ఇదు శ్రీలంక: చుక్‌ చుక్‌ చుక్‌... నాను వోయా టూ ఎల్లా !

15 Nov, 2023 13:04 IST|Sakshi

శ్రీలంకకు వాయుమార్గం, జలమార్గాల్లో వెళ్లవచ్చు. అక్కడి రోడ్లు నల్లగా నున్నగా మెరుస్తూ ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ద్రవ్యోల్బణంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన దేశ ఇదేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. విమాన ప్రయాణం, పడవ ప్రయాణం, రోడ్డు ప్రయాణం తర్వాత మిగిలింది రైలు ప్రయాణమే. శ్రీలంక ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే ట్రైన్‌లో ప్రయాణించాల్సిందే. గంటకు పాతిక కిమీమీటర్ల వేగంతో ప్రయాణించే టాయ్‌ ట్రైన్‌ జర్నీ ఆద్యతం అలరించడమే కాదు, ఆ దారిలో వచ్చే చిన్న చిన్న గ్రామాలు స్థానికుల సౌకర్యాలతో కూడిన నిరాడంబరమైన జీవనశైలిని కళ్లకు కడుతుంది. బౌద్ధ ప్రాశస్త్య్రాల పర్యటనలో భాగంగా తెలంగాణ నుంచి వెళ్లిన మా మహిళా విలేకరులమందరం ‘నాను వోయా’లో టాయ్‌ ట్రైన్‌ ఎక్కాం.

పిల్లలతో ప్రయాణం
టాయ్‌ ట్రైన్‌లో ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌లకు డిమాండ్‌ ఎక్కువ. ముందుగా రిజర్వ్‌ చేసుకోవాలి. మిగతా తరగతులు కూడా రద్దీగా ఉంటాయి. మేము వెళ్లిన రోజు ఒక స్కూల్‌ నుంచి దాదాపుగా డెబ్బై మంది పిల్లలు మాతో ప్రయాణించారు. వాళ్లు జురాసిక్‌ పార్క్‌ సినిమా చూడడానికి వెళ్తున్నారు. ‘ఎల్లా’ కంటే ముందు ఒక స్టేషన్‌లో దిగేశారు. ఆ పిల్లల పేర్లన్నీ భారతీయతతో ముడిపడినవే. సంస్కృత ద్రవిడ సమ్మేళనంగా ఉన్నాయి. అయితే నకారాంతాలుగా లేవు, అన్నీ అకారాంతాలే. పిల్లల స్కూల్‌ డ్రస్‌ మీద వాళ్ల పేర్లు కూడా ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి. వాటిని మనసులో చదువుకుని పైకి పలుకుతుంటే ఏదో సొగసుదనం ఉంది. పిల్లలు చక్కటి ఇంగ్లిష్‌ మాట్లాడుతున్నారు. రైలు ప్రయాణించే దారిలో వచ్చే స్టేషన్‌ల పేర్లను మేము తడుముకుంటూ చదువుతుంటే మా ఉచ్చారణను సరిదిద్దుతూ మా ప్రయాణానికి మరింత సంతోషాన్నద్దారా పిల్లలు.

మబ్బుల్లో విహారం
నాను వోయా స్టేషన్‌ క్యాండీ నగరానికి 70 కిమీల దూరంలో, నువారా ఎలియాకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిల్‌స్టేషన్‌ల మధ్య సాగే ప్రయాణం అది. దట్టంగా విస్తరించిన అడవుల మధ్య టక్‌టక్‌మని శబ్దం చేస్తూ వెళ్తుంది రైలు. ఆకాశాన్ని తాకడానికి పోటీ పడి పెరిగినట్లున్న వృక్షాల తలలను చూడడానికి తల వంచిన కిటికీలో నుంచి పైకి చూసే ప్రయత్నం అయితే చేస్తాం, కానీ మనకు మొదళ్లు కనిపించిన వృక్షాల తలలను చూడలేం. లోయలో నుంచి పెరిగి వచ్చిన వృక్షాల తలలను మాత్రమే చూడగలం. పచ్చటి ప్రకృతి చిత్రం చూస్తూ ఉండగానే మసకబారుతుంది. ఏంటా అని పరికించి చూస్తే మందపాటి మబ్బు ప్రయాణిస్తూ ఉంటుంది. రైలును తాకుతూ వెళ్లే మబ్బు కిటికీ లో నుంచి దూరి మనల్ని చల్లగా తాకి పలకరిస్తుంది. ఈ దారిలో కొండల మధ్య జలపాతాలు కూడా ఎక్కువే. జలపాతం సవ్వడి వినిపించనంత దూరంలో కనువిందు చేస్తుంటాయి.

హాయ్‌ హాయ్‌గా...
రైలు అర్ధచంద్రాకారపు మలుపుల్లో ప్రయాణించేటప్పుడు కిటికీలో నుంచి బయటకు చూస్తే లెక్కలేనన్ని చేతులు స్మార్ట్‌ ఫోన్‌లు, హ్యాండీకామ్‌లతో ఫొటో షూట్‌ చేస్తూ కనిపిస్తాయి. ఈ రైల్లో స్థానికులు వారి అవసరార్థం ప్రయాణిస్తారు. పర్యాటకులు ప్రకృతి పరవశం కోసమే ప్రయాణిస్తారు. ప్రతి విషయాన్ని స్వయంగా ఎక్స్‌పీరియన్స్‌ చేయాలనే పాశ్చాత్య పర్యాటకులు ఈ రైల్లో ఎక్కువగా కనిపిస్తారు. వాళ్లు ముందుగానే ఫస్ట్‌ క్లాస్‌లో బుక్‌ చేసుకుంటారు. కొండలను కలుపుతూ వేసిన వంతెనలు, కొండను తొలిచిన సొరంగాల మధ్య సాగే ఈ ప్రయాణం మన తెలుగు రాష్ట్రంలో విశాఖ– అరకు ప్రయాణాన్ని, ఊటీ టాయ్‌ ట్రైన్‌ జర్నీని తలపిస్తుంది.

బ్రిటిష్‌ పాలకులు నిర్మించిన రైలు మార్గం ఇది. అప్పటి నుంచి నిరంతరాయంగా నడుస్తూనే ఉంది. పర్యాటకులు త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరపాటులో చేసే ప్రయాణం కాదిది. దృష్టి మరలిస్తే చూడాల్సిన వాటిలో ఏం మిస్సవుతామోనన్నంత ఉత్సుకతతో సాగే ప్రయాణం. మన స్టేషన్‌ త్వరగా రావాలని కూడా ఉండదు. రైల్లో ఒక బోగీలో వాళ్లకు మరో బోగీలో ఉన్న వాళ్లు ‘హాయ్‌’ చెప్పుకుంటూ చిన్న పిల్లల్లా కేరింతలు కొడుతూ ప్రయాణిస్తారు.
– వాకా మంజులారెడ్డి

(చదవండి: ఇదు శ్రీలంక: రావణ్‌ ఫాల్స్‌... ఎల్లా!)

మరిన్ని వార్తలు