షేక్షావలి కుటుంబాన్ని ఆదుకోని ప్రభుత్వం

4 Dec, 2018 05:58 IST|Sakshi
షేక్షావలి చిత్రపటంతో భార్య, కుమారుడు

నివాళి

ఆరుగాలం వ్యవసాయాన్ని నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న రైతు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుని చనిపోయి రెండున్నరేళ్లు గడచినా రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతు కుటుంబాలను ఆదుకోకపోవడంతో నిరంతరం వారు ఆవేదనకు గురవుతున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కేంద్రమైన మర్రిస్వామి మఠం కాలనీకి చెందిన హుసేన్‌ వలి కుమారుడు షేక్షావలి(45) రైతు అప్పుల పాలై 2016 జనవరి 19న తన ఇంటì లోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి పేరున మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.

గత నాలుగేళ్లుగా పంటలు సరిగ్గా పండటం లేదు. పెట్టిన పెట్టుబడి చేతికి అందకపోవడంతో షేక్షావలి ఆవేదనకు లోనయ్యారు. స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ. 80 వేలు, సహకార పరపతి సంఘంలో రూ. 1.40 లక్షలు, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రూ. 2 లక్షలు అప్పు చేశారు. రైతుల రుణాలు మాఫీ చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ షేక్షావలి రుణాలు మాఫీ కాలేదు. వ్యవసాయ బోర్లు తవ్వించారు. అప్పులు చేసి తవ్వించిన బోర్లలో భూగర్భజలాలు ఇంకిపోయాయి. అప్పులు మిగిలాయి. దీంతో వర్షాధారంపైనే పత్తి, వేరుశనగ తదితర పంటలను సాగుచేస్తూ వచ్చారు.

షేక్షావలి తల్లి హుసేన్‌బీ, భార్య నహౌంబీ, కుమారుడు రహిమాన్, కుమార్తెలు ముంతాజ్, ఆఫ్రీన్‌ ఉన్నారు. ఆఫ్రీన్‌కు వివాహం అయ్యింది. ముంతాజ్‌ ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నది. కుమార్‌ ర హిమాన్‌ వెల్డింగ్‌ షాపులో దినసరి కూలిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం షేక్షావలి కుటుంబం అప్పుల భారంతోపాటు భార్య నహౌంబీ, తల్లి హుసేన్‌ బీ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. కొడుకు రహిమాన్‌ దిన కూలిగా పనిచేసి కుటుంబాన్ని గట్టెక్కిస్తున్నాడు. పెద్ద దిక్కును కోల్పోయిన వారి కుటుంబం ఆర్థికంగా, మానసికంగా కృంగిపోయింది. అప్పటి ఆర్డీఓ,తహíసీల్దార్‌ విచారణ చేశారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా అందక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని షేక్షావలి తల్లి, భార్య ‘సాక్షి’ ఎదుట వాపోయారు.
– యు. చంద్రబాబు, సాక్షి, ఆలూరు, కర్నూలు జిల్లా
 

మరిన్ని వార్తలు