జీవితం దుర్భరమైనా కనికరం లేదాయె!

25 Dec, 2018 06:22 IST|Sakshi
రైతు గంగన్న, భార్య, కుమారులు

నివాళి

వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చేమార్గం లేక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపడంలేదు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని నేతలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామానికి చెందిన గంగన్న(38) అనే రైతు అప్పులు తీర్చే దారి లేక ఈ ఏడాది ఆగస్టు 10న తన ఇంటిలోని పైకప్పుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు, గంగన్నకు రెండు ఎకరాల పొలం ఉంది. మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకొని పసుపు, మిర్చి పంటలను సాగు చేశాడు.  వర్షాభావంతో ఐదేళ్లుగా పంటలు సక్రమంగా పండడం లేదు.

అయితే వ్యవసాయ పెట్టుబడుల కోసం ఆయన చేసిన అప్పులు మాత్రం రూ. తొమ్మిది లక్షలకు చేరాయి. ఇందులో రూ. లక్ష బ్యాంకు అప్పు కాగా, మిగతావి ప్రైవేటు అప్పులు. అయినా, రైతు ఉపశమన పథకం కింద ఒక్క రూపాయి రుణం కూడా మాఫీ కాలేదు. అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో మానసిక క్షోభతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. గణేష్‌ ఏడో తరగతి, గౌతం ఐదో∙తరగతి చదువుతున్నారు. లక్ష్మీదేవి కూలి పనులకు వెళ్లి పిల్లలను చదివిస్తోంది. ఇద్దరు పిల్లలను చదివించుకునేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ఆమె తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి  సహాయం అందలేదన్నారు.
– ఎం. ఖాదర్‌బాష, సాక్షి, చాగలమర్రి, కర్నూలు జిల్లా
 

మరిన్ని వార్తలు