కడుపు నిండుతుంది

7 May, 2018 00:59 IST|Sakshi

చూడటానికి అచ్చం మెదడు షేపులో కనిపించే వాల్‌నట్‌తో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అపరిమితం. ఈ డ్రైఫ్రూట్‌ మెదడుకు చాలా మంచిది. వీటితో కలిగే ప్రయోజనాల్లో ఇవి కొన్ని.
వాల్‌నట్‌లో చాలా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ ఉంటాయి. వాటికి తోడు అందులోని ఫీనాలిక్‌ కాంపౌండ్లు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్, గామా–టోకోఫెరాల్‌ వంటివి క్యాన్సర్‌ కణాలను చాలా బలంగా తుదముట్టిస్తాయి. రొమ్ము, ప్రోస్టేట్, ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్ల వంటి ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తాయి.
వాల్‌నట్స్‌లోని లినోలిక్‌ యాసిడ్, ఆల్ఫాలినోలిక్‌ యాసిడ్, ఆరాకిడోనిక్‌ యాసిడ్స్‌ వంటివి గుండెజబ్బులను (కరోనరీ హార్ట్‌ డిసీజ్‌) నివారిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచికొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దాంతో రక్తనాళాలలో పూడిక ఏర్పడే ముప్పును నివారితమవుతుంది.
రోజుకు మూడు లేదా నాలుగు వాల్‌నట్స్‌ తినేవారికి రక్తపోటు (హైబీపీ) ముప్పు చాలా తక్కువ. ఇది నిర్ధారణ అయిన ఫలితం.
వాల్‌నట్స్‌ కొద్దిగా తినగానే వెంటనే సంతృప్తభావన కలుగుతుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి వాల్‌నట్స్‌ చాలా మేలు చేస్తాయి.
♦  వాల్‌నట్స్‌లోని ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ మెదడుకు చాలా మేలు చేస్తాయి. అవి అయోడిన్, సెలినియమ్‌లతో కలిసి మెదడును చురుగ్గా ఉంచేలా చూస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచి మతిమరపును తగ్గిస్తాయి. మూర్చతో బాధపడేవారికి వాల్‌నట్స్‌ చాలా మంచివి.
ఇవి డయాబెటిస్‌ను చాలా సమర్థంగా నియంత్రిస్తాయి. బరువు తగ్గించడం ద్వారా కూడా ఇవి డయాబెటిస్‌ ముప్పును తగ్గిస్తాయి.
ఎముకలలోకి క్యాల్షియమ్‌ను సమర్థంగా ఇంకేలా చేస్తాయి. అలా ఇవి ఎముకల పటిష్టతకూ ఉపకరిస్తాయి.
♦  గర్భవతులకు ఇవెంతో మేలు చేస్తాయి. పిండం ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడతాయి.
నిద్రను క్రమబద్దీకరిస్తాయి. నిద్రలేమి, కలత నిద్రతో బాధపడేవారు రాత్రి భోజనం తర్వాత కొన్ని వాల్‌నట్స్‌ తీసుకుంటే మంచి నిద్రపడుతుంది.
 వాల్‌నట్స్‌ ఏజింగ్‌ ప్రక్రియను ఆలస్యం చేసి, దీర్ఘకాలం యౌవనంగా ఉంచేలా తోడ్పతయాయి. చర్మం మీది ముడుతలను నివారిస్తాయి.

మరిన్ని వార్తలు