలా ఇష్టం. ఆ తర్వాత ప్రపంచాన్ని ఇష్టపడతాను.
     
ఏ రంగంలో స్థిరపడాలనుకున్నారు?
చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం. ఆర్టిస్టుగా విలక్షణమైన స్థానం కావాలనుకున్నాను.

ప్రభావితం చేసిన వ్యక్తి ?... మోహన్‌బాబు.

మీ తొలి సంపాదన?...‘హృదయకాలేయం’ సినిమాకి తీసుకున్న అడ్వాన్సు.

అత్యంత సంతోషం కలిగిన రోజు... 2014 ఏప్రిల్ 4 - ‘హృదయకాలేయం’ విడుదలైన రోజు.

ఎవరికైనా క్షమాపణ చెప్పుకోవాల్సి ఉందా ?
ఇంతవరకు ఎవరూ లేరు. ఇకపై తప్పు చేస్తే క్షమించమని ప్రేక్షకులనే అడుగుతాను.
మిమ్మల్ని భయపెట్టే విషయాలేంటి?...భయపడాల్సిన అవసరమే రాలేదింత వరకు.
     
ఎప్పుడైనా అబద్ధం చెప్పారా?...‘నేనింత వరకు అబద్ధమే చెప్పలేదు’ అని ఎవరైనా అంటే ... ఆ మాట నిజమని నమ్మవచ్చా? చిన్నప్పుడు హోమ్‌వర్క్ చేయక స్కూల్లో అబద్ధం చెప్పడం వంటివి తప్ప ఘోరాలకు, నేరాలకు దారి తీసే అబద్ధాలేమీ చెప్పలేదు.
     
దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు?... నేను కోరుకున్నది ఇచ్చేశాడు. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఇంతమందిని హాయిగా ఉంచుతున్న దేవుడు నన్ను మాత్రం ఎందుకు కష్టపెడతాడు?
     
అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటారు ?... మేకప్ కుదిరిందా లేదా అని చూస్తాను.
     
ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉందా?... ప్రసారమాధ్యమాలకు, సోషల్ నెట్‌వర్క్ మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. మీడియా నాకు చేసిన సహాయం చాలా గొప్పది. ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను తమ ఇంటి వ్యక్తిగా ఆదరించింది. అలాగే అందరు హీరోల అభిమానులకు నా ధన్యవాదాలు. అందరికీ సదా రుణపడి ఉంటాను. మీ ప్రేమకు బానిసను.
     
సంపూర్ణేశ్ బాబు అంటే ఏమి గుర్తు రావాలనుకుంటారు?... ‘హృదయ కాలేయం’ గుర్తు రావాలి, స్టీవెన్ శంకర్ అనే దర్శకుడు లేకపోతే సంపూర్ణేశ్ బాబు లేడు... అని కూడా.
 - వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు