పగటి  మీటింగ్స్‌లోనూ  నిద్ర

13 Apr, 2018 00:32 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

స్లీప్‌ కౌన్సెలింగ్‌
నా వయసు 33 ఏళ్లు. చాలా కీలకమైన పొజిషన్‌లో ఉన్నాను. నా నిద్రపై నాకు ఎలాంటి నియంత్రణా ఉండటం లేదు. మీటింగ్స్‌లో పాల్గొంటున్నప్పుడూ, తింటున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను. దీని వల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం ఉందా?  – మంజునాథ్, హైదరాబాద్‌ 
మీరు నార్కొలెప్సీ అనే నిద్ర సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... ఈ రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. కొన్ని సమయాల్లో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకూ దారితీయవచ్చు. 

సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కలిదే దశ... ఇలాగ.  కనుపాపలు వేగంగా కలిదే దశను ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ (ఆర్‌ఈఎమ్‌) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్‌ఈఎమ్‌ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్‌ఈఎమ్‌ దశలోనే మనకు కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్‌ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి. నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసరులో మొదలవుతుంది. అయితే అది ఏ వయసువారిలోనైనా కనిపించే అవకాశం ఉంది. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. అయితే ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. 

ఇక మరికొందరు  శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం మెదడులోని హైపోక్రెటిన్‌ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్‌ఈఎమ్‌ దశకు సంబంధించిన సైకిల్‌ను కొనసాగించే మెదడులోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లనే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది.  అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు  మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. మాట కూడా ముద్దముద్దగా వస్తుంది. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీడిప్రసెంట్స్, యాంఫిటమైన్‌ మందులతో దీనికి చికిత్స చేయవచ్చు. 

షిష్ట్‌ మారినప్పుడల్లా కోపం.. చిరాకు
నా వయసు 29 ఏళ్లు. ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. నైట్‌ షిఫ్ట్, డే షిఫ్ట్‌ ఇలా షిఫ్టుల్లో పనిచేస్తున్నాను. ఇటివల నిద్ర సరిగా ఉండటం లేదు. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోంది. ఏ అంశంపైనా సరిగా దృష్టి నిలపలేకపోతున్నాను. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వగలరు. 
– ప్రమోద్, విశాఖపట్నం 

మీరు చెప్పిన వివరాలను బట్టి మీరు ‘షిఫ్ట వర్క్‌ డిజార్డర్‌’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీలా పగలూ, రాత్రీ పనిచేసేవాళ్లు ‘షిఫ్ట్‌ వర్క్‌ డిజార్డర్‌’తో బాధపడుతుంటారు. రాత్రి, పగలు మార్చిమార్చి పనిచేయాల్సి రావడంతో ఆ షెడ్యూల్స్‌కు అనుకూలంగా మీ దేహం మారలేకపోవడంతో వచ్చే సమస్య ఇది. మన మెదడులో ఒక జీవగడియారం పనిచేస్తుంటుంది. అలారంలాగే మనం తినేవేళలు, నిద్రపోయే సమయాలు ఆ గడియారంలో నమోదై ఉంటాయి. అది నిర్వహించే క్రమబద్ధతకు ‘సర్కేడియన్‌ రిథమ్‌’ అని పేరు. ఈ రిథమ్‌ దెబ్బతినడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. షిఫ్ట్‌లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్రపోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే తీవ్రంగా అలసిపోతుంటారు. దాంతో వాళ్ల పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. ఇలా పనిచేసేవాళ్లలో కొందరు ఏడెనిమిది గంటలపాటు నిద్రపోయినా వాళ్లకు ‘షిఫ్ట్‌ వర్క్‌ డిజార్డర్‌’ రావచ్చు. పొద్దున్నే పనిచేసేవాళ్లలో, రాత్రిడ్యూటీలు చేసేవారిలో, పనివేళలు తరచూ నైట్‌ షిఫ్టులుగా, డే షిఫ్టులుగా మారేవాళ్లలో  మీరు చెబుతున్న లక్షణాలైన కోపం రావడం, తీవ్రమైన అలసట, త్వరగా ఉద్వేగాలకు లోనుకావడం వంటివి ఈ సమస్య వచ్చిన వారిలో కనిపిస్తుంటాయి. ఇలాంటివారు పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉండటం, నిద్రపట్టడంలో ఇబ్బంది, నిస్సత్తువ, దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలూ కనిపిస్తాయి. దాంతో కార్యక్షేత్రాలలో గాయపడటం, పనుల్లో తప్పులు చేయడం, ఒక్కోసారి కార్యక్షేత్రాలలో గాయపడటం కూడా జరుగుతుంది. ఒక్కోసారి  వారు చేసే తప్పులకు భారీమూల్యం చెల్లించాల్సి రావచ్చు. అనారోగ్యాల బారిన పడటం ఎక్కువ కావచ్చు. రక్తంలో కొవ్వుల పాళ్లు పెరగడం, రొమ్ము, ప్రోస్టేట్‌ క్యాన్సర్ల బారిన పడటం, గుండెజబ్బల బారిన పడటం, స్థూలకాయం రావడం వంటి రిస్క్‌లు ఉంటాయి. ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కెఫిన్‌ ఉండే కాఫీ వంటివి తక్కువగా తీసుకోవడం, నిద్రపోయే సమయాల్లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉంచుకోవడంతో పాటు వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. షిఫ్ట్‌ వర్క్‌ డిజార్డర్‌తో బాధపడేవారికి కృత్రిమ వెలుగులో ఉంచే చికిత్స ప్రక్రియ అయిన బ్రైట్‌ లైట్‌ థెరపీ, మెలటోనిన్‌ మందులతో స్లీప్‌ మాడిఫికేషన్‌ థెరపీ వంటివి అందుబాటులో ఉన్నాయి.  
డాక్టర్‌ రమణ ప్రసాద్‌
కన్సల్టెంట్‌ స్లీప్‌ స్పెషలిస్ట్‌ అండ్‌ 
 పల్మునాలజిస్ట్‌ కిమ్స్, సికింద్రాబాద్‌  

మరిన్ని వార్తలు