ఈ కష్టాలకు పరిష్కారం?

28 Jan, 2018 01:48 IST|Sakshi

మానవ పుట్టుక ప్రారంభమైన నాటినుండి నేటివరకు ఎంతోమంది దైవప్రవక్తలు, రుషులు మానవ సమాజాన్ని ఉధ్ధరించడానికి వచ్చారు. మంచీ చెడుల విచక్షణా జ్ఞానాన్ని, దైవమార్గాన్ని మానవాళికి విడమరచి చెప్పారు. చెడులు చేస్తే, పాపపు పనులకు ఒడిగడితే దైవం వివిధ రూపాల్లో శిక్షను అవతరింపజేస్తాడని హెచ్చరించారు. అయినా ప్రజలు మంచి చెప్పినవారి మాటల్ని పట్టించుకోలేదు. దైవం వారిపై శిక్షను అవతరింజేశాడు. ఒకసారి మదీనాలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. భయంకరమైన కరువు వచ్చిపడింది. అప్పుడు, అప్పటి ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ (ర) వర్షం కోసం దైవాన్ని ప్రార్ధించే బదులు, పాప క్షమాపణకైదైవాన్ని వేడుకున్నారు.

దీంతో ప్రజలు, ‘మీరసలు వర్షం కోసం దుఆ చేయనేలేదు’. అని నిందించారు, దానికాయన ‘నేను ఆకాశం నుండి వర్షం కురిసే తలుపులు తట్టాను. ఇంతకన్నా ఇంకేం కావాలి?’ అని సమాధానం చెప్పారు. ప్రఖ్యాత దైవ భక్తుడు హజ్రత్‌ హసన్‌ బస్రీ(రహ్మ) దగ్గరికి ఒకతను వచ్చి, తమప్రాంతంలో కరువొచ్చిందని చెప్పాడు. దానికాయన, పాప మన్నింపుకైదైవాన్ని వేడుకోండి. అని చెప్పారు. కాసేపటికి మరొకతను వచ్చి తమ ప్రాంతంలో దారిద్య్రం తాండవిస్తోందని చెప్పాడు. ఇలా మరి కొం దరు వచ్చి తలా ఒక సమస్య చెప్పుకున్నారు. హ.హసన్‌ బస్రీ (ర) అందరికీ ఒకటే పరిష్కారం చెబుతూ, ‘పాపాల మన్నింపుకైదైవాన్ని వేడుకోండి’ అని సలహా ఇచ్చారు.

అంటే, మానవ జీవితంలో ఒడిదుడుకులు సహజం. కాని కొన్ని స్వయానా మనం కొని తెచ్చుకునేవీ ఉంటాయి. దైవం మానవుణ్ని సృష్టించి, ఈ పృష్టిలో మరే జీవరాసికీ లేనంత బుధ్ధిబలాన్ని, మంచీచెడుల విచక్షణా జ్ఞానాన్నీ, అపారమైన మేధో సంపత్తినీ ప్రసాదించాడు. మానవుడు దాన్ని దుర్వినియోగం చేస్తూ, దైవాదేశాలకు విరుధ్ధంగా మనోవాంఛా లోలుడై జీవనం సాగిస్తున్నాడు. ప్రకృతిని ఇష్టమొచ్చినట్లు వినాశనానికి గురిచేస్తున్నాడు. అందుకే ఈ ఆపదలూ, కష్టాలూ, ప్రకృతి వైపరీత్యాలు.

అతివృష్టీ, అనావృష్టి పరిస్థితులు. ఇది దైవం మానవులకు చేసే ఒకహెచ్చరిక. మానవులకు నష్టం చేయాలన్నది దేవుని తలంపుకాదు. కానీ ఇదొక హెచ్చరిక..జాగ్రత్త.. మేలుకోండి. లేకపోతే అంతకంత అనుభవిస్తారు.. అన్న హెచ్చరిక. మానవుడు విషయాన్ని అర్థం చేసుకొని నడవడికను సరిదిద్దుకుంటే, దైవాదేశాల ప్రకారం నడుచుకుంటూ సమస్త సృష్టినీ ప్రేమించ గలిగితే దైవం వారితప్పుల్ని మన్నించి మంచి పరిస్థితుల్ని కల్పిస్తాడు.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు