గైనిక్ కౌన్సెలింగ్

28 May, 2015 23:05 IST|Sakshi

నా వయసు 30. నాకు ఇద్దరు పిల్లలు. ఒకరికి ఏడేళ్లు. మరొకరికి ఐదేళ్లు. రెండూ మామూలు కాన్పులే. పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమీ చేయించుకున్నాను. పీరియడ్స్ నెలనెలా కరెక్ట్‌గా వస్తాయి. కానీ బ్లీడింగ్ ఒకరోజు మాత్రమే అవుతుంది. నా సమస్య ఏమిటంటే... నాకు నెల రోజుల నుంచి రొమ్ముల నుంచి కొంచెం నీరులాగా వస్తోంది. రొమ్ములో కంతులు, నొప్పి లాంటివి ఏవీ లేవు. ఇది క్యాన్సర్ లక్షణమేమోనని భయంగా ఉంది. తగిన పరిష్కారం చెప్పండి.
 - సత్యవతి, తెనాలి


 రొమ్ము నుంచి నీరు రావడానికి చాలా కారణాలుంటాయి. అంతేగానీ క్యాన్సర్ ఒక్కటే కాదు. మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంటే, మెదడులో ఏమైనా కంతుల వల్లగానీ, హైపోథైరా యిడిజమ్ వల్లగానీ, ఎక్కువ మానసిక ఒత్తిడి ఉండటం వల్లగానీ, లోదుస్తులు బాగా బిగుతుగా వేసుకోవడం వల్ల, రొమ్ములో కంతులు ఉన్నా లేదా యాంటీ డిప్రె సెంట్ మందులు వాడటం, మరికొన్ని రకాల మందులు చాలాకాలంగా వాడుతూ ఉండటం, ఆఖరుగా మీరు చెప్పినట్లుగా రొమ్ము క్యాన్సర్‌తో పాటు ఇంకా ఎన్నో ఇతర కారణాల వల్ల కూడా రొమ్ము నుంచి నీరులాగా, పాలలాగా స్రావాలు వస్తుంటాయి. ఈ కండిషన్‌ను గెలాక్టోరియా అంటారు. మీరు అనవసరంగా భయపడ కుండా డాక్టర్‌ను కలిసి తగిన పరీక్షలు చేయించుకుని, అలా జరగడానికి అసలు కారణం తెలుసుకోండి. రొమ్ము పరీక్ష చేయించుకున్నప్పుడు ఏవైనా గడ్డలుగానీ, ఇన్ఫెక్షన్ గానీ ఉన్నాయా అని చూసి, అవసరమైతేనే రొమ్ము స్కానింగ్, మామోగ్రఫీ ప్రొలాక్టిన్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, సీబీపీ, ఈఎస్‌ఆర్ వంటి పరీక్షలు చేయించు కోండి. మీకు ఉన్న సమస్యకు కారణాన్ని తెలుసుకుని, దాన్ని బట్టి చికిత్స చేస్తారు.

ఏవైనా మందులను దీర్ఘకాలికంగా వాడుతుండటం వల్ల ఇలా జరుగుతు న్నట్లు తేలితే... అవసరమైతే వాటిని ఆపడం లేదా మార్చడం వల్ల కూడా ఉపయోగం ఉండవచ్చు. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. లోదుస్తులు కొంచెం వదులుగా వేసుకోవడం కూడా మేలు. మీకు మీరే అన్నీ ఊహించు కోకుండా ఒకసారి మీ ఫ్యామిలీ ఫిజీషియన్‌ను సంప్రదించండి.
 
 డాక్టర్ వేనాటి శోభ
 సీనియర్ గైనకాలజిస్ట్
 లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్
 

మరిన్ని వార్తలు