నీకన్నా నేనే ఎక్కువ ఇస్తున్నా...  నన్నెందుకు అసహ్యించుకుంటున్నారు!?

14 May, 2019 00:00 IST|Sakshi

చెట్టు నీడ 

ఓ ఊళ్ళో ఒకడున్నాడు. అతనికి పిల్లా పీచూ అంటూ ఎవరూ లేరు. అయినా అతను మహాపిసినారి. ఎవరికీ ఏదీ ఇచ్చేందుకు అతనికి మనసు రాదు. చెయ్యి చాచినా సరే ఇవ్వడు. పైపెచ్చు విసుక్కొంటాడు. చీదరించుకుంటాడు. దాంతో ఊళ్ళోని వారంతా అతనిని లోపల్లోపల తిట్టుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఆ తిట్టూ శాపనార్థాలూ అతని చెవిన కూడా పడుతుండేవి. ఓ రోజు అతను ఓ సాధువు దగ్గరకు వచ్చాడు.‘‘అయ్యా, నేను చనిపోయిన తర్వాత నా ఆస్తిపాస్తులు అన్నీ ధర్మకార్యాలకు వినియోగించాలని వీలునామా రాసాను. కానీ వాళ్ళకీ విషయం తెలీదు. ఇది తెలీనందువల్లే కాబోలు నన్నెవరూ మెచ్చుకోరు... ఊళ్ళో నాకు మంచి పేరనేదే లేదు. అందరూ నన్ను మహాపిసినారి అని అంటుంటారు. వ్యంగ్యంగా ఏవో మాటలు అంటూనే ఉంటారు. వాళ్ళకేం తెలుసు.. నా ఆస్తంతా ధర్మానికే పోతుందని’’ అని మనసులోని బాధను చెప్పుకున్నాడు.అతని మాటలన్నీ విన్న సాధువు ‘‘అలాగా, అయితే నీకొక మాట చెప్పాలనుకుంటున్నాను’’ అని చెప్పడం మొదలుపెట్టాడు.‘‘అది ఓ ఆవుకు, పందికి మధ్య జరిగిన మాటల ముచ్చట. ఆ మాటలు విన్నావంటే నీకే విషయం అర్థమవుతుంది’’ అంటూ ఇలా చెప్పారు. ‘‘ఓ రోజు పంది ఆవుని చూసి బాధతో ‘ప్రజలందరూ నీ గురించి, నీ గుణగణాల గురించి తెగ పొగుడుతూ చెప్పుకుంటూ ఉంటారు. అదంతా నిజమే. కాదనను. నువ్వు వారికి పాలు ఇస్తావు. కానీ నీకన్నా నేనే వారికి ఎక్కువ ఇస్తున్నాను.

నా మాంసాన్ని వారు తినేవారున్నారు. నన్ను వండి ఆకలి తీర్చుకుంటారు. నా దేహంలోని ఏ భాగాన్నీ వారు విడిచిపెట్టరు. నేను నన్ను పూర్తిగా వారికి అర్పిస్తున్నాను. అయినా ప్రజలు నన్ను ప్రశంసించరు. పైపెచ్చు నన్ను అసహ్యించుకుంటారు. దీనికి కారణమేంటీ’’ అని వాపోయింది. అప్పుడు ఆవు కాస్సేపు ఆలోచించింది. ఆ తర్వాత ఇలా చెప్పింది...‘‘నేను ప్రాణంతో ఉన్నప్పుడు వారికి ఉపయోగపడుతున్నాను. బహుశా అందుకే నన్నందరూ పొగుడుతారు. తలుస్తారు...’’ కాబోలు– వినమ్రతతో ఆవు చెప్పిన  మాటలు విని పంది వాస్తవపరిస్థితిని అర్థం చేసుకుంది.పిసినారి అసలు విషయం గ్రహించాడు. తాను బతికున్నప్పుడే నలుగురికీ ఉపయోగపడాలి కానీ చనిపోయిన తర్వాత ఆస్తిపాస్తులన్నీ ధర్మకార్యాలకు ఉపయోగపడటం దేనికీ అనే నిజాన్ని గ్రహించాడు. ఉన్నప్పుడే నలుగురికీ తనవంతు సాయం చేయాలి, ధర్మం చేయాలి అనుకుని తన తీరు మార్చుకున్నాడు పిసినారి.
– యామిజాల జగదీశ్‌ 

మరిన్ని వార్తలు