సంకల్పమే సగం బలం

17 Oct, 2023 00:10 IST|Sakshi

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్య చట్టం ఊగిసలాడుతున్న సమయం అది. శాసన నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం అవసరాన్ని గుర్తించారామె. ‘ఐ విల్‌’ (ఇండియన్‌ ఉమెన్‌ ఇన్‌ లీడర్‌షిప్‌) కోర్సు చేశారు. మహిళల జ్ఞానం... విజ్ఞత పరిపూర్ణమైనదని గ్రామీణమహిళలను చైతన్యవంతం చేశారు. బ్యూటీ కాంటెస్ట్‌ కూడా సామాజిక చైతన్యానికి ఒక మాధ్యమం అని గుర్తించారు. ఇప్పుడు ఆ కిరీటాన్ని కూడా గెలుచుకుని... తెలుగు రాష్ట్రాల్లో విజేతగా నిలిచారు. మిసెస్‌ ఇండియా పోటీలలో తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు.

డాక్టర్‌ విజయ శారదారెడ్డి... విద్యాసంస్థలను నిర్వహించిన దిట్ట. చదువు చెప్పాలన్నా, చదువు చెప్పించాలన్నా తాను అంతకంటే పెద్ద చదువులు చదివి ఉండాలనేది ఆమె నమ్మకం. అందుకే ఎం.ఎ హిస్టరీ, ఎంఈడీ చేశారు. ఎంబీఏ, ఎం.ఎస్‌సీ. సైకాలజీ, ఎం.ఫిల్, పీహెచ్‌డీ చేశారు. గౌరవపూర్వకంగా మరో డాక్టరేట్‌ అందుకున్నారు. సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ పొందారు. పదివేల మందికి పైగా సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చి రెండు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సాధించారు. యూఎస్, యూకేల్లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోర్సులు చేశారు. బెంగళూరు ఐఐఎమ్‌ నుంచి ‘ఐ విల్‌’ కోర్సు చేశారు.

‘పెళ్లినాటికి నేను చదివింది బీఎస్సీనే. పై చదువులన్నీ పెళ్లి తర్వాతనే. పెళ్లి అనేది మహిళ అభివృద్ధికి దోహదం చేయాలి తప్ప, మహిళ ఎదుగుదలకు అవరోధం కాకూడదని, సంకల్ప బలం, భాగస్వామి సహకారం ఉంటే ఏదైనా సాధించగలమనే వాస్తవాన్ని సాటి మహిళలకు తెలియచెప్పడానికి ఇన్నేళ్లుగా నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మిసెస్‌ ఇండియా పోటీల్లో పాల్గొనడంలో ఉద్దేశం కూడా అదే. ఈ పోటీల్లో అరవైఏళ్లు నిండిన వయసు మహిళల విభాగం ‘సూపర్‌ క్లాసిక్‌’లో పాల్గొని ‘మిసెస్‌ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్‌’ విజేతనయ్యాను’’ అన్నారామె.   
 
ఉన్నది ఒకటే ఆప్షన్‌!
మిసెస్‌ ఇండియా పోటీల్లో భాగంగా ‘తెలంగాణ– ఆంధ్రప్రదేశ్‌’ సూపర్‌ క్లాసిక్‌ ఫైనల్స్‌ హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 24వ తేదీన జరిగాయి. ఎనిమిది నెలల నుంచి దశల వారీగా జరిగిన పోటీలవి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దాదాపు ఇరవై సెషన్స్‌ జరిగాయి. పోటీలో ఎవరెవరున్నారో కూడా తెలియదు. ఒక్కో సెషన్స్‌లో పాల్గొంటూ మాకిచ్చిన టాస్క్‌ను ఒక నిమిషం వీడియో ద్వారా ప్రెజెంట్‌ చేస్తూ వచ్చాం. ఈ పోటీల ద్వారా నాకు ఓ కొత్త ప్రపంచం గురించి తెలిసింది.

మేధోపరమైన జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, మానసిక పరిణతి– పరిపక్వత, సమయానుకూలంగా స్పందించడం, సమాజాన్ని అర్థం చేసుకునే కోణం వంటివన్నీ ఉన్నాయి. నా పోటీదారుల బలాలేమిటో నాకు తెలియదు. నాకున్న ఆయుధం ‘నేను గెలిచి తీరాలి’ అనే పట్టుదల మాత్రమే. పోటీల్లో పాల్గొనప్పుడు మనకుండేది గెలవాలనే ఆప్షన్‌ ఒక్కటే. ప్లాన్‌ బీ ఉండకూడదు. ఏ అవకాశాన్నీ తేలిగ్గా తీసుకోలేదు. ప్రతి రౌండ్‌లో ప్రజెంటేషన్స్‌ చాలా థియరిటికల్‌గా ఇచ్చాను. ఫైనల్‌ రౌండ్‌లో విజేతలను ప్రకటించేటప్పుడు కూడా ‘నేను రన్నర్‌ అప్‌ కాదు’ అనుకుంటూ ఆత్మస్థయిర్యంతో ఉండగలిగాను.  
 
ఇవే విజేతను చేశాయి!

మన సమాజంలో... అరవై ఏళ్లు వచ్చాయంటే ‘ఒక చోట కూర్చుని కృష్ణా! రామా! అనుకునే సమయం, అనే భావనను మహిళలు కూడా ఒంటబట్టించుకున్నారు. నిజానికి భగవంతుడిని తలుచుకోవడానికి వార్ధక్యం రానవసరం లేదు. నా దైనందిన జీవితంలో ఎప్పుడూ దైవపూజ కూడా ఒక భాగంగా ఉండేది. ఉదయం మూడున్నరకు రోజు మొదలయ్యేది. వంట, పూజ, ఇంటి పనులన్నీ ముగించుకుని ఏడున్నరకంతా స్కూల్లో ఉండేదాన్ని.

అప్పట్లో రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాల్సిన అవసరమే నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా నేను చెప్పేదేమిటంటే... అరవై నిండాయని మనతెలివితేటలు, అనుభవాలను అటకెక్కించాల్సిన అవసరం లేదు. కుటుంబం కోసం పని చేయాల్సిన అవసరం లేకపోతే సమాజం కోసం పని చేద్దాం. చిన్నప్పుడు మనకు తీరకుండా ఉండిపోయిన సరదాలను తీర్చుకుందాం. నాకు బొమ్మలేయడం ఇష్టం. ఇప్పుడు ప్రశాంతంగా బొమ్మలు వేసుకుంటున్నాను.   

మహిళలు సాధించలేనిది లేదు!
చంద్రయాన్‌ ప్రాజెక్టులో తమను తాము నిరూపించుకున్నా, రాకెట్‌తో సమానంగా దూసుకుపోతున్నా సరే మహిళలు సమానత్వ సాధన కోసం పోరాడాల్సిన దుస్థితి ఇంకా పోలేదు. మహిళలను అణచి వేసింది సమాజమే, ప్రోత్సహించాల్సింది కూడా సమాజమే. ప్రభుత్వాలు చట్టం చేసి సరిపుచ్చకుండా వాటి అమలుతోపాటు మహిళలకు ప్రోత్సాహం కల్పించాలి. ‘ఐ విల్‌’ కోర్సు చెప్పేది కూడా అదే. ప్రతి మహిళలో నాయకత్వ లక్షణాలు అంతర్లీనంగా ఉంటాయి. అవి బహిర్గతమయ్యే అవకాశం ఆమెకివ్వాలి.

నేను గమనించినంత వరకు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న మహిళలకు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బందులు ఉండడం లేదు. మధ్యతరగతి మహిళలు ఉన్నత చదువుల ఆకాంక్షను బ్యాంకు లోన్‌ల సహకారంతో సాధించుకుంటున్నారు. ఇక అల్పాదాయ వర్గాల మహిళలు మాత్రం ఎటువంటి అవకాశం లేక ఆశలను చిదిమేసుకుంటున్నారు. ఈ గ్యాప్‌ని స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రభుత్వాలు భర్తీ చేయగలిగితే వారి జీవితాలు కూడా కాంతులీనుతాయి. నా వంతుగా మహిళలను చైతన్యవంతం చేయడానికి ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నాను’’ అన్నారామె పరిపూర్ణంగా నవ్వుతూ.

ప్రతి రోజూ అమూల్యమే!
సౌందర్యమంటే బాహ్యసౌందర్యమే అయితే నా ఎత్తు, నా మేనిఛాయ అందాల పోటీలకు సరిపోవు. ప్రకటన చూసిన వెంటనే ఫోన్‌ చేసి మాట్లాడాను. ‘బ్యూటీ’ అనే పదం పరిధిని విస్తరించడంతోపాటు బ్యూటీ అంటే దేహసౌందర్యమనే అపోహను తొలగించడం, అందం అంటే కొలతలకు లోబడి ఉండడం కాదని తెలియచేయడంతోపాటు ‘ఇన్నర్‌ బ్యూటీ’ ప్రాధాన్యతను సమాజానికి తెలియచెప్పడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళ జీవితం పెళ్లికి ముందు – పెళ్లి తర్వాత అనే వర్గీకరణ చట్రంలో ఉండిపోతోంది. ఆ చట్రంలో ఉండిపోయిన చాలామంది మహిళల్లో తమను తాము కోల్పోయిన భావన కలుగుతుంటుంది. మన జీవితంలో ప్రతిరోజూ అమూల్యమైనదేనని మహిళలకు తెలియచెప్పడానికి నేను ఈ పోటీలో పాల్గొన్నాను.
– డాక్టర్‌ విజయ శారదారెడ్డి
మిసెస్‌ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్‌

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి
ఫొటోలు: నోముల రాజేశ్‌ రెడ్డి

మరిన్ని వార్తలు