కాపాడడం కనీస ధర్మం

23 Dec, 2017 00:04 IST|Sakshi

మోసం చేసేవాళ్లు నమ్మకంగా మాట్లాడతారు. మాటకే తేనె పూసి తియ్యటి కబుర్లు చెబుతారు. ఒక కొంగ ఉండేది. ఆహారం కోసం బాగా చేపలున్న కొలను వెతుక్కుని అక్కడకు వెళ్లింది. చేపల్ని మచ్చిక చేసుకుంది.  ‘‘ఈ కొలనులో నీళ్లు ఎండిపోతున్నాయి. మిమ్మల్ని నీళ్లు సమృద్ధిగా ఉన్న కొలనుకి తీసుకెళ్తాను’’ అని చెప్పింది. కొంగ చెప్పిన మాటలను విశ్వసించాయి చేపలు. ప్రతిరోజూ కొంగ కొన్ని  చేపలను ముక్కున కరచుకొని కొండ మీదకు తీసుకువెళ్లి, కడుపునిండా తినడం మొదలుపెట్టింది.

కొన్నాళ్లకి కొలనులో చేపలు అయిపోయాయి. మరుసటి రోజు పీతను తీసుకువెళ్లడానికి నిశ్చయించుకుంది. అయితే కొంగ నోటికి పీత సరిగా ఇమడలేదు. అందువల్ల తన మెడను పట్టుకోమని చెప్పింది కొంగ. పీత.. కొంగ మెడను గట్టిగా పట్టుకుంది. కొంతదూరం వెళ్లేసరికి, చేపల అవశేషాలు గమనించి, కొంగ చే స్తున్న మోసం గ్రహించింది పీత. ఆలస్యం చేయకుండా కొంగ మెడను గట్టిగా కరచి పట్టుకుంది. కొద్దిసేపటికి కొంగ చచ్చిపోయింది. తియ్యటి మాటలకు లొంగకూడదని పీత అర్థం చేసుకుంది.

అంతేకాదు, మోసం గ్రహించగానే మోసకారులకు బుద్ధి చెప్పాలని తన స్నేహితులకు చెప్పింది. మనలో కూడా చాలామంది మోసాన్ని గ్రహిస్తారు. కానీ ఆ మోసం గురించి మిగతావాళ్లను హెచ్చరించరు. ‘మనం బయటపడ్డాం కదా చాలు’ అనుకుంటారు. అది తప్పు. అమాయకులను కాపాడడం వివేకవంతుల కనీస ధర్మం.

మరిన్ని వార్తలు