-

నయా దోపిడీ: సాధువు వేషంలో పాములను మనుషులపైకి వదులుతూ..

22 Aug, 2023 08:38 IST|Sakshi

రోజూ మాదిరిగానే ఆమె తన అత్యవసర పనుల కోసం బయటకు వచ్చింది. నగరంలోని రోడ్లు బిజీగా ఉన్నాయి. ఎంతో కష్టమీద ఆమెకు ఆటో దొరికింది. ఆమె ఆటోలో కూర్చుంది. ట్రాఫిక్‌ అధికంగా ఉన్న కారణంగా ఆటో మెల్లగా ముందుకు కదులుతోంది. ఇంతలో ఆమెకు రోడ్డుపై కాషాయవస్త్రాలు ధరించిన ఇద్దరు సాధువులు కనిపించారు. వారిద్దరూ ఆమె ప్రయాణిస్తున్న ఆటో దగ్గరకు వచ్చి.. ‘అమ్మా దానం చేయండి.. మీకు మేలు జరుగుతుంది’ అని అన్నారు. 

ఆమె ఆ సాధువులను చూసి, తన హ్యాండ్‌ బ్యాగ్‌ తెరిచి, కొంత డబ్బు ఇవ్వాలనుకుంది. అయితే ఇంతలో వారు తమ దగ్గరున్న జోలెలో నుంచి ఒక పామును బయటకు తీశారు. ఆ పామును ఆ మహిళ ముఖం దగ్గరకు తీసుకువచ్చారు. పామును చూడగానే ఆమె హడలెత్తిపోయింది. గట్టిగా కేకలు వేయడం ‍ప్రారంభించింది. దీనిని గమనించిన ఆ సాధువులు ఆమె హ్యాండ్‌ బ్యాగ్‌ లాక్కున్నారు. దానిలో రూ. 2000 ఉన్నాయి. ‘భగవంతుడు మీకు మేలు చేస్తాడు’ అంటూ ఆ బ్యాగుతో సహా అక్కడి నుంచి పరారయ్యారు. 

ఈ తరహా మోసాలకు పాల్పడే గ్యాంగ్‌ ఢిల్లీలో ఉంటూ గురుగ్రామ్‌లో జనాలను లూటీ చేస్తోంది. ఈ గ్యాంగ్‌లోని వ్యక్తులు సాధువుల వేషం ధరించి, జనానికి ఉండే భక్తి సెంటిమెంట్‌ను సద్వినియోగం  చేసుకుంటూ, మోసాలకు పాల్పడుతున్నారు. బైక్‌, కారు, బస్సులలో ప్రయాణిస్తున్నవారిని ఈ గ్యాంగ్‌ టార్గెట్‌ చేసుకుంటోంది. వీరు ముందుగా జనాలను డబ్బులు అడుగుతారు. ఎదుటివారు పర్సు తీయగానే వారిపైకి పామును వదులుతారు. వారు భయపడగానే వారి దగ్గరున్న సొమ్ము లాక్కుని పాముతో సహా పారిపోతుంటారు.  

కొద్ది రోజుల క్రితం గుర్‌గ్రామ్‌కుచెందిన రాధావాణి అనే మహిళ తనకు జరిగిన ఈ విధమైన మోసం గురించి సెక్టార్‌-52 పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాబాల వేషంలో తన దగ్గర నుంచి రూ.2000 లాక్కున్నారని ఆమె ఆ ఫిర్యాదులో తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆ మోసగాళ్లను పట్టుకున్నారు. 
ఇది కూడా చదవండి: చీకటి సొరంగమా?.. దట్టమైన అడవా?.. అబ్బురపరుస్తున్న వీడియో!

మరిన్ని వార్తలు