నీ ఆలోచనలే నువ్వు

23 Apr, 2017 00:54 IST|Sakshi
నీ ఆలోచనలే నువ్వు

‘‘స్వామీ! నా మనసు బాగులేదు. ఏదైనా వైద్యం ఉంటే చేయరా ...’’ అని తన ముందు తలవంచుకుని నిల్చున్న వ్యక్తిని చూసి ఓ చిన్న నవ్వు నవ్వాడు జెన్‌ సాధువు. ‘‘నువ్వు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు. నిజానికి నీకు ఎలాంటి సమస్యా లేదు... నీకు ఏ మందూ అక్కరలేదు...’’ అన్నారు.

‘‘అలా అనకండి... నా మీద దయ ఉంచి సహాయం చేయండి. లేకుంటే ఏ స్థితికి లోనైపోతానో తలచుకుంటేనే భయమేస్తోంది...’’ అన్నాడు ఆ వ్యక్తి.

‘‘సరే! నేను నీకు ఓ మందు ఇస్తాను...
కానీ ఓ షరతు... నువ్వు ఈ మందు వేసుకునేటప్పుడు మామిడి పండు గురించి ఆలోచించకూడదు.. సరేనా’’ అన్నారు సాధువు.
‘‘అలాగే’’ అంటూ గురువుగారి నుంచి ఆయన ఇచ్చిన మందు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడతను.
మరుసటిరోజు ఉదయం, స్నానం చేసి మందు వేసుకోవడానికి కూర్చున్నాడు. ఆ క్షణమే అతనికి మామిడి పండు గురించి జ్ఞాపకం వచ్చింది. అతని మనసంతా మామిడి పళ్ళతో నిండిపోయింది.
‘‘ఏమిటిది?’’ అనుకున్న అతను అర గంట తర్వాత మళ్ళీ మందు వేసుకోవడానికి ఓ మూల కూర్చున్నాడు.
మళ్ళీ ఇందాకలాగే అతనికి మామిడి పండు గుర్తుకు వచ్చింది. ఆరోజు అతను ఎన్నిసార్లు ప్రయత్నించినా మామిడి పళ్ళు గుర్తుకు రావడంతో మందు వేసుకోలేక పోయాడు.
ఇక లాభం లేదనుకుని అతను ఆ రోజు సాయంత్రం గురువు దగ్గరకు వెళ్ళాడు.
ఆయనకు నమస్కరించి ‘‘మీరు ఇచ్చిన మందు వేసుకోవడం నా వల్ల కాలేదు... ఎన్నిసార్లు ప్రయత్నించినా మామిడిపళ్ళు గుర్తుకు వస్తూనే ఉన్నాయి...’’ అన్నాడు బాధగా.
‘‘అవును... ఎందుకు మామిడి పండు జ్ఞాపకానికి రాకుండా ఉంటుంది. నేను నీకిచ్చింది మామిడి పండు రసమే... ఆ వాసన వస్తుంటే నీకు మామిడి పండు గుర్తుకు రాకుండా ఉంటుందా... మామిడిపండు గుర్తుకు వచ్చే తీరుతుంది...’’ అని నవ్వుతూ సాధువు మళ్ళీ ఇలా అన్నారు – ‘‘నువ్వు దేని గురించి ఆలోచిస్తావో అది నీ మనసులో మెదులుతూనే ఉంటుంది.

నీకు బుద్ధి పని చేయడం లేదని పదే పదే అనుకుంటే నీకు బుద్ధి లేదనే అనిపిస్తుంది. అలా కాకుండా నీ బుద్ధి బాగానే ఉంది అనుకుంటే నీ బుద్ధి సవ్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది... నువ్వు ఏది అనుకుంటే అదే నిజం... కనుక నువ్వు ఇప్పుడు ఏమనుకుంటావో ఆలోచించు... నీ ఇష్టం’’ అని అనడంతో అతను తన వాస్తవ స్థితిని తెలుసుకున్నాడు. తనకేమీ అనారోగ్యం లేదని అనుకుని గురువుకు దణ్ణం పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు.

మరిన్ని వార్తలు