అక్షర యోగి

30 Aug, 2017 00:57 IST|Sakshi
అక్షర యోగి

నాలుగు మంచి భావాలను అక్షరాలతో నేసి... ఒంటి మీద వేసుకుంటే.. అవేవీ పైకి కనిపించవు. ఆ మనిషి నగ్నంగా ఉన్నాడనో.. యోగి అనో.. బైరాగి అనో.. అనుకునే ప్రమాదం ఉంది. ‘వేమన.. వారెవరూ కాదు. పదాల నేతగాడు. భావాల కూర్పరి. గొప్ప కవి’ అంటారు డాక్టర్‌ ఎన్‌.గోపి. నిజమే. మనకు వేమన నగ్నంగానే కనబడతాడు. గోపీకి మాత్రం ఒక యజ్ఞంలా కనబడతాడు.

కవితా సంకలనాలు, వ్యాస సంకలనాలు, పరిశోధనాత్మక ప్రచురణలు, అనువాదాలు, వ్యాఖ్యానాలు, టెక్ట్స్‌బుక్స్, కాలమ్‌ రైటింగ్స్‌.. ఇలా 50కి పైగానే రచనలు చేశారు డా.ఎన్‌.గోపి. ఒక్క తెలుగులోనే కాకుండా దేశ విదేశీ భాషల్లోకి గోపీగారి కవిత్వాలు అనువాదం అయ్యాయి. విశ్రాంత ఆచార్యులు అయినా నిరంతర కవితాన్వేషి. ప్రస్తుతం కేంద్రసాహిత్య అకాడమీలో సభ్యుడిగా ఉన్నారు. సభలూ, సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే గోపీగారిని దైవం గురించి అడిగితే కవిత్వాన్నే పరిచయం చేశారు.

వేమన జీవితం, పద్యాల మీద ఎంతో పరిశోధన చేశారు మీరు. వేమన దైవత్వం గురించి ఏం చెప్పారు?
సమాజంలో దైవం పేరుతో జరిగే మూఢనమ్మకాలను విపరీతంగా నిరసించాడు వేమన. ఎంతో ధైర్యవంతుడు. శ్రమలో దైవత్వాన్ని దర్శించమన్నాడు. ‘శ్రమములోన పుట్టు సర్వంబు తానౌను’ అన్నాడు ఒకచోట. అది నా పట్ల నిజమైందనుకుంటాను. విద్యార్థి రోజుల్లో వేమన గురించి పరిశోధన మొదలుపెట్టినప్పుడు చాలా ప్రాంతాలు సందర్శించాను. తాళపత్రాలలో వేమన పద్యాలు మద్రాస్‌లోని లైబ్రరీలో ఉన్నాయని తెలిసి అక్కడకు వెళ్లాను. అక్కడ కట్టల కొద్ది తాళపత్రాలు.

మూడువేల పద్యాలు ఉంటాయవి. వాటన్నింటినీ చూసి ‘అమ్మో!’ అనిపించింది. ఎందుకంటే, కాపీ చేసుకోవాలంటే రాత తప్ప మరో సాధనం లేని రోజులవి. వెనక్కి తిరిగి వెళ్లిపోదామా అనిపించింది. కానీ, వెనకడుగు వేయడమా? ప్రశ్నే లేదనుకొని ఓ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు రాస్తూ కూర్చున్నాను. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే కనీసం ఆరునెలలకు పైగా పడుతుంది. ఎలా? స్కాలర్‌షిప్‌ తప్ప మరో ఆదాయం లేదు.

తెలిసినవారి గదిలో ఉంటూ రెండేళ్ల పాటు వేసవి సెలవుల్లో మాత్రం మద్రాస్‌ వెళ్లి, వేమనపద్యాలన్నీ రాసుకొని, తలమీద మోసుకుంటూ తీసుకొచ్చాను. మొదట ఆ పత్రాలను చూసినప్పుడు ‘అమ్మో! ఎలా సాధ్యమౌతుంది?’ అని భయపడిన నాకు ఆ పద్యాలను ఒక్కోటీ రాస్తూ ఉంటే నాలో ఏదో శక్తి ప్రవేశిస్తున్న అనుభూతి కలుగుతుండేది. అదే నన్ను యాక్టివేట్‌ చేసింది. ఆ తర్వాత వేమనపద్యాల ప్రభావం నా మీద బలంగా పడింది. ఆ శ్రమ తెలుగు సాహిత్యంలో ఇంకా ఇంకా పరిశోధించడానికి ఉపయోగపడింది.

నేటి తరానికి వేమన పద్యాలు ఎంతవరకు అవసరమంటారు?
 వేమనను ఒక యోగిలాగానో, బైరాగిలాగానో భావిస్తారు కానీ, ప్రపంచంలో వేమనను మించిన కవి లేడన్నది నా అభిప్రాయం. నా గ్రంధం ‘ప్రజాకవి వేమన’ ఇప్పటివరకు అయిదు పునర్ముద్రణలు పొందిందంటే ఆ కవి పట్ల పెరుగుతున్న జిజ్ఞాసే అందుకు కారణం. తెలుగుభాషను కాపాడుకోవాలంటే వేమన పద్యాలు పిల్లలకు నేర్పితే చాలు.

వేమననే మీ పరిశోధనకు ఎంచుకోవడం యాదృచ్ఛికమా? దైవికమా?
ఇంటర్మీడియెట్‌ పూర్తయ్యాక హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ విద్యలో చేరాను. కానీ, నా మనసుకు పట్టలేదు. పరిశోధన సమయానికి వచ్చేసరికి వేమన పద్యాల మీదకు ఆలోచన మళ్ళింది. కారణం, నా చిన్ననాటి నుంచి ఊళ్లో చాలామంది నోట వేమన పద్యాలలోని సూక్తులు విని ఉన్నాను. ఇంట్లో నాన్న కూడా ఏదో ఒక సందర్భంలో వేమన పద్యాలలోని మాటలను ఉపయోగించే వాడు. వేమన జనంలోకి అంతగా ఎలా వెళ్లగలిగేడు అనే సందేహం నాకెప్పుడూ కలిగేది. దీంతో వేమన నా పరిశోధన గ్రంథమయ్యాడు.

మీలో కవిత్వం పుట్టుక దైవికం అని భావిస్తారా?
ఎప్పుడైనా సరే కవిత్వం అశాంతిలో నుంచి పుడుతుంది. సమాజంలో మనకు, సాటిమనిషికి జరుగుతున్న అన్యాయంలోంచి పుడుతుంది. ఎంతోమంది గొప్ప గొప్ప కవులు నా చిన్నతనంలోనే అంటే ఏడు, ఎనిమిది తరగతుల నుంచే పరిచయం అయ్యారు. అది నా అదృష్టం. ముఖ్యంగా సి.నారాయణరెడ్డి కవితలు నన్ను అమితంగా ఆకర్షించేవి. కవులతో పద్యాల్లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. యాదగిరి గుట్టపైన బ్రహ్మోత్సవాల్లో జరిగే సాహిత్య, సంగీత కార్యక్రమాలు కూడా నా పసి మనస్సులో కవితాముద్రను వేశాయి. తెలుసుకోవడం పట్ల ఆసక్తి, సాధన మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పసితనంలో మొదలైన ఆసక్తి, ఆ తర్వాత సాధన ఈ రోజుకు ఇలా నిలిపింది.

కవిత్వం పుట్టుక కోసం ఆలయాల సందర్శన ఏమైనా ఉపయోగపడిందా?
అలాంటిదేమీ లేదు. అయితే నా కవితల్లో ‘కొండమీది గుడి’ ఒకటి. అందులో... ‘చిన్నప్పటి నుంచి కొండమీది గుడిని చూస్తూ ఆ రోడ్డు మీద ఎన్నో సార్లు వెళ్లాను. దగ్గర్నే ఉన్నట్టుంటుంది. నడిస్తే మైలున్నర. పెద్ద తలకు చిన్న కిరీటం పెట్టుకున్న పౌరాణిక పాత్రలా ఉంటుందా గుడి...’ అంటూ మొదలవుతుంది. ‘రెండు గంటలు కష్టపడి శిఖరాన్ని చేరుకున్నాను. కింది నుంచి గుట్ట చిన్నగా కనిపించేది.  ఇక్కడి నుంచి లోకమూ అంతే! ‘ఇంత చిన్న గుడిలో ఒంటరిగా దేవుడెలా వుంటున్నాడో!’ ఇలాంటి అనేక సందేహాలు నా కవితలో పంక్తులుగా చేరిపోయాయి.

కవిత్వంలో దైవాన్ని దర్శించడం అంటే...!
‘కాలాన్ని నిద్రపోనివ్వను’ కవితల్లో ఒక ఘర్షణ ఉంటుంది. ‘తంగేడుపూలు’లో ఒక వేదన ఉంటుంది. ‘జలగీతం’ అనే దీర్ఘకవితలో ఒక అనుభూతి ఉంటుంది. ‘జలగీతం’ కవిత ద్వారా నేను మళ్ళీ జన్మ ఎత్తిన భావన కలిగింది. నీటి విలువ ఎడారిలో ఉన్న వాళ్లకు తెలుస్తుంది. నీటి విలువ ఎడారిలో శుష్కించేవాళ్లకు తెలుస్తుంది...’ అంటూ జలం గురించి చెబుతుంది ఈ కవిత. ‘నీళ్లు లేని తనం ప్రాణాలను పీల్చేస్తుంది. నీళ్లు లేని తనం ఎంతటి వాణ్నయినా నిలువునా కూల్చేస్తుంది’ అంటూ వివరిస్తుంది.

నీళ్లను సేవించినప్పుడైనా, అందులో స్నానించినప్పుడైనా మనం అనుభూతించాలి. ప్రేమగా అక్కున చేర్చుకోవాలి. ప్రతీబొట్టును ఆస్వాదించాలి. నీళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదంతా జలగీతం కవిత ద్వారా తెలియజేశాను. సినారె ఈ కవితాసంపుటి ఆవిష్కరణలో ఒకమాట అన్నారు. ‘విశ్వంభర..లో నేను మట్టిని నమ్ముకున్నాను. ‘జలగీతం’లో నీవు నీటిని నమ్ముకున్నావు అన్నారు. ఏ పని చేసినా అందులో లీనమై చేయడం నాకు అలవాటు. కవిత్వంలో ఒక మంచిపదం పడటం కూడా ఒక జీవన్మరణ సమస్యలా అనిపిస్తుంది.

అధ్యాపకుడిగా మీరు దర్శించిన దైవత్వం...
అధ్యాపకుడి కంటే ముందు నేను టీచర్‌ని. తెలుగు నేర్పడానికి ముందు ప్రిపరేషన్‌ ఏముంటుంది... అనుకునేవారు కొందరు. కానీ, ప్రతి పాఠం, ప్రతి పద్యం పిల్లలకు నేర్పడానికి ముందు నేను విద్యార్థిగా మారేవాడిని. వారికొచ్చే సందేహాలు ఏయే రూపాలుగా వస్తాయో, ఎలా వాటిని తీర్చాలో ముందే నోట్సు సిద్ధం చేసుకునేవాడిని. విద్యార్థుల నుంచి ఎంతో నేర్చుకున్నాను. దాదాపు 40 ఏళ్ళ అధ్యాపక వృత్తిలో ఎంతో మంది శిష్యులకు అభిమాన గురువునయ్యాను. ఇది నాకు కలిగిన మరో అదృష్టం.

దైవత్వాన్ని ఎలా దర్శించాలని మీ అభిప్రాయం...?
సేవ ద్వారానే! మరో మార్గం లేదు. బాల్యంలో నేను ఎంతో దారిద్య్రాన్ని అనుభవించాను. పుస్తకాల కోసం, చదువుకోసం సరైన ఆర్థిక వనరులు లేని కారణంగా ఎంతో ప్రయాస పడ్డాను. నాలా తెలుగు భాష మీద అభిమానం ఉండి, ఇబ్బందులు పడే విద్యార్థుల పరిశోధనకు, వారి ఆసక్తికి 12 వేల పుస్తకాలతో మా ఇంటిపైన ఒక అంతస్తులో లైబ్రరీ ఏర్పాటు చేశాను. పరిశోధన చేసే విద్యార్థులు వాళ్ల ఐడీ కార్డుతో సంప్రదించి ఇక్కడే ఉండి చదువుకోవచ్చు.

దైవం ఉందని అనిపించిన ఘటన...?
వేమన పరిశోధనా గ్రంథం కోసం ఊళ్లు తిరుగుతూ రాజమండ్రి గౌతమీ గ్రంథాలయానికి వెళ్లాను. అక్కడ ఎవరూ పరిచయం లేరు. పగలంతా లైబ్రరీలో గడుపుతూ రాత్రిళ్లు ఆర్‌.టి.సి బస్‌స్టాండ్‌లో పడుకునేవాడిని. 25 సంవత్సరాల తర్వాత ఆ ఊరికే వైస్‌–ఛాన్స్‌లర్‌ హోదాలో వెళ్తే ఎందరో స్వాగతం పలకడం అదో అనుభూతి. సరస్వతీ దేవికి ఇచ్చే గౌరవం, మర్యాద ఎంతటిదో నాడు కళ్లారా చూశాను.

మీరు దంపతులు అవడం దైవికమే అనుకుంటారా?
గోపీ: ఏదో తెలియదు కానీ, అరుణకు మరుజన్మకు కూడా రుణపడి ఉన్నాను. మేం కాలేజీ రోజుల్లో క్లాస్‌మేట్స్‌. మాది నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌. కులాంతర వివాహం కావడంతో మా ఇరువైపుల వారు ఒప్పుకోలేదు. నేను జీవితంలో నిలదొక్కుకునేంతవరకు ఓర్పుగా ఎదురు చూసింది. వేమనగ్రంథం పరిశోధన సమయంలో తను గర్భవతి. తనను ఒక్కదాన్ని ఉంచి నేను ఊళ్లు తిరగాల్సిన పరిస్థితి. గ్రంథం అచ్చువేయడానికి చేసిన అప్పులు పదేళ్లపాటు తీర్చుకుంటూ వచ్చాను. సాహిత్యానికి నేను చేసిన సేవ అరుణ ద్వారానే సాధ్యమైంది.

అరుణ: ముమ్మాటికి దైవికమే! మేం కలుసుకోవడం, దంపతులు అవడం దైవికమే అనుకుంటాను. కవిత్వం కన్నా ముందుగా పరిచయమైన ఆయన వ్యక్తిత్వం బాగా నచ్చింది. ఆ తర్వాత కవితలు చదివి అబ్బురపడేదాన్ని. ఈయన ఇచ్చిన స్ఫూర్తితోనే నేనూ కవయిత్రిగా కొన్ని కవనాలు చేశాను. ‘మౌనమూ మాట్లాడుతుంది, పాటల చెట్లు, ఇత్తడి బిందెలు, అమ్మ ఒక మనిషి, హృదయమే వదనం, సూది నా జీవన సూత్రం, నిరీక్షణే ఒక గాయం, కొన్ని తీగలు– కొన్ని రాగాలు.’ పుస్తకాలుగా వచ్చాయి.

‘ప్రజాకవి వేమన’ గ్రంథం ఇప్పటి వరకు ఇన్ని పునర్ముద్రణలు పొందిందంటే ఆ కవి పట్ల పెరుగుతున్న జిజ్ఞాసే కారణం. తెలుగుభాషను కాపాడుకోవాలంటే వేమన పద్యాలు పిల్లలకు నేర్పితే చాలు.

– నిర్మలారెడ్డి చిల్కమర్రి

మరిన్ని వార్తలు