స్లీప్‌టెస్ట్‌తో  నా సమస్య  తెలుస్తుందా? 

20 Aug, 2018 00:18 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

స్లీప్‌ కౌన్సెలింగ్‌

నా వయసు 26 ఏళ్లు. సివిల్‌ సర్వీసెస్‌కు ప్రిపేర్‌ అవుతున్నాను. గత ఆర్నెల్లుగా నాకు సరిగా నిద్రపట్టడం లేదు. నిద్రలో ఉన్నప్పుడు తరచూ లేచికూర్చుంటున్నాను. అయితే నాకు ఆ విషయం తెలియడం లేదు. నా రూమ్మేట్స్‌ చెబుతున్నారు. పగటివేళ మగతగా ఉంటోంది. ఒక్కోసారి క్లాసులో పాఠం వింటూ నిద్రపోతున్నాను. వారం కిందట డాక్టర్‌కు చూపించుకుంటే స్లీప్‌ టెస్ట్‌ చేయించుకొమ్మన్నారు. ఆ టెస్ట్‌ వల్ల ఏం తెలుస్తుంది?  – ఎన్‌ వైష్ణవి, వైజాగ్‌ 
స్లీప్‌ టెస్ట్‌ను వైద్యపరిభాషలో పాలీసోమ్నోగ్రఫీ అంటారు. ఇది ఒక వ్యక్తిలో స్లీప్‌ డిజార్డర్స్‌ (నిద్ర సంబంధిత సమస్యలను) గుర్తించి, నిర్ధారణ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలో ఒక వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు అతడి బ్రెయిన్‌వేవ్స్, రక్తంలో ఆక్సిజన్‌ పాళ్లు, గుండె స్పందనల రేటు, శ్వాస స్థాయి, కనుగుడ్లు – కాళ్ల కదలికలను రికార్డు చేస్తారు. ఆసుపత్రి లేదా స్లీప్‌ సెంటర్‌లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం సాయంత్రం పొద్దుపోయాక రావాల్సిందిగా పేషెంట్‌కు సూచిస్తారు.   రాత్రి ఆ వ్యక్తి నిద్రపోయినప్పుడు స్లీప్‌ పాటర్న్‌ లను నమోదు చేయడానికి వీలుకలుగుతుంది. ఒక వ్యక్తిలో స్లీప్‌ డిజార్డర్‌ను గుర్తించడమే కాకుండా ఇప్పటికే నిద్రసంబంధిత సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ చేయడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. 

సాధారణంగా వయోజనులకు 7 – 8 గంటల నిద్ర అవసరం. అయితే ఈ నిద్రసమయంలో అందరిలోనూ ఒకేలా ఉండదు. ఇందులోనూ ఎన్నో దశలు ఉంటాయి. ఉదాహరణకు నాన్‌ ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ (ఎన్‌ఆర్‌ఈఎమ్‌) దశ ప్రారంభమైన తర్వాత ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ అనే దశకు మారుతుంది. నిద్రపోతున్న సమయంలో ఈ రెండు దశలు ఒక క్రమబద్ధమైన రీతిలో కొనసాగుతుండటం కనిపిస్తుంటుంది. ఎన్‌ఆర్‌ఈఎమ్‌ దశలో నిద్రలో ఉన్న వ్యక్తి కనుపాపల్లో కదలికలు ఉండవు. కానీ గంట తర్వాత ఆర్‌ఈఎమ్‌ దశలోకి ప్రవేశించగానే కనుపాపలు వేగంగా కదులుతాయి. వ్యక్తిలో కలలు వచ్చేది ఈ ఆర్‌ఈఎమ్‌ సమయంలోనే. ఎన్‌ఆర్‌ఈఎమ్‌ దశ, ఆర్‌ఈఎమ్‌ దశల మధ్య 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఒక వ్యక్తి రాత్రి నిద్రపోయే సమయంలో ఆరుసార్లు ఈ ఎన్‌ఆర్‌ఈఎమ్, ఆర్‌ఈఎమ్‌ల సైకిల్స్‌ (చక్రభ్రమణాలు) సాగుతాయి. నిద్ర సమయం గడుస్తున్న కొద్దీ ఆర్‌ఈఎమ్‌ వ్యవధి పెరుగుతుంది. స్లీప్‌ డిజార్డర్స్‌ ఈ సైకిల్స్‌ను దెబ్బతీస్తాయి. పాలీసోమ్నోగ్రఫీ పరీక్షలో వ్యక్తి తాలూకు నిద్రలోని దశలను గమనించి, ఏ స్లీప్‌ పాటర్న్‌ దెబ్బతింటున్నది అన్న అంశాన్ని నిపుణులు గుర్తిస్తారు. 

పేషెంట్‌లో కొన్ని ప్రత్యేక లక్షణాలను గమనించినప్పుడు ఈ స్లీప్‌టెస్ట్‌ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. స్లీప్‌ ఆప్నియా కారణంగానో లేదా మరో ఇతర సమస్య వల్లనో వ్యక్తి తాలూకు శ్వాస తరచూ నిలిచిపోవడం; వ్యక్తి తన ప్రమేయం లేకుండా నిద్రలో తరచూ కాళ్లు కదుపుతుండటం, రోజంతా మగతగా ఉంటూ హఠాత్తుగా నిద్రలోకి జారుకుంటూ ఉండే నార్కోలెప్సీ వంటి పరిస్థితులు; నిద్రలో ఉండగా నడవడం లేదా లేచి తిరగడం వంటి అసాధారణ ప్రవర్తనలు; అకారణంగా కొనసాగుతున్న తీవ్రమైన నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఈ స్లీప్‌ టెస్ట్‌ను చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సూచిస్తారు. ఈ పరీక్షతో సమస్యను కచ్చితంగా నిర్ధారణ చేసి, వెంటనే చికిత్స ప్రారంభించడానికి వీలుకలుగుతుంది. 

రాత్రంతా నిద్రపట్టడంలేదు...  ఎందుకిలా? 
నా వయసు 47 ఏళ్లు. ఒక చిట్‌ఫండ్‌ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాను. ఏడాదికాలంగా నాకు రాత్రిళ్లు నిద్రపట్టడం చాలా కష్టమవుతోంది. ఒకరోజు తెలతెలవారేదాకా నిద్రపట్టక, పొద్దున్నే కాసేపు మాత్రం పడుకోగలుగుతున్నాను. రోజంతా నిస్సత్తువ, చికాకుగా ఉంటోంది. పనిమీద ఏకాగ్రత కుదరడం లేదు. మధ్యాహ్నం నిద్ర ముంచుకువస్తోంది. దాంతో ఈమధ్య రాత్రిళ్లు నిద్రమాత్రలు వేసుకోవడం మొదలుపెట్టాను. అయితే మా ఖాతాదారుగా ఉన్న ఓ వైద్యుడితో ఈ సమస్యను ప్రస్తావిస్తే వెంటనే నిద్రమాత్రలు మానేయమని అన్నారు. ఇది స్లీప్‌ డిజార్డర్‌లా అనిపిస్తోంది. హైదరాబాద్‌కు వెళ్లి స్పెషలిస్టుకు చూపించుకొమ్మని సలహా ఇచ్చారు. నా సమస్య ఏమిటి, ఎందువల్ల వస్తుంది. దయచేసి తెలియజేయండి.  – సీహెచ్‌ మృత్యుంజయం, సిద్ధిపేట 

క్రమం తప్పకుండా తగినంత నిద్రపోలేకపోవటానికి సంబంధించిన చాలా లక్షణాలను కలుపుకొని స్లీప్‌ డిజార్డర్స్‌ (నిద్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు)గా చెబుతుంటారు. ఈ సమస్యలకు ఏ అనారోగ్యమైనా కారణం కావచ్చు. లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడి, తీరికలేని పనుల ఒత్తిడి, మరికొన్ని ఇతర కారణాలూ కావచ్చు. మొత్తం మీద ప్రతివ్యక్తీ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటారు. అయితే ఇది నెలల తరబడి కొనసాగుతున్నట్లయితే దాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్లీప్‌ డిజార్డర్స్‌ వల్ల బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మనదేశంలో పట్టణప్రాంతాల్లో వయోజనులు, ప్రత్యేకించి నలభౖయెదేళ్లకు పైబడిన వారిలో దాదాపు సగం మంది నిద్రలేమి, నిద్రసంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అంచనా. ఇది వ్యక్తుల సాధారణ జీవితానికి ఆటంకం అవుతుంది. మీరు చెప్పిన లక్షణాలైన నిస్సత్తువ మాత్రమే గాక మానసికంగా అస్తవ్యస్తంగా అనిపిస్తుంటుంది. దేనిపైనా ఏకాగ్రత కుదరదు. ఊరికే చికాకు పడుతుంటారు. శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 

కొంతమందిలో శారీరక, మానసిక రుగ్మతల కారణంగా స్లీప్‌ డిజార్డర్స్‌ ఏర్పడతాయి. ఒకసారి ఆ రుగ్మతలకు చికిత్స చేయడం వల్ల వాటితోపాటే నిద్రలేమి సమస్య కూడా పరిష్కారమవుతుంది. అందు వల్ల ముందుగా మీరు మొదట ఫిజీషియన్‌ను కలిసి, ఆయన సూచించిన వైద్యపరీక్షలు చేయించుకోండి. ఎలాంటి వ్యాధులు లేవని నిర్ధారణ అయితే మీది స్లీప్‌ డిజార్డర్‌గా భావించవచ్చు. ఇలా ఆరోగ్యకారణాలు ఏవీ లేకుండా స్లీప్‌ డిజార్డర్స్‌ కనిపించినప్పుడు దానికి వైద్యపరమైన చికిత్సతో పాటు జీవనశైలి మార్పులు చేసుకోవడం కూడా అవసరం. ఇతరత్రా ఎలాంటి అనారో గ్యాలు లేకుండా నిద్రకు సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు స్లీప్‌స్పెషలిస్ట్‌ను సంప్రదించండి. 
డాక్టర్‌ వై. గోపీకృష్ణ, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ 
పల్మనాలజిస్ట్‌ అండ్‌ స్లీప్‌ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌ 

 

మరిన్ని వార్తలు