గుండె ఆపరేషన్‌ చేయాల్సిన పరిస్థితి రాకూడదంటే...? 

11 Jul, 2018 01:00 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

కార్డియాలజీ కౌన్సెలింగ్‌

నా వయసు 52 ఏళ్లు. ఇటీవల నాకు గుండెకు రక్తం పరఫరా చేసే ధమనుల్లో బ్లాక్స్‌ ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. మందులతోనే చక్కదిద్దవచ్చని (మెడికల్లీ మేనేజబుల్‌) అన్నారు. నేను కూడా  డాక్టర్లు చెప్పినట్టే మందులు వాడాలని నిర్ణయించుకున్నాను. వీటిని కొద్దికాలం వాడితే సరిపోతుందా? జీవితాంతం వాడాలా? ఇవి వాడుతున్నా భవిష్యత్తులో ఎప్పుడైనా సర్జరీ చేయించాల్సిన అవసరం వస్తుందా? నాకు సర్జరీ అంటే చాలా భయం. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి?  – డి. పూర్ణచంద్రరావు, జమ్మలమడుగు  
మీకు గుండెజబ్బు ఉండి, రక్తనాళాల్లో బ్లాక్స్‌ ఉన్నప్పటికీ కేవలం మందులు వాడితే సరిపోతుం దని డాక్టర్లు చెప్పారంటే ఆ బ్లాక్స్‌ అంత ఎక్కువగా లేవనీ అర్థం.  లేదా పెద్ద రక్తనాళాలు అన్నీ బాగానే ఉండి గుండెకు రక్తసరఫరా చేసే చిన్న రక్తనాళాల్లో మాత్రమే బ్లాక్స్‌ ఉన్నాయని అనుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇదేకాకుండా భవిష్యత్తులో జబ్బు పెరగకుండా ఆహార, వ్యాయామ నియమాలు పాటిస్తూ... ఆస్పిరిన్, స్టాటిన్స్‌ వంటి మందులు వాడుతూ ఉంటే జబ్బు పెరిగి ఆపరేషన్‌ అవసరం పడాల్సిరావడానికి అవకాశాలు చాలా తక్కువ. కానీ ఆహార, వ్యాయామ నియమాలు పాటించకుండా, మందులు వాడటంలో నిర్లక్ష్యంగా ఉండి అశ్రద్ధ చేస్తూ ఉంటే జబ్బు పెరిగే అవకాశం ఎక్కువ. కాబట్టి అస్తమానం ఆపరేషన్‌ గురించి ఆలోచిస్తూ ఆందోళనపడకుండా ఉండండి. యోగా, వాకింగ్‌ వంటివి చేస్తూ పైన పేర్కొన్న మందులు తీసుకుంటూ నిర్భయంగా ఉండండి. ఒకవేళ ఇదంతా చేసినా కూడా జబ్బు పెరిగి ఆపరేషన్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటే నిర్భయంగా, నిశ్చింతగా సర్జరీ చేయించుకోండి. ఇప్పుడు తక్కువగాటుతో లేదా ఒక్కోసారి అదీ లేకుండా యాంజియోప్లాస్టీ స్టెంటింగ్‌ చేయించుకుని పూర్తిగా నార్మల్‌ జీవితాన్ని గడిపే అవకాశాలున్నాయి

గుండెజబ్బుల నివారణ ఎలా?
నా వయసు 46 ఏళ్లు. భవిష్యత్తులో గుండెజబ్బులు వస్తాయేమో అని ఆందోళనగా ఉంది. గుండెజబ్బు లను నివారించడానికి ఎలాంటి వ్యాయామాలు మంచివో సూచించండి. 
– ఎస్‌.వి. రమణప్రసాద్, కాకినాడ 

ఆరోగ్యాన్ని కాపాడుకుందుకు, గుండెపోటును నివారించడానికి ఏ వ్యాయామాలైనా మంచివే. అయితే బరువులు ఎత్తుతూ చేసేవి, బాడీబిల్డింగ్‌ కోసం చేసేవాటి కంటే వాకింగ్, యోగా లాంటివి మీ వయసువారికి మరింత మంచిది. క్రమం తప్పకుండా రోజూ 3 నుంచి 4 కి.మీ వాకింగ్‌ చేయడం, అలా వారంలో ఐదు రోజులు చేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్‌ పాళ్లు పెరిగి, చెడు కొలెస్ట్రాల్‌ తగ్గే అవకాశాలుం టాయి. దాంతో పాటు గుండె పోటు, పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలను కూడా ఈ వ్యాయామాలు తగ్గిస్తాయి. 
డాక్టర్‌ అనూజ్‌ కపాడియా, 
ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్,  కేర్‌ హాస్పిటల్స్
బంజారాహిల్స్, హైదరాబాద్‌  

మరిన్ని వార్తలు