చట్టం ముందు..

21 Oct, 2019 00:00 IST|Sakshi

కథాసారం

చట్టం ముందు ఒక కాపలావాడు నిలబడి ఉంటాడు. ఒక పల్లెటూరి మనిషి కాపలావాడి దగ్గరకు వచ్చి చట్టం లోపలికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వమని బతిమాలతాడు. కాని కాపలావాడు అనుమతి ఇప్పుడు ఇవ్వలేనని అంటాడు. ఆ వచ్చిన మనిషి కాసేపు ఆలోచించి, అయితే తర్వాత ఎప్పుడైనా అనుమతి దొరికే అవకాశం ఉందా అని అడుగుతాడు. ‘అవకాశం ఉంది, కానీ ఇప్పుడు కాదు,’ అంటాడు కాపలావాడు. ఎప్పటిలాగే తెరుచుకొని ఉన్న చట్టం తలుపుల్లోంచి, కాపలావాడు పక్కకు జరగటంతో, ఆ మనిషి లోపలికి తొంగి చూస్తాడు. కాపలావాడు అది చూసి నవ్వి అంటాడు: ‘నీకు అంత ఆత్రంగా వుంటే, నా మాట కాదని లోపలకి వెళ్ళే ప్రయత్నం చేయి. కాని ఒకటి మటుకు గుర్తుంచుకో: నాకు చాలా బలముంది. అయినా నేనిక్కడ కాపలావాళ్ళలో చివరిస్థాయి వాడ్ని మాత్రమే. లోపలకి వెళ్ళేసరికి ఇలా గది నుండి గదికి ప్రతీ తలుపు దగ్గరా ఒక్కో కాపలావాడు నిలబడి ఉంటాడు, ప్రతీ ఒక్కడూ ముందువాడి కంటే బలవంతుడే. మూడో కాపలావాడికి ఎదురుగా నిలబడటానికి నాకే ధైర్యం చాలదు.’ పల్లెటూరి నుంచి వచ్చిన మనిషి ఇలాంటి కష్టాలను ఊహించ లేదు; చట్టం అందరికీ అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉండి తీరాలని అతని అభిప్రాయం, కాని ఇక్కడ ఈ కాపలావాడ్ని–– ఇలా ఉన్నికోటు వేసుకొని, మొనదేలిన పెద్ద ముక్కుతో, నిగనిగలాడే నల్లని తార్తారు గెడ్డంతో సన్నగా పొడవుగా ఉన్నవాడ్ని–– కాస్త దగ్గరగా పరిశీలించిన మీదట, అనుమతి వచ్చేంత వరకూ ఎదురుచూడటమే మంచిదన్న నిర్ణయానికి వస్తాడు.

కాపలావాడు అతనికి ఒక పీట ఇచ్చి తలుపుకి వారన కూర్చోనిస్తాడు. ఆ మనిషి అక్కడే రోజుల తరబడి, సంవత్సరాల తరబడి కూర్చుంటాడు. పదే పదే లోపలికి అనుమతి ఇవ్వమని అడుగుతూ అభ్యర్థనలతో కాపలావాడ్ని విసిగిస్తాడు. అప్పుడప్పుడూ కాపలావాడు ఆ మనిషిని ఆరాలు తీస్తాడు, ఇంటి గురించీ మిగతా విషయాల గురించీ అడుగుతాడు, కానీ అవన్నీ గొప్పవాళ్ళు తెలుసుకోవాలని లేకపోయినా అడిగే ప్రశ్నల్లా ఉంటాయి, ఎంతసేపు మాట్లాడినా చివరకు మాత్రం ఇంకా అనుమతి లేదనే ముక్తాయిస్తాడు. ఈ ప్రయాణం కోసం చాలా సరంజామా వెంటపెట్టుకొని వచ్చిన ఆ మనిషి,  తెచ్చుకున్నదంతా, అదెంత విలువైనదైనా, కాపలావాడికి లంచాలు ఇవ్వటానికి వాడేస్తాడు. కాపలావాడు అన్నీ కాదనకుండా తీసుకుంటాడు, కాని తీసుకొనేటప్పుడు మాత్రం: ‘ఇంకా ఏదో ప్రయత్నించకుండా వదిలేశావని నువ్వనుకోకుండా ఉంటానికి మాత్రమే ఇది తీసుకుంటున్నాను,’ అనటం మానడు. అన్ని సంవత్సరాల సమయంలోను ఆ మనిషి నిరంతరాయంగా కాపలావాడ్ని గమనిస్తూనే ఉంటాడు. అందులో పడి మిగతా కాపలావాళ్ళ సంగతే మరిచిపోతాడు, ఈ కాపలావాడొక్కడే చట్టంలోపలికి వెళ్లటానికి ఏకైక అడ్డంకిగా కనిపిస్తాడు.

ఈ దురదృష్టానికి తన్ను తానే తిట్టుకుంటాడు, వచ్చిన కొత్తల్లో పైకే తిట్టుకుంటాడు, కానీ తర్వాత, వయసు మళ్ళేకొద్దీ, తనలో తాను గొణుక్కోవటంతో సరిపుచ్చుకుంటాడు. అతనిలో పిల్లచేష్టలు మొదలవుతాయి, సంవత్సరాల తరబడి అదే పనిగా చూడటం వల్ల కాపలావాడి కాలరు మడతలోని నల్లులను కూడా గుర్తుపట్టి, వాటిని కూడా తన తరఫున కాపలావాడి మనసు మారేలా బతిమాలమని అడుగుతాడు. రాన్రానూ అతని చూపు మందగిస్తుంది, చుట్టూ ప్రపంచమే మసక బారుతోందో లేక తన కళ్ళే తనను మోసం చేస్తున్నాయో అర్థం కాదు. కానీ, అంత చీకటిలో కూడా, అతను చట్టపు ప్రవేశ ద్వారం నుంచి ఆగకుండా వెలువడుతున్న ఒక కాంతి పుంజాన్ని దర్శించగలుగుతాడు. ఇక అతని జీవితం చివరికొచ్చేసింది. చనిపోయేముందు, ఇన్ని సంవత్సరాల అనుభవాలూ మనసులో కూడుకొని, కాపలావాడ్ని ఇప్పటిదాకా అడగని ఒకే ఒక్క ప్రశ్నగా రూపుదిద్దుకుంటాయి. పట్టేసిన శరీరాన్ని నిటారుగా లేపలేక, కాపలావాడికి సైగ చేస్తాడు. వాళ్ళిద్దరి ఎత్తుల్లో పెరిగిన తేడా వల్ల ఇప్పుడు కాపలావాడు అతని వైపు వొంగాల్సి వస్తుంది. ‘ఇప్పుడేం తెలుసుకోవాలి, నీకు తృప్తి అన్నదే లేదు కదా!’ అంటాడు కాపలావాడు. ‘ప్రతి ఒక్కరూ చట్టంలోపలికి వెళ్ళాలని ఆరాటపడతారు కదా. మరి, ఇన్నేళ్ళలో, ఇక్కడ నేను తప్ప ఇంకెవరూ వచ్చి ప్రవేశానికి అనుమతి అడగలేదెందుకు?’ అని అడుగుతాడు ఆ మనిషి. అతను ఆఖరి క్షణాల్లో ఉన్నాడని కాపలావాడు గ్రహిస్తాడు, వినికిడి తగ్గుతున్న అతని చెవుల్లోకి చేరేట్టు, గట్టిగా ఇలా అరుస్తాడు: ‘ఇంకెవ్వరూ ఇక్కడ నుంచి లోపలకు వెళ్ళలేరు, ఎందుకంటే ఈ తలుపు ఉన్నది నీ ఒక్కడి కోసమే. ఇప్పుడిక దాన్ని మూసేస్తున్నాను.’

కలల్లాంటి కథలు
కాఫ్కా రచనా ప్రక్రియ మన కలల నిర్మాణాన్ని ఫాలో అవుతుంది. మన కలల్లో ఒక ధోరణి ఉంటుంది. వాటిలో కనపడే దృశ్యాలకూ, వాటివల్ల మనకు కలిగే భావాలకూ పొంతన ఉండదు. కనపడే దృశ్యాలతో ఏ మాత్రం సంబంధంలేని భావాలేవో కలుగుతుంటాయి. కలలో మనం చందమామని చూసి కూడా భయపడవచ్చు. మరి మెలకువ జీవితంలో ఆహ్లాదకరమైన చందమామ కలలో భయకారకమెలా అయింది? అంటే, నిజానికి కాలేదు. కలలో మనకు భయం కలిగేది చందమామ ‘వల్ల’ కాదు, మనలో ఆల్రెడీ ఉన్న భయమే చందమామ మీదకూ ప్రసరించి దాన్ని కూడా భయావహం చేస్తుంది, అదే స్థానంలో మరే ఇతర అప్రమాదకర  దృశ్యాలున్నా కూడా––సూర్యాస్తమయం, చెట్టు మీద కాకులు, దగ్గరగా ఎగిరే విమానం––అలాంటి భయమే కలగవచ్చు. అంటే, కల ఒక భావంతో మొదలవుతుంది, ఇక తర్వాత కలలో ఏ దృశ్యం వచ్చి పడినా, అది ఆ పూర్వనిశ్చిత భావాన్నే ప్రకటిస్తుంది. కాబట్టి, ఆ ‘చందమామ కల’కు సంబంధించినంత వరకూ దృశ్యం వల్ల భయం కాదు, భయం వల్ల దృశ్యం. ఇక్కడ భయం ప్రేరేపిత భావం కాదు, ప్రేరేపక భావం. దీన్ని ఒక్క భయం అనే భావానికే కాదు; ఆహ్లాదం, కామం, ఉద్వేగం, జుగుప్స ఇలా ఏ భావానికైనా వర్తింపజేయవచ్చు. కానీ కాఫ్కా జీవితాన్ని ప్రధానంగా నిర్దేశించిన ఏకైక భావం భయం: తండ్రి పట్ల భయం, ఆరోగ్యం పట్ల భయం, సెక్సువల్‌ ఇంటిమసీ పట్ల భయం, పెళ్ళి పట్ల భయం, చివరకు సాహిత్యం పట్ల కూడా భయమే.

కాఫ్కా జీవితానుభవాల్ని యథాతథంగా తీసుకోలేదు, అవి తనలో కలిగించిన భావాల్ని మాత్రం తీసుకున్నాడు. ఆ భావాన్ని తనలో నింపుకుని, ఆ భావం పూనినవాడై, ఆ భావంతో మమేకమై– కలం కదిపాడు. ఇక అతను రాసింది ఏదైనా ఆ భావం మాత్రం ఆ సృజన అంతటా ఒక పారదర్శకపు పొరలా పరుచుకుని ఉంటుంది. పాఠకుని మనసు ఆ భావాన్ని అనుభూతి చెందుతుంది, కానీ బుద్ధికి మాత్రం ఆ భావానికీ, రచనలోని వివరాలకూ తార్కికమైన సంబంధమేమిటో అందదు. అచ్చంగా కలల్లోలాగానే. కానీ ఎంతైనా పుస్తకం అనేది ఒక కాంక్రీటు వాస్తవం. అందులో వ్యాకరణానుగుణమైన వాక్యాలూ, వర్ణితమైన సన్నివేశాలూ ఒక తార్కికమైన క్రమాన్నీ, మెటీరియల్‌ ఉనికినీ కలిగి ఉంటాయి. పైగా కాఫ్కా రియలిస్టు రచయితలతో పోటీపడేవిధంగా కాల్పనిక ప్రపంచాల్ని తీర్చిదిద్దుతాడు. దాంతో వాటి నిర్మాణం తార్కికంగా స్పష్టంగా ఉంటుంది, అర్థం మాత్రం కలలోలా అలికేసినట్టు ఉంటుంది. ఈ కాంబినేషన్‌ పాఠకుల్ని చిత్రమైన ఆకర్షణతో కట్టిపడేస్తుంది. వారికి కాఫ్కాను చదవడం మెలకువలో ఉండి కలగంటున్నట్టుగా తోస్తుంది. 

ఫ్రాంజ్‌ కాఫ్కా (1883–1924) ‘బిఫోర్‌ ద లా’కు ఇది అనువాదం. 1914–15 మధ్యలో ఆయన రాసిన ‘ద ట్రయల్‌’ నవలలో ఒక పాత్ర చెప్పే నీతి కథలాంటిది ఇది. తర్వాత విడిగా కూడా ప్రచురణ అయింది. అనువాదం, పరిచయం: మెహెర్‌. అనువాదకుడు కాఫ్కా కొన్ని కథల్ని ‘మెటమార్ఫసిస్‌’గా పుస్తకం తెచ్చారు.

మరిన్ని వార్తలు