New Billionaire: 80 ఏళ్ల వయసులో ఫోర్బ్స్‌ జాబితాలోకి.. విస్కీ, వోడ్కా అమ్ముతూ..

14 Dec, 2023 15:46 IST|Sakshi

భారతదేశంలో కుబేరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో మరో ఇండియన్ పేరు నమోదైంది. ఎనిమిది పదుల వయసులో కుబేరుల జాబితాలోకి చేరిన వ్యక్తి ఎవరు.. అయన సంపద ఎంత.. ఏ కంపెనీ నడిపిస్తున్నారు.. ఎలాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మద్యం వ్యాపారంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇండియా ఒకటి. మద్యం వ్యాపారం చేస్తూ ధనవంతుల జాబితాలో చేరిన 'లలిత్ ఖైతాన్' (Lalit Khaitan) 1972-73లలో కంపెనీ స్వాధీనం చేసుకున్న తరువాత దానిని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి ఈయన అనుదినం కృషి చేసేవారు. అనుకున్న విధంగానే సక్సెస్ సాధించి ఎంతోమందికి ఆదర్శమయ్యాడు.

లలిత్ ఖైతాన్ సారథ్యంలో ముందుకు సాగుతున్న 'రాడికో ఖైతాన్‌' (Radico Khaitan) ఇప్పుడు మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా, 8 పీఎం విస్కీ, ఓల్డ్ అడ్మిర‌ల్ బ్రాండీ, రాంపూర్ సింగిల్ మాల్ట్‌ లాంటి బ్రాండ్ల‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాది కంపెనీ షేర్లు 50 శాతం పెరిగి సంస్థ విలువ బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో లలిత్ ఖైతాన్ బిలియనీర్ల జాబితాలోకి చేరిపోయారు.

ఖైతాన్.. అజ్మీర్ మాయో కాలేజ్, కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువు పూర్తి చేసుకుని, బెంగుళూరులోని BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజిరియల్ ఫైనాన్స్ & అకౌంటింగ్ కోర్సును అభ్యసించారు.

రాడికో ఖైతాన్‌గా పిలువబడుతున్న కంపెనీని గతంలో రాంపూర్ డిస్టిలరీ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్‌గా పిలిచేవారు. ఆ సంస్థను ఖైతాన్ తండ్రి జీఎన్ ఖైతాన్ 1970 ప్రారంభంలో నష్టాల్లో నడుస్తున్న సమయంలో సొంతం చేసుకున్నారు. ఆ తరువాత ఈ కంపెనీ క్రమంగా వృద్ధి చెందుతూ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థల జాబితాలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం కంపెనీ బ్రాండ్లను సుమారు 85 దేశాలలో విక్రయిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఏం ప్లానింగయ్యా.. ఏమీ చేయకపోయినా నెలకు రూ.9 లక్షలు సంపాదన

మద్యం రంగంలో అతి తక్కువ కాలంలోనే గొప్ప పురోగతి కనపరిచిన లలిత్ ఖైతాన్ 2008లో 'ఇన్‌స్పిరేషనల్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు', 2017లో ఉత్తర ప్రదేశ్ డిస్టిల్లర్స్ అసోసియేషన్ ద్వారా 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు' వంటి వాటిని సొంతం చేసుకుని.. ఇప్పడూ ఫోర్బ్స్ జాబితాలో ఒకరుగా స్థానం సంపాదించారు.

>
మరిన్ని వార్తలు