భారత్‌లోనే మొట్టమొదటి దాస్తాంగోయి.. ఈ కళ గురించి మీకు తెలుసా?

9 Nov, 2023 10:26 IST|Sakshi

‘దాస్తాంగో ప్రదర్శన ఇస్తున్నది ఓ అమ్మాయా!!’ అని బోలెడు ఆశ్చర్యపడుతూనే ప్రేక్షకుల మధ్య కూర్చున్నాడు ఒక ప్రేక్షకుడు. ఇలా కూర్చొని అలా వెళ్లిపోదాం... అనుకున్నాడు.అయితే ప్రదర్శన పూర్తయ్యే వరకు కదలకుండా కూర్చున్నాడు. ఆ హాల్‌లో నవ్వుల్లో నవ్వు అయ్యాడు. ఏడుపులో ఏడుపు అయ్యాడు. సకల భావోద్వేగాల సమ్మేళనంతో ‘దాస్తాంగోయి’ ఫౌజియాను ఆశీర్వదించాడు. ఉర్దూలో మౌఖిక కథాసాహిత్య కళారూపం... దాస్తాంగో. పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ కళారూపంలో అపారమైన పేరు తెచ్చుకొని ‘ఫస్ట్‌ ఫిమేల్‌ దస్తాంగోయి’గా గుర్తింపు పొందింది ఫౌజియా...

దిల్లీకి చెందిన ఫౌజియాకు స్కూల్‌ రోజుల నుంచి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఇష్టం. స్కూల్లో ప్రదర్శించే నాటకాల్లో పాల్గొనేది. ఫౌజియా తండ్రి మోటర్‌బైక్‌ మెకానిక్‌. ఆర్థిక పరిస్థితి రీత్యా ఫౌజియా ఎప్పుడో చదువు మానేయాలి. ట్యూషన్‌లు చెప్పగా వచ్చిన డబ్బుతో పై చదువులు చదివింది. మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది. దయాల్‌ సింగ్‌ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒకరోజు తొలిసారిగా ‘దాస్తాంగో’ ప్రదర్శన చూసింది ఫౌజియా. ఇక అప్పటి నుంచి ‘దాస్తాంగో’ పై ఆసక్తి, అభిమానం పెరిగాయి. తాను కూడా ‘దాస్తాంగోయి’గా  పేరు తెచ్చుకోవాలనుకుంది.

A post shared by Fouzia Dastango (@fouziadastango)

‘ఇది పురుషులకు మాత్రమే పరిమితమైన కళారూపం. మహిళలు చేయలేరు. ఒకవేళ చేసినా ప్రేక్షకులు ఆదరించరు’ అన్నట్లుగా చాలామంది మాట్లాడారు. ఆ మాటలు విని ఫౌజియా కొంచెం కూడా నిరాశపడలేదు. తనపై తనకు గట్టి నమ్మకం ఉంది. ‘జీవితాంతం దాస్తాంగో చెంతనే ఉండాలనుకున్నాను. ఎంతో చరిత్ర ఉన్న ఈ కళ గురించి ఈ తరంలో కొద్దిమందికి మాత్రమే తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తరానికి కూడా తెలిసేలా దాస్తాంగోకు ప్రాచుర్యం తీసుకురావాలనుకున్నాను’ అంటుంది ఫౌజియా.డానీష్‌ హుస్సేన్, మహ్మద్‌ ఫారూఖీలాంటి గొప్ప కళాకారుల నుంచి ‘దాస్తాంగో’ను నేర్చుకుంది ఫౌజియా. ఫౌజియా కథాసంవిధానంలో కృత్రిమమైన భాషా గాంభీర్యం వినిపించదు. పాత దిల్లీ యాస మాత్రమే వినిపిస్తుంది.

‘మన దేశంలో ఎన్నో భాషలకు సంబంధించి ఎన్నో మాండలికాలు ఉన్నాయి. ప్రతి మాండలికానికి తనదైన సొగసు ఉంటుంది. ఈతరంలో చాలామంది తమ యాసను దాచి పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇది సరికాదు. మన ఊరు, తల్లిదండ్రులు, సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకున్నట్లే మన మాండలికం గురించి కూడా గొప్పగా చెప్పుకోవాలి’ అంటుంది ఫౌజియా. ఫౌజియాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ముఖ్యంగా ఉర్దూ సాహిత్యం. చిన్నప్పుడు అమ్మ, అమ్మమ్మ, నానమ్మల నుంచి ఎన్నో కథలు విన్నది. అద్భుతమైన రీతిలో కథలు చెప్పేవారు. కథను ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ విరామం ఇవ్వాలి, మళ్లీ ఎక్కడ మొదలు పెట్టాలి... అనే దాంట్లో వారు సిద్దహస్తులు. ఆ మెళకువలు ఊరకే పోలేదు...‘దాస్తాంగో’లో ఫౌజియాకు బాగా ఉపకరించాయి.

A post shared by Fouzia Dastango (@fouziadastango)

జానపద కథలు మాత్రమే కాకుండా సామాజిక సందేశం ఉన్న ఆధునిక కథలను కూడా చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఫౌజియా. దేశవిభజన సమయంలో మహిళలు ఎదుర్కొన్న సమస్యలు, హింస గురించి కథగా చెబుతున్నప్పుడు ప్రేక్షకులు కదిలిపోయారు. కోవిడ్‌ కల్లోల సమయంలో ఫౌజియాకు ‘దాస్తాంగో’ ప్రదర్శనలు ఇవ్వడానికి కుదరలేదు. దీంతో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే ప్రదర్శన ఇచ్చింది. మహాభారతం కథల నుంచి స్వాతంత్య్రం కోసం మహాత్ముడి పోరాటం వరకు ‘దాస్తాంగోయి’గా ప్రేక్షకులను మెప్పిస్తున్న ఫౌజియాకు ఉర్దూ భాషలోనే కాదు హిందీ, ఇతర భాషలలోనూ ‘దాస్తాంగో’ ప్రదర్శనలు ఇవ్వాలనేది కల. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం.

A post shared by Fouzia Dastango (@fouziadastango)


                                     

మరిన్ని వార్తలు