రికార్డు చీర.. తెచ్చింది పెద్ద తంటా!

25 Sep, 2017 13:55 IST|Sakshi

రికార్డు పొడవైన చీరను ధరించానని నవ వధువు మురిసిపోయింది. అంగరంగ వైభవంగా వివాహం జరిగిందని ఇరు కుటుంబాల సభ్యులు సంతోషంగా ఉన్నారు. అయితే ఆ రికార్డు చీరే ఓ నవ దంపతులకు చిక్కులు తెచ్చిపెట్టింది. అంతపెద్ద చీరను విద్యార్థినులు మండుటెండలో పట్టుకుని నిల్చోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దంపతులతో పాటు ఇందుకు కారకులైన కొందరిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ వివాదాస్పద వివాహం శ్రీలంకలోని కాండీలో జరిగింది.పెళ్లిలో నవ వధువు 3.2 కిలోమీటర్ల చీర ధరించి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.

అయితే ఆ చీరను పట్టుకుని వధువుకు సాయం చేసేందుకు ఓ స్కూలుకు చెందిన 250 మంది విద్యార్థి నులు మండుటెండలో నిలబడ్డారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. నేషనల్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (ఎన్‌సీపీఏ) అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఎన్‌సీపీఏ చైర్మన్‌ మారిని డే లివేరా మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, పిల్లలు, విద్యార్థులను ఇలాంటి పనులకు వాడుకోవడం తప్పన్నారు. విద్యార్థులను ఇలా కష్టాలకు గురిచేసే వారికి దాదాపు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఈ వివాహానికి ప్రత్యేక అతిథిగా హాజరైన సందర్భంగా సెంట్రల్‌ ప్రావిన్స్‌ సీఎం శరత్‌ ఎకనాయక మాట్లాడుతూ.. శ్రీలంకలో ఓ వధువు ధరించిన అతిపెద్ద చీర ఇదేనంటూ కితాబివ్వడం విమర్శలకు కేంద్ర బిందువైంది.

మరిన్ని వార్తలు