గురు పరంపర ఆగిపోకూడదు

19 Nov, 2017 00:06 IST|Sakshi

ఆచార్య దేవోభవ

ఏ బస్సులోనో, రైల్లోనో గురువు మన పక్కనే కూర్చుని ఉన్నా, ఆయన  సరస్వతీ స్వాధీనుడనీ, మహాజ్ఞాని అనీ గుర్తుపట్టలేం. మనమెలా ఉన్నామో ఆయన కూడా అలాగే ఉంటాడు. ఆయన నోరు విప్పినప్పుడు ఆ తేడా అర్థమవుతుంది – ఆయన ఒక జ్ఞాని అని తెలుస్తుంది. పర్వతసానువులమీద కురిసిన వర్షజలాలు అక్కడే ఉండిపోతే ఏం ప్రయోజనం? జనావాసాల పక్కనుంచి నదిగా ప్రవహిస్తూ పోతే చుట్టుపక్కల భూములన్నీ సస్యశ్యామలమవుతాయి.’నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం, అస్మద్‌ ఆచార్య పర్యంతాం వందేగురు పరంపరాం’. ఆ గురుపరంపర వంశంలా, నదిలా అలా వెడుతూనే ఉండాలి. ఆగిపోకూడదు. అందుకే గురువు కూడా శిష్యుడికోసం పరితపిస్తాడు. ఆ కారణంగానే గురువు విషయంలో మార్జాల కిశోరన్యాయం అన్వయం అవుతుందంటారు. పిల్లిపళ్ళకు పదునెక్కువ. పిల్లి చర్మం మెత్తగా ఉంటే పిల్లి పిల్లల చర్మం ఇంకా మెత్తగా ఉంటుంది. అటువంటి పిల్లి దాని పిల్లలను రక్షించుకోవడానికి వాటిని పళ్ళతో కరుచుకున్నా, జాగ్రత్తగా పట్టుకుని ఒక సురక్షిత స్థానానికి తీసుకెళ్ళి భద్రంగా దాచుకుంటుంది. గురువు శిష్యుణ్ణి అలా దాచుకుంటాడు, అలా రక్షించుకుంటాడు. పతనమైపోకుండా కాపాడుకుంటాడు.

గురువు మాట సింహస్వప్నం. ఏనుగు కలలో కనిపిస్తే ఎలా ఉంటుందో, సింహగర్జనకు మిగిలిన జంతువులు ఎలా పారిపోతాయో గురువుగారి మాటకు అజ్ఞానమన్న చీకటి అలా విచ్చిపోతుంది. శిష్యుడు దారితప్పి జారిపోకుండా గురువు కాపాడుకుంటూ ధర్మపథంవైపు నడిపిస్తుంటాడు. అలా నడిపించి రక్షించగలిగిన వాడు కనుక గురువు విష్ణువు. అందుకని మార్జాల కిశోరన్యాయం అన్వయమవుతుంది.
’మర్కట కిశోరన్యాయం’ అని మరొకటి ఉంది. తల్లికోతిని దాని పిల్ల పట్టుకుంటుంది. కోతిది చాంచల్యజీవనం. ఎప్పుడు ఎటు దూకిపోతుందో తెలియదు. పక్కన ఉన్న పిల్ల ఎటు తిరుగుతున్నా తల్లికోతిని ఒక కంట గమనిస్తూనే ఉంటుంది. తల్లి కోతి కదలగానే దానికన్నా ముందే అది పరుగెత్తుకొచ్చి పొట్టకు కరుచుకుపోతుంది. ఇక్కడ తల్లికోతి పిల్లను పట్టుకోదు. పిల్లకోతే తల్లికోతిని పట్టుకుని పోతుంటుంది. చెట్లెక్కినా, గోడలెక్కినా ఎక్కడికి దూకినా పిల్లకోతి గట్టిగా పట్టుకునే ఉంటుంది. పిల్లని తల్లి రక్షించదు. తల్లిని పట్టుకుని పిల్ల దానికది రక్షించుకుంటుంటుంది. అది మర్కటకిశోర న్యాయం. శిష్యుడు గురువుగారిని  పట్టుకుంటాడు. పట్టుకుని తాను ఉద్ధరణలోకి వస్తాడు. సమర్ధుడైన గురువును చేరుకోవడానికి శిష్యుడు వెంపర్లాడతాడు. ఈ గురువే నాకు కావాలి. నేనీయన శిష్యుడిని అనిపించుకోవాలని ఎంత వెంటపడతాడో! వెళ్ళి గురువుగారిని పట్టుకుని తాను ఉద్ధరణలోకి వస్తాడు.అయితే ఈ రెండు న్యాయాలు ఒక స్థాయికి చేరుకున్నాక ఇక గురువుకి, శిష్యుడికి అన్వయం కావు. కారణం– పిల్లి తన పిల్లను ఎన్నాళ్ళు రక్షిస్తుందంటే–పిల్ల తనంత తానుగా ఆహారం తినగలిగే వరకే రక్షిస్తుంది. కోతికూడా దాని పిల్ల దానంతట అది ఆహారం స్వీకరించడం వచ్చేవరకే పోషిస్తుంది. అందుకే ఒక స్థాయి దాటిన తర్వాత మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయం రెండూ వీరికి అన్వయం కావు.గురువు మాత్రం తన శరీరం పడిపోయినా తన శిష్యుడిని కాపాడుకుంటూనే ఉంటాడు. అందుకే గురుశిష్యుల అనుబంధం తండ్రికీ, కొడుకుకీ మధ్య ఉన్న సంబంధం కన్నా గొప్పది. గురువుగారి శరీరం పడిపోతే గయాశ్రాద్ధం పెట్టే అధికారం శిష్యుడికి ఉంది. అంతగా రక్షణగా ఉంటాడు కాబట్టి గురువు విష్ణువు.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు