ఫ్యాటీ లివర్‌ ఎందుకు వస్తుంది?

26 Sep, 2018 01:12 IST|Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్‌
నా వయసు 46 ఏళ్లు. ఇటీవల నా బరువు అధికంగా పెరిగింది. దాంతో డాక్టర్‌ దగ్గరికి వెళ్లి కొన్ని పరీక్షలు చేయించుకున్నాను. వీటిల్లో ఫ్యాటీలివర్‌ అని తేలింది. అసలు ఫ్యాటీ లివర్‌ అంటే ఏమిటి? దీని గురించి వివరించండి.  – ఆర్‌. శ్రీధర్‌ రావు, వరంగల్‌ 
కాలేయం కొవ్వుకు కోశాగారం లాంటివి. ఇది కొవ్వు పదార్థాలను గ్రహించి, వాటిని శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా... కాలేయంలోని కొవ్వు వినియోగం కాకుండా, అందులోనే చేరుతూ ఉంటుంది. ఇదే క్రమంగా ఫ్యాటీలివర్‌కు దారితీస్తుంది. ఇది రెండు కారణాల వల్ల వస్తుంది. మొదటిది మద్యం ఎక్కువగా తీసుకోవడం, రెండోది మద్యం అలవాటుకు సంబంధించని కారణాలు. ఇందులో స్థూలకాయం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, హైపోథైరాయిడిజమ్‌ వంటివీ వస్తాయి. సాధారణంగా ఫ్యాటీలివర్‌ సమస్య ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. కేవలం అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ (కడుపు భాగం) , కాలేయ సంబంధ పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ సమస్య బయటపడుతుంది. ఇలా ఆ పరీక్షల ద్వారా కాలేయ కణాల్లో కొవ్వు చేరిందని తెలుసుకున్నప్పుడు దాన్ని ఫ్యాటీలివర్‌గా గుర్తిస్తారు. సాధారణంగా ఫ్యాటీలివర్‌ సమస్యవల్ల 80 శాతం మందిలో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే 20 శాతం మందిలో అది రెండో దశకు చేరుకోవచ్చు. ప్రధానంగా ఇది మెటబాలిక్‌ సిండ్రోమ్‌ అనే సమస్యకు కారణమై... గుండెకు, మెదడుకు సంబంధించిన ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉంది.  మీకు ఫ్యాటీలివర్‌ ఉందని నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకొని, దానికి కారణాలను కనుగొని, తగిన మందులు వాడాల్సి ఉంటుంది. కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. మామూలుగా మధ్యవయసులో ఉన్నవారికి చాలా పరిమితమైన కొవ్వులు సరిపోతాయి. ఇక జంతు సంబంధమైన కొవ్వులను చాలా తక్కువ మోతాదులో  తీసుకోవాలి. మీరు ఒకసారి మీకు దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలవండి. 

కడుపులోకి  నీరు వస్తోంది.. కారణం ఏమిటి?
నా వయసు 48 ఏళ్లు. నేను రోజూ ఆల్కహాల్‌ తీసుకుంటాను. నాకు ఈ మధ్య కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం జరిగింది. మా దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని ట్యాబ్లెట్స్‌ ఇచ్చారు. కొన్ని రోజులు వాడాక తగ్గింది. కానీ సమస్య మళ్లీ వచ్చింది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.  – డి. శ్రీనివాసరావు, కొత్తగూడెం 
మీకు లివర్‌ / కిడ్నీ / గుండె సమస్యలు ఉన్నప్పుడు కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు ఆల్కహాల్‌ తీసుకుంటారని చెప్పారు కాబట్టి మీకు లివర్‌ సమస్య వచ్చి ఉండవచ్చు. అయితే మీకు ఏయే పరీక్షలు చేశారో మీ లేఖలో రాయలేదు. మీకు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్‌ ఫంక్షన్‌ పరీక్ష, కిడ్నీ ఫంక్షన్‌ పరీక్ష, కడుపులో నీటి పరీక్ష చేయించుకోవాలి. దాని రిపోర్టులతో మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదిస్తే మీకు తగిన చికిత్స అందిస్తారు. 

కళ్లు పచ్చగా మారుతున్నాయి...
నా వయసు 47 ఏళ్లు. పదేళ్ల క్రితం నాకు ఆపరేషన్‌ చేసి ఎడమవైపు రొమ్ము తొలగించారు. ఇంతకాలంగా నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ నెల రోజుల నుంచి కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. ఆకలి కూడా తగ్గింది. నీరసంగా ఉంటోంది. అప్పుడప్పుడూ కడుపులో నొప్పి వస్తోంది. గతంలో రొమ్ముకు వచ్చిన వ్యాధి ఇప్పుడు కడుపులోకి పాకిందంటారా? నాకు తగిన సలహా ఇవ్వండి. – ఒక సోదరి, హైదరాబాద్‌ 
మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే క్యాన్సర్‌ కారణంగా మీకు రొమ్ము తొలగించారని అర్థమవుతోంది. ప్రస్తుతం మీరు కామెర్లతో బాధపడుతున్నారు. గతంలో ఉన్న రొమ్ముక్యాన్సర్‌ ప్రభావం కాలేయంపైన కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి అల్ట్రాసౌండ్‌ స్కానింగ్, కాలేయానికి సంబంధించిన రక్తపరీక్షలు చేయించుకోండి. ఈ పరీక్షల్లో మీ సమస్య బయటపడుతుంది. ఒకవేళ క్యాన్సర్‌ వల్ల మీ లివర్‌ ప్రభావితమైతే, దీన్ని వీలైనంత త్వరగా గుర్తించి, వెంటనే చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, అవసరమైన చికిత్స తీసుకోగలరు. 

మలవిసర్జన తర్వాత కడుపునొప్పి... 
నా వయసు 32 ఏళ్లు. సుమారు ఏడాదిగా నాకు తరచూ కడుపునొప్పి వస్తోంది. విసర్జన తర్వాత కడుపునొప్పి తగ్గుతోంది. మలబద్ధకం, విరేచనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, దాంతో చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ను కలిస్తే మందులు ఇచ్చారు. వాడినప్పుడు కాస్త మామూలుగా అనిపిస్తోంది. మానేయగానే మళ్లీ సమస్య మొదటికి వస్తోంది. నా సమస్య ఏమిటి? దానికి పరిష్కారం సూచించండి. 
– ఆర్‌. సాయి ప్రసాద్, కోదాడ 

మీరు రాసిన లక్షణాలను బట్టి మీరు ఐబీఎస్‌ (ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌)తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మానసికంగా ఆందోళన ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఆ తర్వాత స్కానింగ్‌ పరీక్ష కూడా అవసరం కావచ్చు. పరీక్షలు అన్నీ నార్మల్‌ అని వస్తే మీకు ఐబీఎస్‌ అని నిర్ధారణ అవుతుంది. ఈ సమస్యకు మొదటి పరిష్కారం మీరు మానసికమైన ఒత్తిళ్లను, ఆందోళనలను తగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంతకాలం యాంటీ స్పాస్మోడిక్, అనాల్జిక్‌ మందులు వాడితే మీ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మీ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది. 
డాక్టర్‌ భవానీరాజు
సీనియర్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌ 

>
మరిన్ని వార్తలు