సంకల్ప బలం

3 May, 2018 23:50 IST|Sakshi

‘గోదావరీ నదీజలాలు పుష్కలంగా ఇక్కడి ప్రజల కాళ్ల కిందినించి పారుతూ వెళ్లి వృథాగా సముద్రం పాలవుతుండగా, వీరు కరువుకాటకాలబారిన పడకుండా చూడడానికి.. వాటిని అలా వదిలివెయ్యడంలో తగిన ఔచిత్యం కనిపించడం లేదు’....అని ఆర్థ్ధర్‌ కాటన్‌ అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ‘అయితే నువ్వు ఆనకట్ట కట్టి నీటిని నిల్వచేసి కొన్ని వేల ఎకరాలు సాగు కావడానికి కారణం కాగలవా ?’ అని జవాబు ప్రశ్నగా వచ్చింది. అంతే.

ఆయన గుర్రం వేసుకుని అరణ్యాల వెంట తిరిగి గోదావరి ప్రవాహ ప్రాంతమంతా పరిశీలించి ప్రాజెక్ట్‌ ఎక్కడ కడితే పదికాలాల పాటు నిలబడుతుందన్నది సర్వేచేసి చివరకు కొండలమధ్యనున్న ధవళేశ్వరం వద్ద అయితే బాగుంటుందని ఎంపిక చేశారు. కాటన్‌ ఈ దేశంలో ఉన్నన్నాళ్లూ కష్టపడి ప్రాజెక్ట్‌ పూర్తిచేసి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కావడానికి కారణమయ్యాడు. ఒకదశలో ఆయన ఒక సంవత్సరంపాటు తీవ్రంగా అనారోగ్యం పాలయి, చివరకు ప్రాణాపాయంలో కూడా పడ్డాడు.

కొద్దిగా కోలుకోగానే మళ్లీ వచ్చి ప్రాజెక్ట్‌ పని పూర్తి చేశాడు. అందులోంచి నీళ్లు రైతుల పొలాలకు పారుతుంటే చూసి పొంగిపోయాడు. ఎక్కడివాడు! ఈ దేశంవాడా! ఈ జిల్లావాడా! ఈ ధర్మం వాడా! ఒక్క లేఖ రాసినందుకు ప్రభుత్వం ‘నీవు చెయ్యగలవా ?’ అని.. ‘చెయ్యగలను’ అంటూ నిలబడడమే కాదు, ప్రాజెక్ట్‌ కట్టే సందర్భంలో వ్యక్తిగతంగానే కాదు, ఆరోగ్యపరంగానే కాదు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అన్నింటినీ  తట్టుకుని నిలబడ్డాడు. అంత గొప్ప ఆనకట్ట కట్టాడు. చరిత్రలోనే కాదు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండి పోయాడు. ఒక సంకల్పానికి నిలబడడం అంటే అదీ.

>
మరిన్ని వార్తలు