స్నేహ పురాణం

7 Aug, 2016 00:32 IST|Sakshi
స్నేహ పురాణం

నేడు స్నేహితుల దినోత్సవం
స్నేహం గురించి, స్నేహం ఔన్నత్యాన్ని గురించి రామాయణమహాభారతాలలో అద్భుతంగా వర్ణించారు.  రామాయణంలోని శ్రీరామ సుగ్రీవుల మైత్రి, మహాభారతంలో కుచేల శ్రీకృష్ణుల మైత్రి, కర్ణదుర్యోధనుల మైత్రీబంధం... ఈ మూడు స్నేహాలూ గొప్పవే. అయితే ఒక్కొక్క స్నేహంలో ఒక్కో కోణం ఉంది. ముందుగా రామాయణం విషయానికొస్తే...

అవసరానుగుణమైన స్నేహం రామసుగ్రీవులది...
తన ప్రియసఖి సీతను వెదుకుతూ అడవిమార్గంలో వెళుతున్నాడు రాముడు తన సోదరుడు లక్ష్మణునితో కలిసి. వారిని చూసిన వానర రాజు సుగ్రీవుడు తన అన్న వాలి తనను సంహరించడానికి ఎవరినో పంపాడేమోనని భయపడ్డాడు. అది గమనించిన ఆంజనేయుడు వారి రాకకు కారణం తెలుసుకుని, అటు రాముడికీ, ఇటు సుగ్రీవుడికీ ప్రయోజనం చేకూరే విధంగా వారి మధ్య మైత్రి కుదిర్చాడు. ఇది పరస్పర ప్రయోజనాన్ని చేకూర్చేదే అయినా, రాముడితో పోల్చితే సుగ్రీవుడి బలం ఏపాటి? అయితే సీతావియోగ దుఃఖంలో ఉన్న రాముడికి సుగ్రీవుడు చేస్తానన్న సాయం ఆశాకిరణంలా తోచింది. పైగా అధర్మపరుడు, అమిత బలశాలి అయిన అతడి అన్న వాలి నుంచి అతడిని కాపాడ్డం కర్తవ్యంగా భావించాడు.

అందుకే సుగ్రీవుడికి తన స్నేహహస్తాన్ని అందించాడు. అంతేకాదు, వాలిని సంహరించి, సుగ్రీవుడికి రాజ్యాన్ని కట్టబెట్టేవరకు అండగా నిలిచి స్నేహధర్మానికి మారుపేరుగా నిలిచాడు. సుగ్రీవుడు కూడా అమిత బలపరాక్రమాలు గల ఆంజనేయుడి తో సహా ఎందరో వానర వీరులను సీతాన్వేషణలో భాగస్వాములను చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇక్కడ గ్రహించలసిందేమంటే, రాముడు బలశాలి అయిన వాలితో స్నేహం చేస్తే, అతని సాయంతో అవలీలగా రావణుని జయించగలడు. కానీ బలహీనుడైన సుగ్రీవుడితోనే స్నేహం చేశాడు. అవతలివారి ధనబ లాన్నో, అంగబలాన్నో చూసి, వారితో స్నేహం చేయాలని ఉవ్విళ్లూరేవారు ఇది గ్రహించాలి.

పూలూ దారంలాంటి స్నేహం శ్రీకృష్ణ కుచేలురది...
శ్రీకృష్ణుడు, కుచేలుడు సాందీపుని ఆశ్రమంలో సహాధ్యాయులు, స్నేహితులు. కాల క్రమేణా కృష్ణుడేమో రాజయ్యాడు, కుచేలుడేమో గంపెడంత మంది పిల్లలతో చాలీచాలని ఆదాయంతో సంసారాన్ని ఈదలేక మరింత పేదవాడయ్యాడు. దుర్భరమైన పరిస్థితుల్లో భార్య సలహా మేరకు స్నేహితుడైన కృష్ణుడి వద్దకు బయలేరాడు సాయం కోరడానికి. ఉట్టిచేతులతో వెళ్లలేక ఇంట్లో ఉన్న కాసిన్ని అటుకులను మూటకట్టుకుని వెళ్లాడు. అతని అవతారాన్ని చూసిన ద్వారపాలకులు లోపలికి పోనివ్వకుండా అడ్డుపడ్డారు. కృష్ణుడది చూసి వారిని వారించి, ఎదురెళ్లి మరీ బాల్యస్నేహితుడికి ఘన స్వాగతం పలికాడు.

కావలించుకుని, కుశలప్రశ్నలు వేస్తూ, నాకోసం ఏం తెచ్చావని అడుగుతూనే అతని మూటలో ఉన్న అటుకులను చూసి, వాటినే ఎంతో ప్రీతితో తిన్నాడు. రాచమర్యాదలతో అతనికి ఆతిథ్యమిచ్చాడు. ఈ స్నేహమాధుర్యంలో తడిసి ముద్దయిన కుచేలుడు తానక్కడికెందుకు వచ్చాడో కూడా మర్చిపోయాడు. అయితే కృష్ణుడు ఆ మాత్రం గ్రహించకుండా ఉంటాడా... స్నేహితుడు ఇల్లు చేరేసరికే అతని దారిద్య్రాన్ని తీర్చేశాడు. తరాలపాటు కూర్చుని తిన్నా తరగని సంపదను ఇచ్చాడు. స్నేహమంటే అది! తాను రాజైనా, అవతలివాడు కూటికి లేని పేదవాడైనా సరే, తనను వెతుక్కుంటూ వచ్చిన మిత్రుడు నోరు తెరిచి అడక్కుండానే అతనిక్కావలసిన దానిని అనుగ్రహించాడు. అడిగేవరకూ ఊరుకోలేదు. అడగాలని కోరుకోలేదు. అవసరమైనది ఇచ్చాడు.

అవసరార్థస్నేహం కర్ణదుర్యోధనులది...
వీరిద్దరూ గొప్ప స్నేహితులనే విషయాన్ని ఎవరూ కాదనలేరు కానీ వారిది కేవలం అవసరానుగుణమైన స్నేహమే. ఒకరి స్వార్థం కోసం ఒకరు స్నేహితులయ్యారు. ఎలాగంటే కర్ణుడు కూడా రాజపుత్రుడే! సూర్యుని అనుగ్రహంతో సహజ కవచకుండలాలతో జన్మించిన ఉత్తమ కుల సంజాతుడే!! అయినప్పటికీ, కారణాంతరాలవల్ల సూతపుత్రుడుగా పెరిగిన వాడు కాబట్టి కురుపాండవుల బలాబలాల్ని పరీక్షించే క్షాత్ర పరీక్షలో అర్జునుడితో తలపడేందుకు అతి సామాన్యుడిగా, దాసీపుత్రునిగానే కొలువుకు వచ్చాడు. అతని తేజస్సును, బలపరాక్రమాలను, వీర్యశౌర్యాలను అంచనా వేసిన దుర్యోధనుడు అతడు తనకు బాగా పనికి వస్తాడని గ్రహించి, అప్పటికప్పుడు అంగరాజ్యానికి రాజును చేశాడు.

కర్ణుడు కూడా తానెవరో, తన అర్హత ఏమిటో, దుర్యోధనుడు తనను రాజుగా ఎందుకు చేస్తానంటున్నాడో తెలుసుకోలేనంతటి అమాయకుడు కాడు. అయినా సరే,  అంగరాజుగా సుయోధన సార్వభౌమునితో పట్టం కట్టించుకున్నాడు. ఆ కృతజ్ఞతాభావంతోనే దుర్యోధనుడికి ఆఖరివరకు అండగా నిలిచాడు. తెలిసి తెలిసీ, తన వీర్యశౌర్యపరాక్రమాలన్నింటినీ నీచుడు, స్వార్థపరుడు, అధికార దాహంతో తపించిపోయే దుర్యోధనుడికే ధారపోశాడు. దుర్యోధనుడు కూడా కర్ణుడున్నాడనే ధైర్యంతోనే పాండవులతో పోరాటానికి సిద్ధపడ్డాడు. అర్జునుడి చేతిలో చస్తాడని తె లిసినా, కర్ణుడిని తన స్వార్థానికే ఉపయోగించుకున్నాడు. స్నేహమనేది వీరిలా ఉండకూడదని నిరూపించారు ఇద్దరూ.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా