రెండు బాపులు

27 Aug, 2018 00:21 IST|Sakshi

సాహిత్య మరమరాలు

డాక్టర్‌ వివేకానందమూర్తి లండన్‌లో డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తారు. ఆయన యాక్టరు, రైటరు, మిమిక్రీ ఆర్టిస్టు కూడా. ఆయనంటే బాపు రమణలకు ‘పిచ్చిష్టం’.

ఆయనోసారి మద్రాసులో ఓ హోటల్‌లో దిగి బాపుగారికి ఫోన్‌ చేసి, ‘‘రాత్రి తొమ్మిది పది మధ్యలో మిమ్మల్ని చూడ్డానికి వస్తా! ఏడింటికి ఓ పార్టీ ఉంది’’ అన్నారు.

‘‘ఎందుకండీ అంత రాత్రివేళ... పార్టీ తర్వాత? రేపు రావచ్చు కదా!’’ అన్నారు బాపు.

‘‘లేదండీ, రావాల్సిందే. మిమ్మల్ని ఇవ్వాళ చూడాల్సిందే’’ అన్నారు ‘వివేకం’ ఖండితంగా.

‘‘కాదండీ.. రేపు ఉదయం...’’

‘‘లేదండీ మీ ఇంటికి దారి చెప్పండి. పార్టీ కాగానే వచ్చి వాల్తా!’’

‘‘సరే అయితే. అడయార్‌ వైపు వస్తూంటే రెండు బ్రిడ్జీలు వస్తాయి. ఏదో ఒక బ్రిడ్జి క్రాస్‌ చెయ్యండి. తర్వాత రెండు లెఫ్ట్‌లు వస్తాయి. ఏదో ఒక లెఫ్ట్‌ తీసుకోండి. ముందుకొస్తే రెండు గుడిగోపురాలు కనిపిస్తాయి. అవి దాటగానే రెండు లైటు స్తంభాలూ, రెండు పచ్చగేట్లూ కనిపిస్తాయి. ఏదో ఒక గేటులోంచి ఏదో ఒక ఇంట్లోకి రండి! అక్కడ మీ కోసం రెండు బాపులు ఎదురుచూస్తూ ఉంటాయి!’’ అని ఫోన్‌ పెట్టేశారు బాపు.
(ఆగస్టు 31బాపు వర్ధంతి)

-సౌజన్యం: శ్రీ ఛానెల్‌

(మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.)

మరిన్ని వార్తలు