డ్రాగన్‌ ఫ్రూట్‌తో దిమ్మతిరిగే లాభాలు, మొదటి పంటలోనే 6లక్షలకు పైగా..

17 Nov, 2023 11:48 IST|Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): కరువులో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు కలసివస్తోంది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. గతంలో ఒకరిద్దరి రైతులకే పరిమితమైన తోటలు ఏడాదికేదాది అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 300 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద డ్రాగన్‌ఫ్రూట్‌ సాగు చేసే రైతుకు గరిష్టంగా రూ.1.90 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. గతంలో దిమ్మెలు పాతి దానిపై టైర్‌/బండి చక్రం అమర్చడం ద్వారా మొక్కలు పైకిపాకే ఏర్పాటు చేసేవారు. నేడు ట్రెల్లీస్‌ విధానంలో(దిమ్మెలపై టైరు/ బండి చక్రం అవసరం లేకుండా తీగలతో ) తోటలు అభివృద్ధి చేస్తున్నారు.

మొదటి పంటలోనే రూ.6 లక్షల ఆదాయం

దేవనకొండ మండలం వరిముక్కల గ్రామానికి చెందిన కంది రవీంద్రకుమార్‌ యాదవ్‌ ట్రెల్లీస్‌ విధానంలో డ్రాగన్‌ఫ్రూట్‌ సాగు చేస్తున్నారు. ఈయన కేవలం 10వ తరగతి వరకు చదువుకున్నారు. మొదటి పంటలోనే రూ. 6 లక్షల ఆదాయం పొందారు. నరసరావు పేట నుంచి మొక్క రూ.60 ప్రకారం తెప్పించి 2021లో నాటుకున్నారు. సాలుకు, సాగుకు మధ్య 14 అడుగులు, దిమ్మెకు, దిమ్మెకు మధ్య 14 అడుగుల దారంలో పోల్స్‌ నాటుకున్నారు.

పోల్స్‌కు విద్యుత్‌ లైన్‌ తరహాలో 4 వరుసలతో లైన్‌ వేశారు. పోల్స్‌ కింద ఒకదానిపైన ఒకటి ప్రకారం మూడు వైర్లు లాగారు. ఈ వైర్ల కింద అడుగు, అడుగు దూరంలో డ్రాగన్‌ ప్రూట్‌ మొక్కలు నాటుకున్నారు. మొక్కలు తీగ తరహాలో పైకి పెరుగుతూ... పైన వేసిన నాలుగు లైన్‌లు వేసి తీగలపై అల్లుకున్నాయి. దిమ్మెలపై టైరు/బండి చక్రం అవసరం లేకుండా పోయింది. ఎకరన్నర భూమిలో ఏకంగా 7వేల మొక్కలు నాటుకోగా.. పెట్టుబడి వ్యయం రూ.16 లక్షల వరకు వచ్చింది.

అంతరపంటగా వేరుశనగ

సాలుకు, సాలుకు మధ్య 14 అడుగులు ఉండటంతో ట్రాక్టరుతో సేద్యం చేసుకోవచ్చు. ప్రతి ఏటా అంతరపంటలు సాగు చేసుకునే అవకాశం ఏర్పడింది. డ్రాగన్‌ప్రూట్‌ మొక్కలకు ఆకులు రావు. తీగలపైనే అల్లుకుంటాయి. మధ్య ఖాళీగా ఉన్న భూమిలో అంతరపంటగా వేరుశనగ సాగు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు.

డ్రాగన్‌ప్రూట్‌ తోటకు మల్చింగ్‌ సదుపాయం కూడా కల్పించుకున్నారు. దీంతో కలుపు సమస్య లేకుండా పోయింది. తేమ కూడా ఆరిపోదు.. ప్లాస్టిక్‌ షీట్లకు అడగు, అడుగు దూరంలో రంధ్రాలు వేసి మొక్కలు నాటారు. మల్చింగ్‌ వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతోంది. ఏపీఎంఐపీ ద్వారా సూక్ష్మ సేద్యం కల్పించుకున్నారు.

ఐదేళ్ల నుంచి పెరగనున్న దిగుబడులు

పంటకు కేవలం పశువుల ఎరువులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. నాటిని ఏడాదిలోపే 2022 అగస్టులో కాపు మొదలైంది. మొదటి పంటలో కేవలం 3 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. 2023లో దిగుబడి బాగా పెరిగింది. ఈ ఏడాది జూన్‌లో మొదలైన పంట నవంబరు నెలతో ముగింపునకు వస్తోంది. ఈ ఏడాది ఏకంగా 60 క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. టన్ను రూ.లక్ష ప్రకారం విక్రయించారు. ఇప్పటి వరకు రూ.6 లక్షలకుపైగా ఆదాయం పొందారు. వచ్చే ఏడాది మొక్కకు 20 వరకు పండ్లు వస్తాయి. ఇవి 4 కిలోల వరకు ఉంటాయి. ఈ ప్రకారం 28 టన్నుల వరకు దిగుబడి పెరుగనుంది. నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి గరిష్టస్థాయికి చేరుతుంది.

మూడు నెలలు అధ్యయనం చేశా

డ్రాగన్‌న్‌ఫ్రూట్స్‌ సాగు చేసే ముందు మూడు నెలలు అధ్యయనం చేశా. ఒక అవగాహనకు వచ్చాక ట్రెల్లీస్‌ విధానంలో మొక్కలు నాటుకున్నా. మల్చింగ్‌, పోల్స్‌, వైర్లు, మొక్కలు తదితర వాటికి పెట్టుబడి కింద రూ.16 లక్షల ఖర్చు వచ్చింది. డ్రాగన్‌ ప్రూట్స్‌ సాగుకు ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం రూ.1.90 లక్షల సబ్సిడీ ఇచ్చింది. ఏపీఎంఐపీ కింద డ్రిప్‌ కూడా మంజూరైంది.

– కంది రవీంద్రకుమార్‌ యాదవ్‌

సాగును ప్రోత్సహిస్తున్నాం

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగును ప్రోత్సహిస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సన్న, చిన్నకారు రైతులకు గరిష్టంగా రూ.1.90 లక్షలు సబ్సిడీగా ఇస్తున్నాం. దేవనకొండ మండలం వరిముక్కల గ్రామానికి చెందిన రవీంద్రకుమార్‌ డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగులో రాణిస్తున్నారు.

– అమరనాథరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్‌, డ్వామా

మరిన్ని వార్తలు